సినిమా సెలబ్రిటీ అయితే చాలు… అక్కడి దాకా ఎందుకు టీవీ సెలబ్రిటీ, కనీసం బిగ్బాస్ హౌస్లోకి వెళ్లొచ్చినా చాలు… సమాజానికి బొచ్చెడు నీతులు చెప్పే రోజులు కదా…! మెంటల్లో చటాక్ దిమాక్ లేకపోయినా సరే, వాళ్లేం చెబితే అది కళ్లకద్దుకుని రాసేసి, చూపించేసి తరించిపోయే సమాజం మనది కదా…! బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనబడే ఒకానొక నటుడు, సారీ, నటుడు అనలేం, హీరో ఉన్నాడు… తనెవరు..? బెల్లంకొండ సురేష్ అనబడే ఓ బడా నిర్మాత కొడుకు… అదీ ఈ హీరోకు బ్యాక్ గ్రౌండ్… అదుగో, అక్కడే మరి సీనయ్యకు కోపం వచ్చేది… అంటే బ్యాక్ గ్రౌండ్ చూసే గుర్తిస్తారా..? అని తనకు పట్టలేని దుఃఖమొస్తుంది… మొన్న అల్లుడు అదుర్స్ అనబడే ఓ చిత్రరాజం ప్రిరిలీజ్ ఫంక్షన్లోనూ బాగా బాధపడ్డాడు ఫాఫం…
‘‘బ్యాక్ గ్రౌండ్ ఉన్నంతమాత్రాన పెద్ద హీరో కాలేరు… అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ వంటి నటులకు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉంది… మా బ్యాక్ గ్రౌండ్ కాదు, మేం పడే కష్టాన్ని చూడండి, గుర్తించండి’’ అని భావోద్వేగానికి లోనయ్యాడు… నిజం… ఈ ఒక్కమాట వరకూ నిజం… వాళ్లకు లేదా బ్యాక్ గ్రౌండ్ అనేది నిజం… అసలు తెలుగు ఏం ఖర్మ..? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి భాష మూవీ ఇండస్ట్రీలోనూ ఇదే పైత్యం… పాలిటిక్సులోనూ అదే పైత్యం…
Ads
ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే..? నువ్వన్నావు చూడు, మా కష్టాన్ని గుర్తించండి అని… అలా కష్టపడే అవకాశం దక్కడం కూడా బ్యాక్ గ్రౌండ్ వల్లే వస్తోంది… పదే పదే విఫలమైనచోట కూడా, నిలదొక్కుకోలేని వాళ్లను కూడా ప్రేక్షకులపై రుద్దుతున్నది కూడా ఆ బ్యాక్ గ్రౌండే సోదరా… ఉదాహరణకు నిన్నే తీసుకుందాం… మీ తండ్రిగారి గురించి చరిత్ర ఇక్కడ అనవసరం… కానీ తను బ్యాక్ గ్రౌండ్ కాబట్టే కదా, తమరు ఇండస్ట్రీలోకి రాగలిగింది…
తమరు బెల్లం కొండ కాబట్టే కదా, మొదటి సినిమా నుంచీ సమంత, రకుల్, కాజల్, అనుపమ వంటి ఈగలు వచ్చి వాలాయి… లేకపోతే ఓ కొత్త హీరో పక్కన నిలబడతారా వాళ్లు..? ఆరేళ్లయింది… కష్టపడుతున్నాను అంటావ్… ఒక డైలాగ్ ఎలా పలకాలో, ఒక ఉద్వేగాన్ని మొహంలో ఎలా ప్రదర్శించాలో, బాడీ లాంగ్వేజీ ఎలా ఉండాలో బేసిక్స్ నేర్చుకున్నావా..? అంటే అన్నామంటారు మళ్లీ..!! ఆ సీత అనే ఓ దరిద్రపు సినిమాకు ప్రేక్షకులు ఎన్ని కోట్లు తగలేయాల్సి వచ్చింది..? నిన్నూ, తేజను ఏం చేసినా పాపం లేదు కదా…
పైగా ఇప్పుడు తమరి తండ్రి గారు తన బ్యాక్ గ్రౌండ్ ద్వారా మీ బ్రదర్ గణేషునూ ప్రేక్షక దేవుళ్ల సేవలో తరించాలని ఆదేశిస్తాడట… అక్కడిదాకా ఎందుకు..? ఛత్రపతి రీమేక్ దాకా తమరు వెళ్తున్నారంటే బ్యాక్ గ్రౌండ్ మహిమ కాక మరేమిటి..? బ్యాక్ గ్రౌండ్ ఉంటే, డబ్బులుంటే… ఏళ్ల తరబడీ గిరికీలు కొడుతున్నా సరే, హీరో పదే పదే ప్రయత్నించొచ్చు… బలయ్యేది ప్రేక్షకుడే కదా… వడ్డే నవీన్ గుర్తుంది కదా… ఇక్కడ కష్టం కాదు ముఖ్యం… నటనలో బేసిక్స్, ప్రతిభ… అంతెందుకు… నాగార్జున బొచ్చెడు సినిమాల్లో హీరో, కానీ నటుడు అనిపించుకున్నది తొలిసారిగా అన్నమయ్యతోనే… తన కొడుకులు ఈరోజుకూ నటులు అనిపించుకోలేకపోతున్నారు…
నందమూరి తాజాతరంలో జూనియర్ తప్ప క్లిక్కయిన మరో హీరో లేడెందుకు..? కష్టపడటం చేతకాక కాదు… పిచ్చి గెంతుల్లో, ఫైట్లలో కాదు, బేసిక్స్ నేర్చుకోవడానికి విముఖంగా ఉండి, మొదటి నుంచే హీరోయిజం తలకెక్కడం…! బ్యాక్ గ్రౌండ్ వల్లే మెగా కంపౌండ్ అంతమంది హీరోలను ఉత్పత్తి చేయగలిగింది… వరుణ్ తేజ పర్లేదు, బన్నీకి ఫుల్ యాక్సెప్టెన్సీ ఉంది జనంలో… మరి మిగతావాళ్లు..? సో.., బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కష్టాన్ని గుర్తిస్తారు ప్రేక్షకులు… ఉదాహరణ నాని…! ఇక ఏ మెరిటూ లేకపోయినా కొందరు వారస హీరోలు ప్రేక్షకులతో అనివార్యంగా భరింపబడతారు… అది ఇండస్ట్రీ బ్యాడ్ లక్…!! నీకు, నీ కొత్త సినిమాకు బెస్టాఫ్ లక్…!!
Share this Article