పక్కబట్టల గుసగుసలు~~~~~~~~~~~~~~~~
మల్లెపువ్వుల లెక్క
తెల్లటి తెలుపుతోటి
Ads
సన్నగ నున్నగ నేసిన
నూలుబట్ట తానుకొని
మిషినుమీద కుట్టిచ్చిన
మెత్తగౌసెన్లు
పరుపుగౌసెన్లు
కుచ్చులు బొందెలు
తొడిగనేర్చిన ఒకానొక కళాత్మకత
తొడుగుటానికి పోటీవడె పిల్లల ఆరాటం… !
ఒకప్పటి ఇంఢ్లన్ని
బయిరంగమేనాయె
చలికాపేది దుప్పటొక్కటే
ఎలుపుకెలుపు దొడ్డుకుదొడ్డు
గుండుపోగుతోటి నేసిన
మోతకోలు బరువుండే
ముదురురంగు తెలుపుదుప్పట్లు
ఎన్నివుంటే అది అంతపెద్ద సంసారమన్నట్టు… !
ఇంట్లున్న అందరికి —
పట్టెమంచాలు ఉంటయా ?
పత్తిపరుపులు దొరుకుతయా ??
పక్కబట్టలంటే చానవరకు చేతవోసిన బొంతలేమరి.
ఎవలకు ఉన్నా – లేకున్నా
ఆ ఇంటి యజమానికి మాత్రం
ఓ బల్లపీటనో, నవారు పట్టెమంచమో
దానిమీద నిండుగ జానెడెత్తుతోటి పరుపు
పరుపుకుదగ్గ నెరువున్న పెద్దదుప్పటి తప్పనిసరి.
పిలగండ్లను ఈ తాతలపక్కల్ల పండుకోవెట్టేవాళ్లు
ముసలివాసన గిట్టకపొయిన పరుపుమీద భమకు
వెచ్చటి దుప్పటికోసం పిల్లలుగూడ సంబురపడేటోళ్లు.
ముసలోడు సైసకపోతె, ముసలామె పక్కల వేసుకునేది.
మిగిలినోళ్లందరికి.. ఇగ గంతకుదగ్గ బొంతలే దిక్కు.
కాళ్లకట్టలు వొదలయి నులుకదెగిన బొందమంచాలు
పాతనవారు ఎదురేసికుట్టిన కర్రుకిర్రు కుక్కిమంచాలు
వీటిమీదికి ఎలుకలుగొట్టిన చెద్దర్లు, పలుచవఢ్డ గొంగళ్లు.
చుట్టానికి ఉన్నంతల మంచిపక్కబట్టలేస్తే అదే గొప్పనడుక.
మనిషిదాపున మనుషివంటే చలికాలం ఎంత వెచ్చదనం.
కార్తీకముల రాత్రిపెండ్లిళ్లయితే చచ్ఛెరగొర్రె అన్నట్టేవుండేది.
కింద, బోరెం పరుసుకోని పంచెకొంగులు కప్పుక పండుకునేది.
పక్కనవాళ్లకు ఒదిగిపండుకోకపోతెనైతే కన్నుమలుగుతె ఒట్టు.
పడుసోళ్లకు పెండ్లినాడు అత్తగారు పెట్టిపంపిన
సంగడికోళ్ల పెద్దమంచం, దానికిదగ్గ బిగువుపరుపు
రెండు షోలపురపు చెద్దర్లు. అటెనుకల ఓ బిలాంకిటు
చూసినోళ్లపానం కొట్టుకసచ్చేటట్టుగ ఉండే రోజులవ్వి.
పడుసోళ్లు,వయిసోళ్లు లోపటింట్లనో పరుదచాటుకో పంటె
ముసలోళ్లు తలగైంఢ్లనో అరుగంచుకో జాగజూసుకుందురు.
తలుపులు వెట్టుడు, కిటికీలుమూసుడు గీ కతలన్ని ఏడివి,
లింగిలింగి లిటుక్కు పందిరిగుంజ పట్టక్కుమన్న శాత్రంతీరు
అలికిడి ఇనవడ్డగుడ ఇనవడనట్టు పొలుపరి తెలుపని కథ.
పెంఢ్లం విడెమేసుకుంటె మొగనినాలుక ఎర్రగ కావాలెనటగద,
ఇంట్ల ఇరువైమందివున్నా, చంకకునాలుగు మంచాలేసుకున్నా
ఆలుమగలేం మాట్లాడుకున్నరో గుట్టుగ పదిమందిని ఎట్లగన్నరో
ఈ పరుపులకు దుప్పట్లకుదప్ప నరమానవునికి తెల్వనికాలమది.
ఇది.. మనకాలపు గతం – మన చలికాలపు మనోగతం.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article