ఎర్రబియ్యం అన్నం… ఎర్రబియ్యం, రెడ్ రైస్, కేరళ బియ్యం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతోన్న బియ్యపు రకం. బరువు తగ్గాలనుకునేవారు, మదుమేహం, రక్తపోటు వున్నవారికి డైటీషియన్స్ ప్రిస్క్రైబ్ చేసే మన తెల్ల అన్నానికి ప్రత్యామ్నాయం.
డైటింగ్ చేసేప్పుడు అన్నం తినాలి అనే కోరికను (క్రేవింగ్) తీర్చగలిగే అద్బుతమైన బియ్యపు వెరైటీ. దీనిని శతాబ్ధాలుగా మన దేశంలో సాగు చేస్తున్నారు. అస్సాం బెంగాల్, ఆంధ్ర, కేరళలో పూర్వం విరివిగా సాగుచేసేవారు. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులు ఈ రకాన్ని పండించడానికి మొగ్గు చూపుతున్నారు. 110 నుండి 130 రోజుల పంటకాలముండే ఈ రకం వరి ఎకరాకు 13 నుండి 15 బస్తాల దిగుబడి వస్తోందని కొందరు రైతన్నలు చెప్పారు.
మార్కెట్‌లో దీని ధర కిలో ఆర్గానిక్ ఐతే 300/- కాగా సాధారణ రకం 100/- దాకా వుంది. ఆన్‌లైన్‌లో విరివిగానే దొరుకుతుంది. మధుమేహానికి బరువు పెరగడానికి ముఖ్యమైన కారకం కార్బోహైడ్రేట్- గ్లూకోస్… మనం తీసుకునే ఆహారంలో ఎంత ఎక్కువ గ్లూకోస్ వుంటే దానిని కరిగించడానికి పాంక్రియాస్ అంత ఎక్కువ కష్టపడుతుంది… కొంతకాలానికి చేతులెత్తేస్తుంది. తద్వారా బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ పెరిగి రకరకాల జబ్బులకు దారి తీస్తుంది.
Ads
మనం తీసుకునే భోజనంలో 40% ప్రోటీన్ 40% ఫైబర్ 20% కార్బోహైడ్రేట్స్ వుండటం చాలా మంచిది అని నాకు ప్రాక్టికల్ గా తెలిసింది. ఆ గ్లూకోస్ లెవల్స్ యేయే పదార్థంలో ఎంతెంత ఉందో నిర్ణయించిన కొలతను GI – glycemic index అంటారు. ఇది 0 నుండి 100 లోపు ఎంత తక్కువ వుంటే అంత మంచిది. ఈ GI పెరిగిన పదార్థాల మనం తీసుకోడం వల్ల మనలో గ్లూకోస్ పెరుగుతూ వుంటుంది.
సన్నబియ్యపు తెల్లన్నం వల్ల ఈ లెవల్స్ మన రక్తంలో అమాంతం పెరిగి పోతాయి. ఒక వయసు వచ్చేసరికి ఇక మన శరీరం దీనిని తమాయించుకోడానికి మొరాయిస్తుంది. ఈ ఎర్రబియ్యంలో GI 50 గా వుంటుంది. దానివలన తిన్నవెంటనే రక్తంలోకి గ్లూకోస్ లెవల్స్ పెరగవు. జీర్ణం కూడా త్వరగా అవుతుంది.
రెడ్‌రైస్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అలాగే ఎర్ర బియ్యాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఎర్రబియ్యంలో సెలీనియం, విటమిన్ సి, బీటాకెరోటీన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడడంలో సహాయపడతాయి..
ఇక ఎర్రబియ్యాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ కారణంగా శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఎర్రబియ్యంలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. శరీరంలో కొవ్వు కూడా పేరుకుపోకుండా ఉంటుంది. వీటిలో ఎక్కువగా క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీర ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడతాయి.. చర్మ సమస్యలను జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది..
ఇంకా రెడ్ రైస్ ను రోజూ తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఎర్రబియ్యంలో anthocyanin వుండటం వల్ల దాని ఆ అందమైన రంగు రావడమే కాకుండా దానిలో B1, B2, calcium, iron శాతం అధికంగా వుండేలా చేస్తుంది. దీనిలో Anti- fungal anti- inflammatory ప్రాపర్టీస్ అధికంగా వున్నట్లు గుర్తించారు.
English botanical పేరు Oryza longistaminata/ Oryza punctata … ఆయుర్వేదంలో ఈ ఎర్రబియ్యాన్ని రక్తశాలి అంటారు. దీనిలో పిత్త వాత కఫ గుణాలను తగ్గించే లక్షణాలున్నట్లు పేర్కొన్నారు. సో… ఇన్ని మంచి లక్షణాలున్న బియ్యాన్ని మన భోజనంలో ఇంక్లూడ్ చేసుకోడంలో తప్పేలేదు.
సన్నబియ్యం అన్నంలాగా ‘లప్పలప్పలు’ లాగించలేం.
తలా 30 గ్రాములు తింటే మహా ఎక్కువ. కనీసం వారానికి రెండు రోజులు ఈ అన్నాన్ని తినడానికి ప్రయత్నించడం వల్ల గ్లూకోస్ లెవల్స్ కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. కేరళ తిరునల్వేలి ప్రసాదం, అయ్యప్ప ప్రసాదం ఆ బియ్యంతోనే చేస్తారు. ఎంతో అద్భుతమైన రుచితో తిన్నకొలది తినాలనిపిస్తుంది. త్వరలో రెసిపీ కూడా ఇస్తాను… ప్రియదర్శిని కృష్ణ
Share this Article