Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓరి దేవుడోయ్… ఇదేం భాష..? ఇదేం యాడ్..? చంపేస్తున్నారు కదరా !!

July 26, 2026 by M S R

.

తొలి ఏకాదశి. శనివారం. తలంటు పోసుకుని, పూజ చేసుకుని ఆఫీస్ కు వెళ్ళే సరికి టేబుల్ మీద రెండు తెలుగు, ఒక ఇంగ్లిష్ దినపత్రిక ఉన్నాయి. ఇంటికొచ్చిన రెండు తెలుగు, ఒక ఇంగ్లిష్ డైలీలకు ఇవి అదనం. ఒక పత్రిక మొదటి పేజీలో చేతి రాతతో ఉన్న యాడ్ కనిపించింది. కనిపించిన ప్రతిదీ చదివే అలవాటు నా అనారోగ్యానికి మూలకారణమని జనరల్ ఫిజిషియన్లు ఎందరో ఎప్పటినుండో చెబుతున్నా…అది నా బలహీనత.

ఈ వయసులో ఒక్కో అక్షరం కలిపి ఎలాగైనా దాన్ని పూర్తీ చదవాలని ప్రయత్నించి విఫలమయ్యాను. దాంతో తొలి ఏకాదశి పవిత్రత, ప్రశాంతత, తలంటు అన్నీ చెదిరిపోయాయి. ఆ యాడే నాకు పరిపరివిధాలుగా తలంటు పోసింది. కనీసం తెలుగులో నాలుగక్షరాలు కలిపి చదివే చదువు కూడా నాకు లేదని నిరూపించింది. అది తెలుగులాగే ఉన్నా…నేను తెలుగువాడినే అయినా…టెంత్ దాకా తెలుగు మీడియం స్టూడెంట్ నే అయినా… తెలుగు చదవలేని దుర్బల భాషా సంకటస్థితిలోకి నెట్టేసింది.

Ads

“చేయ్యమని…
రాసిగా ప్రేమ ఇచ్చి…
హిల్ చెసినందుకు…
రాసిగా గ్రాటిట్యూడ్…
నీజమైన…”
ఇలా ఈ యాభై ఆరేళ్ళ వయసులో ఎప్పుడూ వినని, కనని తెలుగు పదాల బారిన పడ్డాను.

ఏకాదశి పూట ఎందుకైనా మంచిదని…”శాంతాకారం భుజగశయనం…” స్తోత్రం స్మరిస్తూ పేజీ తిప్పితే…
“విలువైన ప్రేమకోసం న్యాచురల్ డైమండ్స్…
టిఫిన్ దగ్గరనుండి తాండవం దాకా ఒకరినొకరు విడిచి ఉండలేరు…
Love from Besti Bracelet…”
అని చదవాల్సి వచ్చింది. స్థూలంగా ఇది వజ్రాల బ్రేస్లెట్లకు సంబంధించిన ప్రకటన అని అర్థం కావడానికి శనివారం సాయంత్రమయ్యింది.

నా ఏలినాటి శని వచ్చే ఏడు మొదలవుతుందని నా శ్రేయోభిలాషులైన ఇద్దరు, ముగ్గురు జోతిష పండితులు చెప్పిన మాట నిజమేనని ముందుగానే శనివార సంకేతమిది!

“టిఫిన్ దగ్గరనుండి తాండవం దాకా…” పదాల వెనుక దాగిన వజ్రసమానమైన కథనాలు వచ్చే శనివారం ఇదే పేజీల్లో ఇలాగే చూడాలో! ఏం పాడో!

ఏమాటకామాట-
ఇందులో అక్షర దోషాలు, అన్వయ దోషాలు, అనర్థాలు, అపార్థాలు, దురర్థాలు, దూరార్థాలు, దుష్టార్థాలు వెతకాల్సిన పనిలేదు. వాణిజ్య ప్రకటనల్లో, ఆధునిక తరం వాడుకలో తెలుగు ప్రస్తుత పరిస్థితికి ఇదొక మచ్చు తునక.

తెలుగును ఇంగ్లిష్ లిపిలో, పూర్తిగా ఇంగ్లిష్ లో రాయడంతో పోలిస్తే…”రాసిగా ప్రేమగా రాసి ఇచ్చి అచ్చేసిన” ఈ ప్రకటన కొన్ని కోట్ల రెట్లు నయం. అన్నట్లు ఒక్క పత్రికలో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ కలర్ యాడ్…ఆల్ ఎడిషన్స్ వేయడానికి మహా అయితే 35 లక్షల రూపాయలు ఖర్చయి ఉంటుంది!

ఈ తెగులు అవజ్రాక్షరాలు ముంజేతి కంకణంగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి!

తెలుగులో తెలుగెక్కడుందిరా తెలుగోడా!

దేశభాషలందు తెలుగు లెస్సు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • Empress Sridevi – బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ! హింట్ ఇచ్చేసిందా !!
  • AI చాట్ జీపీటీని ఏళ్ల క్రితమే ఊహించిన యండమూరి !
  • దేవుడు ఆ రహస్యాన్ని చాన్నాళ్లు దాచాడు – కానీ ఇక దాగలేదు !!
  • స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions