Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నడుమ వాళ్లేం తప్పు చేశారు..? ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏమీ కారు..!!

July 30, 2026 by M S R

.

పావలా శ్యామల… టాలీవుడ్‌లో ఏళ్ల తరబడీ పనిచేసిన ఆర్టిస్టు… అవకాశాల్లేకుండా పోయాక, తను, తన బిడ్డ చాలా కష్టాలు పడ్డారు… ఓ దశలో ప్రాణాలే వదిలేయాలనుకున్నారు… చివరకు శ్యామల కన్నుమూసింది, ఆ బిడ్డ అనాథగా మారింది… విషాదమే… తప్పకుండా చింతించాల్సిన సంగతే… కానీ..?

ఆ బిడ్డ మాట్లాడుతూ దిల్ రాజు, చిరంజీవి పట్టించుకుని ఉంటే తన తల్లి ఇంత దిక్కులేని చావుకు గురై ఉండేది కాదని, తను అనాథను అయిపోయేదాన్ని కాదనీ ఏదో ఆరోపించింది… సరే, తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఏదో అంటోంది… కానీ..?

Ads

ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఆర్టిస్టుకూ చిరంజీవి, దిల్ రాజు ఏం బాధ్యత తీసుకోవాలి..? ఎందుకు..? ఇది పెద్ద ప్రశ్న… కనీసం ‘మా’ అసోసియేషన్ బాధ్యత అని ఆరోపించినా అర్థం ఉండేది… నిజానికి ఎవరైనా ఆపత్కాలంలో ఎంతో కొంత సాయం చేస్తారు గానీ మొత్తం బాధ్యత తీసుకునేది ఎవరు..? వాళ్లను నిందించడం దేనికి..?

పావలా శ్యామల

ఎస్, ఆమెకు కొన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది, మా అసోసియేషన్ సాయం చేసింది, ఇదే చిరంజీవి, పవన్ కల్యాణ్ తదితరులు సాయం చేశారు… ఆమధ్య ఓ పోలీసు ఆఫీసర్ కూడా సాయం చేశాడని వార్తల్లో చదివినట్టు గుర్తు… సొసైటీ ఆమెను వదిలేయలేదు, ఏదోరకంగా సాయం చేస్తూనేే ఉంది… కానీ..?

కీలకమైన ప్రశ్న… ఆమె బాగోగులకు సమాజం ఎందుకు బాధ్యత వహించాలి..? తనే కాదు, ఎవరికైనా ఎవరూ బాధ్యత వహించరు… ఎవరి జీవితాలు వాళ్లవే… అది నిష్ఠుర నిజం… సంపాదన ఉన్న రోజుల్లోనే ఎంతోకొంత జాగ్రత్త పడాలి… ఇక్కడ ఎవరికీ ఎవరూ ఏమీ కారు…

సరిగ్గా ఏడాది క్రితం… ఫిష్ వెంకట్ మరణించినప్పుడు ‘ముచ్చట’ ప్రచురించిన ఓ కథనం… గుర్తొచ్చింది… అది ఈ సందర్భానికీ ఆప్ట్… ( ఆ కథనం ఇదీ…)



Mohammed Rafee …… ఇదొక గుణపాఠం! – ఇండస్ట్రీ రాలేదని తప్పు పట్టక్కర లేదు

రెండు కులాల అధిపత్యాలు, ఉన్నోళ్లు లేనోళ్ళు, చిన్న నటుడు పెద్ద నటుడు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తమ అనవసర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు! వారి వారి “వంటలు” చూసాక అవసరమైన నా భావాన్ని నా ఆలోచనను రాయాలనిపించింది! వాళ్ళది అనవసరం, నాది అవసరం అని వూరికే అనలేదు! దానికొక రీజన్ వుంది! చదివాక మీకు అర్ధం అవుతుంది!

ఫిష్ వెంకట్ కుమార్తె మాట్లాడుతూ “నాన్న నటించిన సినిమాల్లో హీరోలు స్పందిస్తారనుకున్నా, ఎవ్వరూ పట్టించుకోలేదు. నాన్నతో నటించని విశ్వక్ సేన్, కృష్ణ మాండ్యా చెరో రెండు లక్షలు ఇచ్చారు. మంత్రి శ్రీహరి లక్ష ఇచ్చారు, మైనంపల్లి రెండు లక్షలు ఇచ్చారు! వీటితో కిడ్నీ వస్తదా? గతంలో పవన్ కళ్యాణ్ రెండు లక్షలు ఇచ్చారు. ఈసారి ఏమివ్వలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తనే మళ్ళీ… మీడియా ముందు మేం చూసుకుంటామని చెప్పే వారే అందరూ, ఆ తరువాత పట్టించుకున్న వారు లేరు అని చెప్పింది. నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయారు! నిన్న అడ్డగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి! ఇండస్ట్రీ మొత్తం వచ్చి నివాళులు అర్పించలేదు అనేది కొన్ని మీడియాల ఆవేదన!

ఇండస్ట్రీ మొత్తం అసలు ఎందుకొస్తుంది? ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? కోట శ్రీనివాసరావుకు వచ్చారుగా అని ఒక మిత్రుడు నాకు ఎదురు ప్రశ్న వేశాడు! తెలుగు సినీ రంగంలో కోట శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్ ఒక్కటేనా? తెలియనంత చెప్పలేనంత తేడా వుంది!

పోనీ, ఇద్దరూ సమానమే అని కాసేపు అనుకుందాం! మెయిన్ మీడియా కోట ఇంటి దగ్గర లైవ్ పెట్టారు! మరి ఫిష్ వెంకట్ ఇంటి దరిదాపులకైనా వెళ్ళారా? అక్కడకు వచ్చింది కేవలం వ్యూయర్స్ పెంచుకునే యూట్యూబర్లు మాత్రమే హడావిడి చేశారు! అదే తేడా!

ఇండస్ట్రీలో కులం కాదు! ఒక ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు, సాంకేతిక నిపుణుడు చనిపోతేనే ఇండస్ట్రీ తరలి వస్తుంది! మనం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం! చిన్న చిన్న నటులు ఎందరో చనిపోయారు! టివిల్లో సరేసరి, కనీసం పత్రికల్లో సింగిల్ కాలమ్ వార్తకు నోచుకోలేదు!

అంతెందుకు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా చనిపోతే ఎంతమంది సందర్శించారు! బెంగళూరులో సీనియర్ నటి సరోజా దేవి చనిపోతే ఒక్కరైనా వెళ్ళారా? వెళ్ళలేదు! జమున అంతిమ యాత్రలో ఆ ఒక్క రథం ఒంటరిగా వెళ్ళింది! సినిమాను కొద్దో గొప్పో ప్రభావం చూపిస్తే సరిపోదు! కొన్ని ఈక్వేషన్స్ ఉండాలి! వేవ్ లెంత్ సరిపోవాలి!

cine life

సైడ్ విలన్ లేదా చిన్న చిన్న పాత్రలు వేసే నటులు చనిపోయినా ఇండస్ట్రీ తరలి రావాలనుకోవడం, రాలేదని దెప్పి పొడవడం అనవసరం! పెద్ద నటులకే రాలేదు! ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని వేదికలపై అన్నంత మాత్రాన కుటుంబ సభ్యులమే అని అనుకోవడం తప్పు!

ఫిష్ వెంకట్ అనేక సినిమాల్లో సైడ్ విలన్, గ్రూప్ విలన్, అసిస్టెంట్ విలన్ పాత్రలు వేసి తనదైన తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఆకట్టుకున్నాడు! అమాయకంగా నవ్వించి గుర్తింపు పొందాడు! వూరికినే ఏమీ నటించలేదు! చేపల వ్యాపారం కూడా వదిలేసి సినిమాల్లో బిజీ అయిపోయే అంతగా సంపాదించాడు! నిలబెట్టుకోలేకపోయాడు, అది వేరే విషయం!

మొన్నటికి మొన్న “అన్నం తిని నాలుగు రోజులు అయ్యింది” అని కంట తడి పెట్టిన పాకీజా కూడా అంతే! ఎవ్వరూ వూరికే నటించలేదు! పాపం ఆమెకు పడిన సినిమాలు కూడా తక్కువే! ఆమె ఏం సీనియర్ నటి కాదు! ఉండేది తమిళనాడులో! గతంలో తెలుగు సినీ పరిశ్రమలో కొందరు సాయం చేశారని, మళ్ళీ వచ్చి మీడియా ముందు కన్నీళ్లు పెడితే, పవన్ కళ్యాణ్ స్పందించి రెండు లక్షలు ఇచ్చి పంపించారు! అదొక అలవాటుగా మారిపోయింది ఆమెకు!

ఫిష్ వెంకట్ చనిపోయాడు కాబట్టి అనకూడదు, కానీ మిగిలినవారికి కొంత గుణపాఠం అవుతుందనే ఉద్దేశ్యంతో కొంత సాహసం చేయాల్సి వస్తోంది! ఒకరకంగా చెప్పాలంటే “వద్దు” అని ఇంటా బయటా చెప్పినా వినకుండా మందుకు బానిస అయిపోయాడు! సంపాదించింది సంపాదించినట్లుగా ఇష్టారాజ్యాంగా ఖర్చు పెట్టేసాడు! రోజుకు 35 గుట్కాలు నమిలేవాడ్ని అనే తనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకున్నాడు!

ఆరోగ్యం దెబ్బతింటున్నా లెక్క చేయలేదు! “మనల్ని ఎవడ్రా ఆపేది” అన్నట్లు తాగి గ్యాంగ్రీన్, అఖరుకు కిడ్నీలు పాడై పోయే స్థితికి చేరుకున్నాడు! వేరే ఆసుపత్రిలో చేరిస్తే రోజుకు 70 వేలు అవుతూ వచ్చింది! కొందరు దాతలు సహకరించారు! ప్రభుత్వం కూడా స్పందించింది. అఖరకు మంత్రి శ్రీహరి కూడా సందర్శించి పరామర్శించి, సొంత డబ్బులు కొంత ఇచ్చి, ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు!

ఆ ఆసుపత్రిలో కాస్త ఇబ్బందిగా ఉందని వారి బంధువుల అసువత్రికి మార్చి కిడ్నీ డోనర్ కోసం వెతుకుతున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆయన కనుమూశారు! ఆయన సహచర నటులు మిత్రులు పెద్ద ఎత్తున వచ్చారు. నివాళులు అర్పించారు! కానీ, ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవ్వరూ రాలేదని, ఎందుకు పట్టించుకోలేదని నటులు ఎవ్వరూ చెప్పలేదు! కేవలం మీడియా మాత్రమే ఆ అనవసరపు గొంతుక వినిపించింది!

ఫిష్ వెంకట్ అన్ని సినిమాల్లో నటించాడు కానీ, “మా” సభ్యత్వమే తీసుకోలేదు! “మా” సభ్యుడు కాకపోయినా ఆ సంస్థ స్పందించింది! అసలు మా సంస్థలో సభ్యత్వం తీసుకుని ఉంటే ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండేది!

చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న రోజులు! సొంత ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్న రోజులు! కానీ, ఫిష్ వెంకట్ అవేమి పట్టించుకోక పోవడం విచారకరం!

ఫిష్ వెంకట్ మృతి సినీ రంగంలో ఉన్న చిన్న చిన్న నటులకు పెద్ద గుణపాఠం కావాలి! గబ్బర్ సింగ్ కామెడీ విలన్లు నిన్న వెంకట్ అంతిమ యాత్రలో ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో వున్నప్పుడు కొందరు నటులు మానవతా దృక్పథంతో సాయం చేశారు! అలా సాయం చేస్తారులే అని భరోసాగా ఉండకండి!

ఫిష్ వెంకట్ కుమార్తె చెప్పినట్లు ఎవ్వరూ ఎవ్వరికీ ఏమీ చేయరు! మాట సాయం చేయగలరేమో కానీ, ఆర్ధిక సాయాలు అందరూ చేయరు! చేసినా వాటి ఈక్వేషన్స్ వాటికి ఉంటాయి! అసలు వాళ్ళు వీళ్ళు సాయం అని ఆలోచించకుండా అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి!

సంపాదించింది ఖర్చు పెట్టేయకుండా అందులో కొంత దాచుకోవాలి! మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి ఉండేలా చూసుకోవాలి! అన్న ఫిష్ వెంకట్ పోయి, అందరికి కళ్ళు తెరిపించాడనుకోవాలి! అందరూ జాగ్రత్తగా ఉండాలి! నాకు మీకు అందరికి ఇది వర్తిస్తుంది! – డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘రామాయణ’లో పేలవమైన వీఎఫ్‌ఎక్స్ ? లేక కొత్త సౌందర్య దృక్పథమా?
  • ఎవరు గురువు – ఎవరు శిష్యుడు ! అంతా హరీష్ హెలూసినేషన్ !!
  • స్మాల్ బడ్జెట్ – బిగ్ రెవిన్యూ ! కథాకథనాలు బాగుంటే కటౌట్లు దేనికోయ్ !!
  • అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!
  • దురంధర్ సినిమాలో చూపించింది ఈమెనే ! ఆ త్యాగానికి అశోకచక్ర !!
  • ‘‘భావి తరాలు రీల్స్‌ బందీలు – ‘రిథమ్’ తప్పిన అల్గా‘రిథమ్ బతుకులు’’
  • క్షుద్రపూజలు సరే – మరి ప్రేతాత్మలు..? పితృకర్మలు..? (నాలుగో భాగం)
  • క్షుద్రోపాసన ! నెత్తురు, మద్యం, ఎముకలు, పుర్రెలు ! (మూడో భాగం)
  • దుష్టశక్తి కాష్మోరాలు !! అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? (రెండో భాగం)
  • హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions