.
Veerendranath Yandamoori …… తెలుగు చిత్ర పరిశ్రమకి ఇళయరాజా అప్పుడప్పుడే పరిచయం అవుతున్న రోజులు. కెఎస్. రామారావు అంతకు ముందు తమిళ్ డబ్బింగులు చేసి ఉండటం వల్ల తన తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమాకి ఇళయరాజాని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు.
సత్యాన౦ద్ మాటలు. లోక్ సింగ్ కేమేరా… రాజా, కోదండరామిరెడ్డి, చిరంజీవి… మొత్తం ఐదుగురు కాంబినేషన్లో ఐదు సినిమాలు చేద్దామనుకొని ఒక అగ్రిమెంట్. అలా వచ్చినవే చాలెంజ్, రాక్షసుడు వగైరా. ఆ వరుసలో అభిలాష మొదటిది.
Ads
ఈ సినిమాకి కో- డైరెక్టర్ అజయ్ కుమార్. అతడు మద్రాసులో సాంగ్ రికార్డింగ్ దగ్గర ఉన్నాడు. విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతోంది. మరుసటి రోజు సాంగ్ షూట్.
ఇప్పుడున్నంత ఆధునిక టెక్నాలజీ అప్పుడు లేదు. ముందురోజు మెడ్రాస్ నుంచి అజయ్ కుమార్ పాట తాలూకు రీల్ తీసుకొచ్చాడు.
అందరూ గుండ్రంగా కూర్చుని ఉత్సాహంగా, ఆసక్తిగా విన్నారు.
పాట చాలా నత్తనడకల ఆలాపనతో మొదలైంది. అప్పటికి అందరూ చక్రవర్తి మ్యూజిక్ డైరెక్షన్ కి అలవాటు పడ్డవారు. పెద్ద పెద్ద సౌండ్లు… హడావుడి..!
అందరి మొహాలు పాలిపోయాయి.
ఏదో గిరిజన సంగీతంలా ఉన్నదన్నారు ఒకరు. ‘ఇదేమిటి? ఇదెలా… చిరంజీవి మీద ఈ పాటా?’ లాంటి గుసగుసలు.
డాన్స్ డైరెక్టర్ తారా మాస్టర్ “దీనికి డాన్స్ కంపోజిషన్ ఎలా చేయాలి?” అంటూ పెదవి విరిచింది.
రామారావు క్కూడా పాట నిరాశాజనకంగానే ఉన్నట్టు అనిపించింది కానీ మరుసటి రోజు షూటింగ్. క్యాన్సిల్ చేస్తే లక్షల్లో నష్టం. కాబట్టి రకరకాల కోణాల్లో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
సినిమా అందరికీ ప్రిస్టేజి. అంత స్లో సాంగ్ ని మాస్ హీరో చిరంజీవి మీద ఎలా చిత్రీకరణ చేయాలి అని కోదండరామిరెడ్డి కూడా అటు ఇటుగా ఊగాడు. అయితే సాయంత్రానికి అతడు ఒక నిర్ణయానికి వచ్చి ‘వినగా వినగా బావున్నట్టుంది. చేసేద్దాంలే’ అన్నాడు.
రామారావు ‘హమ్మయ్య’ అనుకున్నాడు. మొదటినుంచీ అతడు కాస్త కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు.
ఆ మరుసటి రోజు షూటింగ్ ప్రారంభమైంది. అంతే..! సాయంత్రానికల్లా లైట్- బోయ్ ల దగ్గర నుంచి మొత్తం యూనిట్ అందరి నోటా వేటూరి పాట “బంతీ… చామంతీ…” అంటూ కంటిన్యూయస్ గా ఆ పల్లవి రిపీట్ అవుతూ ఉండటంతో, సాంగ్ సూపర్ హిట్ అవుతుందని నమ్మకం కుదిరింది.
ఆపై ‘అభిలాష’ విజయవంతం కావటానికి వెనక ఉన్న కొన్ని కారణాల్లో ఈ పాట ఒకటిగా నిలచింది.
మార్పు మొదట నిర్ద్వంద్వంగా నిరాకరి౦పబడుతుంది. ఆపై తూట్లు తూట్లుగా విమర్శించ బడుతుంది. ఆ తరువాత ఒప్పుకోబడుతుంది.
సాయంకాలం సాగర తీరం, జయ జయ జయ ప్రియ భారత జనయత్రీ దివ్యధాత్రి, సందెపొద్దులకాడ, శుభలేఖ వ్రాసుకున్నా, ఉరకలై గోదావరి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కరిగిపోయాను కర్పూర వీణలా లాంటి ఆ పై వచ్చిన పాటలన్నీ కోదండరామిరెడ్డి ఆ మహానుభావుడి చేత ఏరి కోరి, కోరి కోరి చేయించుకున్నాడు. (ఈ క్రింది ఫోటో అభిలాష తొలిపాట ఆత్రేయ గారిది… ‘వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు’)
Share this Article