తమిళ పాట.. కత్తెర మాసపు ఆట …
తమిళంలో ‘నాట్టామై’ అనే సినిమా ఉంది తెలుసా? దాన్నే తెలుగులో ‘పెదరాయుడు’గా తీశారు. అక్కడా ఇక్కడా పెద్ద హిట్! అందులో ‘కొట్టా పాక్కుం.. కొళుందు వెత్తలయుం’ పాట ఇంకా పెద్ద హిట్టు! తమిళంలో సంగీత దర్శకుడు సిర్పి గారు స్వరపరచిన ఆ పాట భారీ హిట్ కావడంతో తెలుగులోనూ అదే ట్యూన్ వాడారు. ఇక్కడ పాట గుర్తుంది కదా!? ‘బావవి నువ్వు.. భామని నేను..’
సరే! ఇదంతా చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటి? తమిళంలో ఆ పాటను వైరముత్తు రాయగా.. మనో, ఎస్.జానకి గారు పాడారు. పాటలో జానకి గారి ఎక్స్‌ప్రెషన్ ఉంటుందీ.. మహాప్రభో! అద్భుతః! పాటలో మొదటి చరణంలో ఆమె పాడే లైన్ ఇలా వస్తుంది.
Ads
“కత్తిరి వెయిలు.. కొదిప్పదుపోళె
కాచ్చల్ అడిక్కిదు ఇడుప్పుకు మేళె..”
(తెలుగులో ‘బావవి నువ్వు’ పాటలో ‘పైన చూస్తే తళుకుల తార.. లోన చూస్తే వెన్నెల ధార’ ట్యూన్‌లో పై లైన్స్ పాడుకోండి).
“కత్తిరి ఎండ ఉడికిస్తున్నట్టు.. నడుముకు పైన జ్వరం కాస్తోంది” అనేది పైన రాసిన తమిళ మాటలకు అర్థం. ఇందులో ‘కత్తిరి వెయిల్’ అనే మాట కొత్తగా అనిపించింది. ఏంటి దాని అర్థం? (ఇదే పాట తెలుగులో కత్తెర చూపులు కొడితే అని ఉంటుంది ఓచోట)
వెయిల్ అంటే తమిళంలో ఎండ. సూర్యుడు కృత్తికా నక్షత్రంలో ఉండే 25 రోజుల కాలాన్ని ‘కత్తిరి వెయిల్’ అంటారు. దీనికే ‘అగ్నినక్షత్రం’ అనే పేరుంది. తమిళ క్యాలెండర్ ప్రకారం మే 8 నుంచి మే 24 వరకు ‘కత్తిరి వెయిల్’ ఉంటుంది. ఈ సమయంలో విపరీతమైన ఎండలుంటాయి. ఈ సమయంలో వ్యవసాయ పనులు చేయరు. కొత్తగా ఎటువంటి పనులూ మొదలుపెట్టరు. కత్తిరి వెయిల్ సమయాన్నే కొందరు ‘కత్తారి/కర్తరి’ అని కూడా పిలుస్తారు. తెలుగులోనూ ఈ సమయానికి ‘కత్తెర మాసం’ అని, ‘కర్తరి కాలం’ అని పేర్లు ఉన్నాయి.
తెలుగు పాటల్లో ఇలాంటి మాటలు ఎక్కడా వాడగా వినలేదు. తమిళ పాటలో ఎంత బాగా వాడారో చూస్తుంటే భలేగా అనిపిస్తోంది.
PS: తమిళ సినిమా ‘నాట్టామై’లో ఈ పాటకు అభినయించింది శరత్‌కుమార్, ఖుష్బూ. ఈ పాటలో ఖుష్బూ గారి ముఖకవళికలు, డ్యాన్స్‌లో అందం చూసి తీరాలి. వహ్వా!! – విశీ (తెలుగులో ఈ పాటను చిత్ర పాడింది… భానుప్రియ హీరోయిన్… భువన చంద్ర అనువాదం… సంగీతం కోటి… కొత్తకోక కిర్రెక్కిపోనీ, సన్న కైక వెర్రెత్తిపోనీ, కన్నెసొగసే గుమ్మెత్తిపోనీ… ఇలా సాగుతుంది పాట…)
Share this Article