ఏ చానెల్ చూసినా సరే… ఏదో ఒక పార్టీకి డప్పు… బయాస్డ్… న్యూట్రల్ జర్నలిజం అనేది ఎలాగూ కరువైన బ్రహ్మపదార్థం ఇప్పుడు… మరి కొన్ని చానెళ్లకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి, కొన్ని ఢమాల్ అని చతికిలపడిపోతున్నయ్… ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి టాప్ త్రి పేపర్లు… ఐనాసరే, వాటికి అనుబంధంగా ఉండే చానెళ్లు పెద్దగా క్లిక్ కాలేదు… చానెళ్ల విషయానికి వస్తే టీవీ9, ఎన్టీవీ, టీవీ5 పేర్లు ప్రధానంగా స్ఫూరిస్తుంటయ్…
మరి దాదాపు చానెళ్లన్నీ ఒకే టైపు ధోరణితో నడుస్తుంటే… ఈ రేటింగుల్లో తేడా ఏమిటి..? ఉత్తదే… భ్రమ… మిథ్య… నిజంగా నిజం అదే… పత్రికల సర్క్యులేషన్ తేల్చడానికి ఏబీసీ ఉంది… అఫ్‌కోర్స్, అందులోనూ కొన్ని లోపాలున్నా సరే, ఉన్నంతలో కాస్త శాస్త్రీయంగానే లెక్కలు వేస్తుంది… ఏబీసీ పరీక్షకు నిలబడాలంటే పత్రికలో దమ్ముండాలి… అది తెలుగునాట ఈ మూడు పత్రికలకే ఉంది… వెబ్‌సైట్ల పాపులారిటీ అంచనా వేయడానికి గతంలో అలెక్సా ర్యాంకింగ్, గణాంకాల సమీక్ష ఉండేది… ఇప్పుడది మూతపడింది…
వేరే ఏ దిక్కూ లేదు గనుక… ఉన్నంతలో సిమిలర్‌వెబ్ ఆశ్రయిస్తున్నారు… అలెక్సాను ట్యాంపర్ చేసేవాళ్లు గతంలో… కాకపోతే డబ్బు ఖర్చు… ఇప్పుడు సిమిలర్‌వెబ్‌నూ ట్వీక్ చేస్తున్నారు… సరే, ఎవడి బాధ వాడిది… టీవీ చానెళ్లకు బార్క్ రేటింగ్స్ ఓ ప్రామాణికం… ఇదొక చెత్త సిస్టం… మీటర్లున్న ఇళ్లు రెండు దొరికితే, మేనేజ్ చేసుకుంటే ఇక చానెల్ నిమ్మళంగా ఉండొచ్చు… గతంలో రెండు తెలుగు న్యూస్ చానెళ్లు కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నవే… నిజానిజాల్ని ముంబై పోలీసులు బయటపెట్టలేరు… పైగా రిపబ్లిక్ టీవీ జోలికి వెళ్లి తలబొప్పి కట్టింది కూడా… ఐనాసరే, బార్క్ మారదు, మారడం లేదు, మార్చే ఆలోచన ఎవరికీ లేదు… కానీ ఆ రేటింగ్స్ బట్టి దాదాపు 30- 35 వేల కోట్ల యాడ్స్ లావాదేవీలు నడుస్తయ్…
Ads
ఈ భ్రమ, ఈ మిథ్య అని ఎందుకు చెప్పుకోవడం అంటే… గత వారం హైదరాబాద్ బార్క్ కేటగిరీలో టీన్యూస్ రెండో ప్లేసులో నిలిచింది… ఓవరాల్‌గా ఎన్టీవీ ఫస్ట్ ప్లేసులో ఉన్నా సరే, హైదరాబాదులో మాత్రం టీవీ9 చానెలే ఫస్ట్ ప్లేసు… తీరా ఈ వారం బార్క్ చూస్తే… కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్… ఒక్కసారి ఈ చార్ట్ చూడండి… ఎన్టీవీ మూడో ప్లేసుకు వెళ్లిపోగా… రెండో ప్లేసును గతవారం సాధించిన టీన్యూస్ కాస్తా ఇప్పుడు ఏకంగా అయిదో ప్లేసుకు పడిపోయింది… రోజుల వ్యవధిలోనే ఇంత మార్పా..? ఎలా..? అబ్రకదబ్ర అబ్రకదబ్ర అన్నమాటేనా..? ఈ బార్క్ ఎంత డొల్ల అనేది అర్థమవుతోంది కదా…
పైన చార్ట్ చూస్తే మరో విషయం ఆశ్చర్యం గొలుపుతుంది… అది సాక్షి… ఇది ఒక పార్టీకి బాకా అయినా సరే, సేమ్ తన వంటి కేరక్టర్లే అయిన టీన్యూస్, ఏబీఎన్‌లకన్నా దిగువకు పడిపోయింది… మరీ 0.20కు దిగువకు జారిపోయింది లిస్టులో… ఫాఫం సాక్షి… ఓవరాల్‌గా చూస్తే ఇప్పటికీ ఎన్టీవీయే ఫస్ట్… నిజానికి న్యూస్ ప్రజెంటేషన్‌లో పలుసార్లు ఓవరాక్షన్, తిక్క ప్రయోగాలు చేసినా సరే, ఇప్పటికీ పాపులారిటీలో టీవీ9 ముఖ్యం… పత్రిక అనగానే ఈనాడును చదివినట్టు… న్యూస్ చానెల్ అనగానే టీవీ9 ట్యూన్ చేస్తుంటారు… ఐనా సరే, అది సెకండ్ ప్లేసే… ఎలా అంటారా..? అదేకదా మనం ముందే చెప్పుకున్నది… ఓ భ్రమ… ఓ మిథ్య…
Share this Article