ఇంకా పలకలు, బలపాల కాలంలోనే ఉండిపోవాలని కోరుకుంటారు కొందరు… పల్లె పిల్లలకు ఆధునిక చదువు అక్కర్లేదనీ భావిస్తారు… అధికారమున్నా అడుగు ముందుకు వేయరు… కరోనా కాలంలో కష్టపడి కోట్ల మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లను కొనిచ్చారు పిల్లలకు… అయితే ఈ ఫోన్ల వల్ల పిల్లల్ని చెడగొట్టే దుష్ట సంస్కృతి వ్యాపిస్తున్నదనే భయసందేహాలున్నా సరే… ఎక్కడో ఓచోట స్టార్ట్ కావాలి, కరెక్షన్ కూడా జరగాలి… అంతేతప్ప, అసలు ఆవైపు అడుగులే వేయవద్దని ఆగిపోతే ఎలా..?
జగన్ స్కూల్ పిల్లలకు సమకూర్చిన ట్యాబ్స్ మీద విమర్శల్ని చూస్తే ఇదే అనిపించింది… ప్రతిదీ రాజకీయ బురదలోకి లాగడమే పని… స్కూళ్లు డిజిటలైజ్ కావడం వల్ల మంచా, చెడా అనేది పెద్ద చర్చ… కాలం తేలుస్తుంది… కానీ ప్రైవేటు స్కూళ్ల పిల్లలకు దీటుగా సర్కారీ స్కూళ్ల పిల్లలు, అదీ మారుమూల పల్లెల పిల్లలు ట్యాబులు పట్టుకుని, చదువుతుంటే… పాత పలకలు, బలపాల కాలంతో వీళ్లను పోల్చుకుంటే ఓ ఆశ్చర్యమే… ఈ సందర్భంగా ఒక టీచర్ గురించి మాత్రం చెప్పుకోవాలి… ఏపీ కాదు, మహారాష్ట్ర…
థానేకు 120 కిలోమీటర్ల దూరంలో పష్తెపడ అనే ఓ మారుమూల గిరిజన గ్రామం… జిల్లా పరిషత్ స్కూల్… సందీప్ గుండ్ అనే టీచర్… ఆ స్కూల్‌కు కరెంటు సౌకర్యం కూడా లేదు… తనకు ఓ డొక్కు ల్యాప్‌టాప్ ఉండేది… స్కూల్‌కు తీసుకుపోయేవాడు… చార్జింగ్ అయిపోతే ఓ ఫోల్డబుల్ సోలార్ చార్జర్ సాయంతో చార్జింగ్ పెట్టి, పిల్లలకు కూడా పలు ఇంట్రస్టింగ్ ఎడ్యుకేషన్ సీన్స్ చూపించేవాడు… 40 మందికన్నా ఎక్కువ ఉండరు పిల్లలు… ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టే తమ పిల్లలు రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్తుంటే ఆ తల్లిదండ్రులు ఏం జరుగుతుందబ్బా అని చూడటానికి వచ్చారు స్కూల్‌కు…
Ads
ఇలాగే ఆ పెట్టెలో పాఠాలు చూపించు సారూ, స్కూల్‌కు ఎగ్గొట్టరు అని కోరారు వాళ్లు… అంతేకాదు, తలా 500 రూపాయల్ని సమకూర్చారు… దాంతో మరో రెండు ట్యాబులు కొని, ఈ ల్యాప్‌టాప్‌కు అనుసంధానించి, రోజూ కొన్ని విజ్ఞానదాయక లెసన్స్ చూపించసాగాడు ఆ టీచర్… బలపాల బదులు డిజిటల్ పెన్స్, పలకల బదులు ట్యాబ్స్… ఒక్క పాఠ్య పుస్తకం, నోట్ పుస్తకం లేకుండా జస్ట్, ఆ ట్యాబ్ తీసుకుని పిల్లలు స్కూల్‌కు రావాలని ఆ టీచర్ కోరిక… తనకూ పెద్దగా టెక్నాలజీ తెలియదు… ఈ పిల్లలు కూడా డ్రాపవుట్ అయిపోతే స్కూల్ మూతపడుతుంది… అందుకని దగ్గరలో ఉన్న ఓ టౌన్‌లోని సైబర్ కేఫ్ వెళ్లి, డిజిటల్ క్లాస్‌రూం బాపతు అవసరాలు, పరిమితులు చదువుకున్నాడు…
కొన్నాళ్లకు ఈ ల్యాప్‌టాప్‌కు చిన్న ప్రొజెక్టర్ అమర్చి, స్కూల్‌లోనే ఓ తెర మీద పాఠాలు చూపిస్తూ, వివరించసాగాడు సందీప్… తరువాత ఏదో కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ సర్వీస్ కింద అందరికీ ట్యాబ్స్ కొనిచ్చింది… ఒకసారి మాజీ సివిల్ సర్వెంట్ అనిల్ స్వరూప్ ఈ స్కూల్ గురించి విని వెళ్లాడు… అబ్బురపడ్డాడు… ఏదో పని మీద రాష్ట్రపతిభవన్ వెళ్లినప్పుడు ఈ సందీప్ గుండ్‌ను తీసుకెళ్లి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు పరిచయం చేశాడు… ఇండోర్ ఐఐఎంలో లెక్చర్ ఇచ్చినప్పుడు ఈ విషయాలు వివరించాడు… దాంతో సందీప్ మోడల్ బాగా పాపులర్ అయిపోయింది…
ఒకరిని చూసి మరొకరు… అందరూ సందీప్ మోడల్‌ను అవలంబించడం స్టార్ట్ చేశారు… ఇప్పుడు మహారాష్ట్రలోని, థానే ఏరియాలో ఎన్ని వందల స్కూళ్లలో దీన్ని అమలు చేస్తున్నారనే లెక్క విషయంలో గందరగోళం ఉండవచ్చుగాక… కానీ కొన్ని వేల స్కూళ్లలో మాత్రం ఈ ట్యాబు ఎడ్యుకేషన్ స్టార్టయింది… ఇలా కార్పొరేట్ సెక్టార్ ఎక్కడెక్కడో నిధుల్ని వృథా చేసేబదులు డిజిటల్ క్లాస్‌రూం వైపు నిధులు ఇస్తే బెటర్ అనిపిస్తుంది… ఇప్పుడు జగన్ ఇచ్చిన ట్యాబుల సద్వినియోగం అనేది కూడా పెద్ద టాస్క్… దానికి ఓ సమర్థ వ్యవస్థ ఏర్పాటు చేయాలి… ఎలాగూ ట్యాబుల్ని ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి అవసరమైతే నిర్వహణకు కంపెనీల సాయం తీసుకుంటే బెటర్… బైజూస్ వాడు దొంగ వంటి విమర్శలకు బదులు… సర్కారీ స్కూల్ పిల్లల్ని సమర్థంగా డిజిటలైజ్ చేయలేమా..? ఒక సందీప్ గుండ్‌కు చేతనైన పని ఇంత పెద్ద విద్యాశాఖకు చేతకాదా..?!
Share this Article