ఏమీ..? ఏమిటిరా…? బతుకమ్మా బతుకమ్మా, ఎక్కడ పోతవురా, ఇక్కడ రా… ఎంకన్నా ఎంకన్నా ఎక్కడ పోతవురా, ఇక్కడ రా…. చిన్నమ్మా చిన్నమ్మా ఎక్కడ పోతవురా..? ఇక్కడ రా……….. ఇదీ పల్లవి… ఏమనిపించింది..? ఏదో పాత తెలుగు సినిమాలో పాట అయి ఉంటుందిలే అనిపిస్తోంది కదా…! కానీ కాదు… ఓ హిందీ సినిమాలోనిది… 1969లోనే మన బతుకమ్మ అనే పదాన్ని పలికించిన పాట అది… సంగీత దర్శకుడు శంకర్ జైకిషన్… నిన్న చెప్పుకున్నాం కదా… జీవితచక్రం అనే పాత ఎన్టీయార్ సినిమాలో ఇదే శంకర్ జైకిషన్ 1971లో బతుకమ్మ పాటను ఖూనీ చేసిన తీరును… సినారె చేసిన అకృత్యాన్ని..! మరి అంతకుముందు రెండేళ్ల క్రితం బతుకమ్మ గురించి తెలిసిన శంకర్ జైకిషన్ ఎందుకంత నీచంగా ట్యూన్ చేశాడో అర్థం కాదు…
నిజానికి అప్పట్లో ఒకటీ అరా తెలుగు పదాల్ని హిందీ ట్యూన్లలో వాడుకోవడం అలవాటే… రామయ్యా వస్తావయ్యా పాట తెలిసిందే కదా… అలాగే ఈ బతుకమ్మా అనే పదాల్ని వాడినట్టున్నారు శంకర్- జైకిషన్… కానీ హిందీవాళ్లు తెలుగు పదాలు పలికితే ఎలా ధ్వనిస్తాయో అచ్చు అలాగే… వీసమెత్తు తెలుగు వాసన లేకుండా ఆ వాక్యాల్ని పలికారు గాయకులు మహమ్మద్ రఫీ, శ్రద్ధా రాజన్ అయ్యంగార్… ఈ పాటను కూడా ఏదో ఉదాత్తమైన సీన్‌కో లేక రొమాంటిక్ బిట్‌కో వాడలేదు… అచ్చమైన క్లబ్ సాంగ్ ఇది… మెహమూద్, హెలెన్ మీద చిత్రీకరించారు… ఇది జెమిని స్టూడియోస్ వాళ్ల సినిమా… దర్శకుడు ఎస్ఎస్ వాసన్ చివరి సినిమా…
Ads
ఇదీ ఆ పాట యూట్యూబ్ లింక్… https://youtu.be/aAJ4asMYepc
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంగతి ఉంది… ఇది ఓ గూఢచారికి సంబంధించిన సినిమా… థ్రిల్లర్… అప్పట్లో ఇలాంటి సినిమాలే బాగా నడిచేవి కదా… అయితే ఈ సినిమా చైనాకు వ్యతిరేకంగా ఉందంటూ బెంగాల్‌లో నక్సలైట్లు ఈ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌ను పేల్చేయడానికి ప్రయత్నించారు… సకాలంలో పోలీసులు ఆ బాంబుల్ని తొలగించారు… అక్కడికి ఒకటీరెండు థియేటర్లను కాలబెట్టారు… దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని థియేటర్ల నుంచీ ఈ సినిమాను తీసేయించింది… అదీ మనం..! మన కమ్యూనిస్టు, మార్క్సిస్టు, నక్సలైట్ పార్టీలు అప్పట్లో చైనా చెప్పినట్టు ఆడేవి… ఇప్పటికీ సీపీఎం… ఆ దేశానికి వ్యతిరేకంగా ఉందనే అపోహతో ఓ సినిమానే వ్యతిరేకించి, థియేటర్ల దహనం దాకా వెళ్లిపోయారు… మన శతృదేశం పట్ల కూడా మన దేశవాసులు వ్యతిరేకతతో ఉండకూడదన్నమాట… ఉంటే ఇలా చేస్తారు… ఏం ఎర్ర పార్టీలురా బాబూ…!!
Share this Article