.
తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ఓ నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. అది మహిళ తలెత్తుకుని, ఆత్మగౌరవంతో బతికెే విప్లవం… మహిళా సాధికారత..! ఒకప్పుడు కేవలం ఇంటి పనులకో, పొలం పనులకో పరిమితమైన మహిళలు.. నేడు గ్లోబల్ మార్కెట్లను పలకరిస్తున్నారు… ప్రవేశిస్తున్నారు… వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామానికి చెందిన ఒక సాధారణ మహిళా రైతు ఎనిమిది పెట్టెల ‘మల్లిక’ రకం మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం చిన్న విషయంగా అనిపించవచ్చు… కానీ, ఇది తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సాధించిన, ఇంకా సాధించబోతున్న ఒక చారిత్రాత్మక విజయానికి తొలి అడుగు! సంకేతం!
ఒకప్పుడు పొలం దగ్గరకు వచ్చే దళారుల చేతిలో మోసపోతూ, కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కక అల్లాడిపోయిన చిన్న, సన్నకారు రైతులకు ఇప్పుడు కొత్త ధీమా వచ్చింది… పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) మార్గదర్శకత్వంలో… మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs), రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) కలిసి గ్రామీణ ఆర్థిక చిత్రపటాన్నే మార్చేస్తున్నాయి…
Ads
‘బేనిషాన్’… ఒక బ్రాండ్, ఒక భరోసా! …. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో విస్తరించి ఉన్న 84 రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేలుకలయికే ‘బేనిషాన్’ (Be’nishan) ఫెడరేషన్... పూర్తిగా మహిళల అండదండలతో నడుస్తున్న ఈ నెట్‌వర్క్, చిన్న రైతులను నేరుగా అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ రిటైల్ దిగ్గజాలతో అనుసంధానించింది… మధ్యవర్తుల దోపిడీకి ఇక్కడ తావులేదు… శాస్త్రీయ వ్యవసాయం, ఉమ్మడి మార్కెటింగ్ పద్ధతులతో తెలంగాణ పంటలకు గ్లోబల్ గుర్తింపు తెస్తున్నారు మన మహిళలు…
అంకెల్లో కనిపిస్తున్న ప్రగతి… ఈ సమిష్టి కృషి సృష్టించిన ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేనిది… సాధించిన మైలురాళ్లు ఓసారి చూస్తే…
-
₹463 కోట్ల వ్యాపారం…: అతి తక్కువ కాలంలోనే ఊహించని స్థాయిలో టర్నోవర్ సాధించారు…
-
1.09 లక్షల మందికి పైగా రైతులు…: ఇంతమంది చిన్న, సన్నకారు రైతులకు ఈ నెట్‌వర్క్ ప్రత్యక్షంగా అండగా నిలిచింది…
-
15% నుండి 20% అదనపు ఆదాయం…: నాణ్యమైన సాగు, సరైన మార్కెటింగ్ వల్ల రైతులకు లాభాలు పెరిగాయి…
-
కేవలం 2 రోజుల్లోనే చెల్లింపులు..: పంట అప్పగించిన 48 గంటల్లోనే రైతుల చేతికి డబ్బులు అందుతున్నాయి…
రిలయన్స్ నుండి ఫ్లిప్‌కార్ట్ వరకు.. మన పల్లె రుచులు! …. తెలంగాణ పల్లెల్లో పండిన నాణ్యమైన పంటలు ఇప్పుడు దేశీయ దిగ్గజాలైన రిలయన్స్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్, మెట్రో, మోర్, స్టార్ బజార్ వంటి మాల్స్ షెల్ఫ్‌లను అలంకరిస్తున్నాయి… ఇక్కడితో ఆగకుండా సముద్రాలు దాటి విదేశీ మార్కెట్లకు కూడా తరలివెళ్తున్నాయి…
మారుతున్న మహిళల పాత్ర…: నిన్నటివరకు కేవలం పొదుపు సంఘాలకే పరిమితమైన మహిళలు… నేడు అగ్రి-ఆంట్రప్రెన్యూర్లుగా (వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా), సప్లై చైన్ మేనేజర్లుగా, అంతర్జాతీయ ఎగుమతిదారులుగా రూపాంతరం చెందారు…
నాణ్యతే బ్రాండ్.. ఆత్మవిశ్వాసమే పెట్టుబడి! …. శాస్త్రీయ పద్ధతిలో కోతలు కోయడం, గ్రేడింగ్, సార్టింగ్ చేయడం దగ్గరనుంచి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్యాకేజింగ్ చేయడం వరకు అన్నింట్లోనూ తెలంగాణ మహిళలు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు… సరైన సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తే గ్రామీణ భారతం ప్రపంచంతో పోటీ పడగలదని వారు నిరూపించారు… నిరూపిస్తున్నారు…
ఇక్కడ తెలంగాణ మహిళలు కేవలం మామిడి పండ్లను మాత్రమే పండించడం లేదు… పల్లెల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, సుస్థిర జీవనోపాధిని పండిస్తున్నారు… గ్లోబల్ వేదికపై తెలంగాణ గ్రామీణ శక్తిని సగర్వంగా చాటుతున్నారు…! ప్రభుత్వం చేయూతనిస్తే, మార్గదర్శనం కల్పిస్తే… మహిళలు ఏదైనా సాధించగలరు… పల్లెల ముఖచిత్రమూ మార్చగలరు..!!
Share this Article