Prasen Bellamkonda…. కశ్మీర్ కథ అయింది. కేరళ కథ కూడా అయింది. ఇప్పుడిక నక్సల్ కథ. ఏదైనా రాజ్యం కోణంలోంచే చెప్పాలి. రాజ్యం భాషలోనే మాట్లాడాలి. బస్తర్ ది నక్సల్ స్టోరీ చేసింది అదే .
మావోలు దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. మావోలను సమూలంగా నిర్మూలించనిదే దేశానికి శాంతి లేదు. గిరిజనులు కూడా మావోలను కసితీరా చంపి పారేయాలన్న పగతోనే బతుకుతున్నారు. మావోలకు వందల కోట్ల నిధులు అందుతున్నాయి. మావోలకు ఇస్లామిక్ ఆర్గనైజేషన్లతో సంబంధాలున్నాయి. మావోలకు ఎల్టిటిఈ లాంటి అనేక ఇతర ఉగ్రవాద సంస్థలతోనూ అనుబంధం ఉంది. మావో అనుకూల విద్యార్థి సంఘాలు, ఎన్జీవో లు, రచయితలు దేశ వ్యతిరేక కుట్రలే చేస్తున్నారు…. అనే పెట్టుబడిదారీ వాట్సాప్ వాదనలను తెరనిండా పరిచేశారు సినిమా సృష్టికర్తలు.
నక్సలిజం గురించి బస్తర్ గురించి ఏమీ తెలియని ఏ యువకుడో ఈ సినిమా చూస్తే ఇవన్నీ అక్షర సత్యాలనుకునే ప్రమాదం అక్షరాలా ఉంది . ఎందుకంటే ఈ అబద్దాల ప్రెజెంటేషన్ కెమెరా పనితనంలోనూ బిజీయమ్ శ్రావ్యతలోనూ స్క్రీన్ ప్లే బిగువులోనూ గొప్పగా ఉంది మరి. సినిమాలో లేనిదల్లా నిజం. వాస్తవ ఘటనల ఆధారంగా తీసాం అని చెప్పుకుంటూ వాస్తవానికి ఆమడకంటే ఎక్కువ దూరం వెళ్లిపోయారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసామని చెపుతూనే పాత్రలు పాత్రధారులు కల్పితం అని డిస్క్లైమర్ కూడా వేసిన గందరగోళం ఏదైతే ఉందో అది సినిమా నిండా పుష్కలంగా ఉంది.
Ads
మావోయిజం పట్ల రవ్వంత సానుభూతి సంగతి పక్కన పెడితే కనీస అవగాహన కూడా లేని కథకుడు, దర్శకుడు ఒక్క దగ్గర మోపై 2010లో 72 మంది జవాన్లను మావోలు చంపిన ఘటనను అడ్డు పెట్టుకుని అవాకులు చెవాకులు పేలారు. నిజ ఘటనలో చనిపోయింది సియార్పియఫ్ జవాన్లైతే సినిమాలో పోలీసులుగా మార్చారు. అబూజ్ మాడ్ ను అబూజ్ మార్గ్ అనీ మహేంద్రకర్మను రాజేంద్ర కర్మ అనీ మార్చినపుడు ఇలా మాత్రం ఎందుకు చేయకూడదు అనుకున్నారేమో.
మావోలు మీడియాను, ఉద్యమకారులను డబ్బులతో కొని పబ్బం గడుపుకుంటున్నట్టు చూపించేసిన దర్శక మహానుభావుడు సాల్వాజుడుం అరాచకాల గురించి విపులంగా మాట్లాడడానికి మాత్రం సాహసించలేకపోయాడు. మహేంద్ర కర్మను పెంచి పోషించింది ప్రభుత్వమేననీ, సల్వాజుడుం అనేది గిరిజనుల మధ్య చీలిక తెచ్చే సమాంతర పోలీస్ వ్యవస్థ అనీ, కోర్టు సల్వాజుడుంను నిషేధించినా ఆ తరవాత కొద్ది రోజులకే ‘శాంతిసేన’ పేరుతో అదే వ్యవస్థను ప్రభుత్వం కొనసాగించిందనీ దర్శకుడు చూచాయగా కూడా సెలవీయలేదు పాపం. పైగా మావో పెద్దకు చేగువేరా పోలిన గెటపొకటి.
మావోలు రోడ్లు వెయ్యనివ్వరు అనే ఆరోపణ చేసే ఈ సినిమా రోడ్లను ఎందుకు వెయ్యనివ్వరో ఒక్క కారణం కూడా చెప్పే ప్రయత్నం చేయదు. నక్సలైట్లను బందిపోట్లు, థగ్గులు పిండారీల స్థాయికి దించేసిందీ సినిమా భావజాలరాహిత్యం. అసలు భావజాల ఘర్షణను చర్చించే ప్రయత్నమే ఎక్కడా జరగలేదు. అడవుల్లోని ఖనిజాల కోసం ఇదంతా జరుగుతోందని ప్రస్తావించే పాత్రలు అది చేస్తోంది ఎవరు అనే విషయం మాత్రం చెప్పవు. మావోలే ఖనిజాలను అమ్ముకుంటున్నారన్న ధ్వని సంభాషణల్లో వినిపించడం పరమ దుర్మార్గం.
అక్కడి పిల్లలకు చదువు లేక వైద్యం అందుబాటులో లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని కథన సౌకర్యం కోసం రాసుకున్నారు కానీ అబుజ్ మాడ్ లో స్కూళ్ళున్నాయి, ఆసుపత్రులున్నాయి అనే విషయం సినిమా సృష్టికర్తలకు తెలిసుండదు లేదా తెలియనట్టు నటించయినా ఉండాలి.
ఆ 72 మంది మరణించిన ఘటనను కవర్ చేసిన రిపోర్టర్ గా, బస్తర్ అబూజ్ మాడ్ లో అణువణువునా తిరిగిన వ్యక్తిగా, మహేంద్ర కర్మను రెండు సార్లు ఇంటర్వ్యూ చేసిన విలేకరిగా నాకైతే సినిమా చూస్తున్నంతసేపూ మెదడు, మనసూ కుతకుతలాడుతూనే ఉన్నాయి నిస్సహాయంగా.
అదా శర్మ ఐపిఎస్ అధికారిగా సరిపోలేదు. ఇంకా చెప్పుకోదగ్గవారెవరూ లేరు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ‘బస్తర్ ది యాంటి నక్సల్ స్టోరీ’ అను రాజ్య ప్రాయోజిత చిత్రరాజమిది.
Share this Article