హఠాత్తుగా గుండెపోట్లు ఎక్కువైపోయాయి… అనూహ్యంగా మరణాలు సంభవిస్తున్నాయి… గతంలోకన్నా స్ట్రోక్స్ సంఖ్య బాగా పెరిగిందనేది అందరూ అంగీకరిస్తున్న నిజం… ఆరోగ్యంగా కనిపిస్తూ, అంతకుముందు ఏ కాంప్లికేషన్సూ లేనివాళ్లు సైతం కుప్పకూలిపోతున్నారు… జీవనశైలిలో మార్పులు అందరూ సూచించేదే కానీ ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు అవసరం… సీరియసో, నాన్ సీరియసో గానీ, ఒకసారి కరోనాను పలకరించినవాళ్లు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి… ఇది అందరి అవగాహన కోసం జగమెరిగిన ప్రజాడాక్టర్ Yanamadala Murali Krishna… మేలుకొలుపు కథనం…
ప్రాణాంతకమైన కోవిడ్ పీడ ముగిసిన తర్వాత, పూర్తి ఆరోగ్యంతో చలాకీగా వుండే కొందరు కోవిడ్ బాధితులు… గుండెపోటుతో కుప్పకూలి, అక్కడికక్కడే చనిపోవడం తరచుగా చూస్తున్నాం, వింటున్నాం. ప్రస్తుతం తమ బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిలో ఎవరో ఒకరు గుండెపోటుకు గురై చనిపోవడం అందరికీ అనుభవమే. గతంలో గుండెపోటుతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరడం, స్టెంట్స్ అవసరం కావడం, ఇంకా ఇబ్బందికరం అయితే బైపాస్ సర్జరీ… ఇలా ఉండేది. ప్రస్తుతం తక్షణ మరణాలను గురించి వింటున్నాం.
కోవిడ్ ఒక పెద్ద తుఫాన్ లా ప్రపంచాన్ని కుదిపేసింది. కోవిడ్ తో సహా ఏ తరుణ (ఎక్యూట్) వ్యాధి అయినప్పటికీ, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని కూడా త్వరగా చావుకు దగ్గర చేస్తుంది. సాధారణ పరిస్థితులలో ఒక సంవత్సరం, రెండేళ్లు లేదా అంతకుమించి కాలం వరకు జీవించగలిగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు… కోవిడ్ వంటి ప్రపంచ పీడ (పాండెమిక్) కాలంలోనే చనిపోతారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల కాలం మరణాలు, సగటు కన్నా తక్కువగా ఉంటాయి. గత శతాబ్దపు స్పానిష్ ఫ్లూ ప్రపంచ పీడ తరువాత కొన్ని సంవత్సరాల పాటు మరణాలు తగ్గాయి.
Ads
అయితే కోవిడ్ తరువాత, ప్రస్తుతం మరణాలు కోవిడ్ ముందు కాలం సగటు మరణాలతో పోల్చి చూసినప్పుడు చాలా ఎక్కువగా వున్నాయి. కోవిడ్ కాలంలో వైద్యం అందని దీర్ఘ కాలిక జబ్బులతోనే కాకుండా… గతంలో ఏ జబ్బులూ లేనివారు కూడా అధిక సంఖ్యలో మరణించడం గమనిస్తున్నాం. యూరోప్ లోని అన్ని దేశాలలో కోవిడ్ ముందటి సగటుతో పోల్చితే, దాదాపు 6 నుండి 16 శాతం మరణాలు అధికంగా నమోదయ్యాయి. అదేవిధంగా అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో కూడా కోవిడ్ పీడ తర్వాత అదనపు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో అధిక శాతం గుండె జబ్బు మరణాలు. ఇటీవల కాలంలో 20 – 44 సంవత్సరాల మధ్య వయసుగల వారిలో గుండె సంబంధిత జబ్బులు దాదాపు 30 శాతం మేరకు పెరిగాయని అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ అధికారులు ప్రకటించారు.
ప్రపంచ విఖ్యాత వైద్య జర్నల్ ‘ద లాన్సెట్’, ‘ది ఎకనామిస్ట్’ పత్రికల లోతైన పరిశోధన మేరకు 2020, 2021, 2022 కోవిడ్ మూడు సంవత్సరాల కాలంలో అంతకు ముందు సంవత్సరాల సగటుతో పోల్చితే, ప్రపంచవ్యాప్తంగా గరిష్టంగా రెండున్నర కోట్ల మంది అధికంగా చనిపోయారు. వీరిలో 70 లక్షల మంది కోవిడ్ తో చనిపోయారు. మిగిలిన కోటి 80 లక్షల మంది కోవిడ్ సమయంలో ఇతర వైద్య చికిత్సలు అందని కారణంగానూ, కోవిడ్ తర్వాత మరికొన్ని జబ్బులతోనూ చనిపోయారు. 2021 చివరిలో ఒమిక్రాన్ రకం కొరోనావైరస్ రాకతో కోవిడ్ పీడ తీవ్రత బాగా తగ్గిపోయింది. అప్పటి నుండి కోవిడ్ వల్ల మరణాలు తగ్గిపోయాయి. అయినా 2022 నుండి కూడా మరణాలు అధికంగా నమోదు అవుతున్నాయి. వీటిలో అత్యధిక భాగం గుండె జబ్బు మరణాలే.
2022 ఫిబ్రవరిలో విఖ్యాత శాస్త్రీయ జర్నల్ ‘నేచర్’ లో ప్రకటించిన అధ్యయనంలో, తేలికపాటి కోవిడ్ బారిన పడి బయటపడ్డ వారిలో కూడా గుండె సంబంధ అనారోగ్యాలు, మరణాలు చాలా పెరిగాయి అని తెలిపింది. కోవిడ్ జబ్బులో సంభవించే గుండె వాపు (మయోకార్డైటిస్) మూలంగా రోగులు గుండెపోటు, గుండె అవలయ (ఎర్రిత్మియా), ఊపిరితిత్తుల్లోనూ, మెదడు వంటి ఇతర అవయవాలలోనూ రక్తం గడ్డ కట్టడం వంటివి వైద్యశాస్త్రం గమనించిన విషయాలు.
గుండె రక్త నాళాలలో చేరిన ప్లాక్ పగలడం లేదా గాయపడటం మూలంగా రక్తం గడ్డ కట్టి నాళాన్ని పూడ్చి వేస్తుంది. దాంతో తదుపరి గుండె భాగానికి రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల సాధారణంగా గుండె పోటు సంభవిస్తుంది. కోవిడ్ జబ్బులో రక్తం గడ్డ కట్టే ప్రక్రియ ప్రేరేపితం అవుతున్నది. కోవిడ్ జబ్బుకు కారణమైన కొరోనావైరస్ దాదాపు అందరు పేషెంట్లలో 10 నుండి 20 రోజులలో మరుగు అవుతుంది. వైరస్ కలుగజేసిన ఇన్ ఫ్లమేషన్ డ్యామేజీ మూలంగా దీర్ఘకాలపు సమస్యలు తలెత్తుతున్నాయి .
గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో గుండెపోటుకు గురికాకుండా ఏస్పిరిన్ వినియోగం మూలంగా పదుల కోట్ల మంది రక్షణ పొందారు. ఏస్పిరిన్ యొక్క పనితనమూ, భద్రత సందేహాలకు అతీతంగా రుజువైంది. రక్తపోటు, డయాబెటిస్, మెదడు స్ట్రోక్, గుండెపోటు, అధిక కొలస్టెరాల్ తో సహా అనేక ఆరోగ్య సమస్యలలో ఏస్పిరిన్ సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి… ఇంకా చెప్పాలంటే జీవించినంత కాలమూ చాలామంది పేషెంట్లలో వాడతారు.
2021 ఏప్రిల్ లో కోవిడ్ డెల్టా వేవ్ ఉదృతంగా వున్న సందర్బం నుండి తేలికపాటి కోవిడ్ కి ఏస్పిరిన్ వాడకాన్ని సూచించాను. గత ఏడాది ఫిబ్రవరి 21 న మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుకి గురై ఆకస్మికంగా మృతి చెందిన నాటి నుండి గుండె జబ్బులకు కోవిడ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా భావించి, ఏస్పిరిన్ వాడటం ద్వారా గుండెపోటు బారి నుండి రక్షణ పొందవచ్చునని సూచిస్తున్నాను. ఈ మేరకు సోషల్ మీడియాలో జన బాహుళ్యానికి విస్తృత అవగాహన కల్పిస్తున్నాను. కోవిడ్ కాలంలో ఆక్సిజన్ సాచురేషన్ పెంచుకోవడానికి ప్రోనింగ్ (బోర్ల పడుకొని శ్వాస తీసుకోవడం) విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేశాను…
ఏస్పిరిన్ చాలా సురక్షితమైనది. డిస్ప్రిన్, అనాసిన్ పేరిట అందుబాటులో వున్న మాత్రలో 325 మిల్లీగ్రాములు ఏస్పిరిన్ ఉంటుంది. కడుపులో అల్సర్లు, రక్తస్రావం ఇబ్బందులు ఉన్నవారికి మాత్రం ఏస్పిరిన్ వాడరాదు. ఒక మోస్తరు నుండి ఎక్కువ తీవ్రమైన కోవిడ్ బారిన పడి, కోలుకున్న వారు… తక్కువ మోతాదు అనగా 75 మిల్లీగ్రాముల ఏస్పిరిన్ మాత్ర ఒకటి మధ్యాహ్నం భోజనం తర్వాత కనీసం రెండు సంవత్సరాల పాటు వాడటం అన్ని విధాలా శ్రేయస్కరం.
ప్రాణాంతకమైన తరుణ వ్యాధుల చికిత్సలో పరిశోధన ఫలితాల గురించి ఎదురు చూడకుండా, ఆయా వైద్య రంగ నిపుణుల మార్గదర్శకాలతో చికిత్స సాగుతుంది. రెమ్ డెస్విర్, మోల్ నూపిరావిర్, నిర్మాట్రెల్విర్, డెక్సామిథసోన్ వంటి మందులను పరిమితమైన పరిశోధనలతోనే నిపుణుల సూచనలతో కోవిడ్ చికిత్సలో విస్తృతంగా వాడి అనేక లక్షల మందిని కాపాడారు. కాగా కోవిడ్ యొక్క దీర్ఘకాలిక దుష్పరిణామాల నుండి ఉపశమనానికి వైద్య పరిశోధనలు సంప్రదాయ పద్ధతిలో దీర్ఘకాలం కొనసాగుతూ ఉన్నాయి. అయితే గుండెపోటు నివారణకు ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను ఉపయోగించుకోవడానికి ఇప్పుడిప్పుడే కొందరు నిపుణులు ముందుకొస్తున్నారు.
కోవిడ్ తర్వాత గుండెపోటులో, గుండె రక్తనాళాల (కొరోనరీ ఆర్టెరీస్)లో అడ్డు (ఎథెరోస్క్లీరోటిక్ ప్లాక్) లేకుండా ఉండటం అధికంగా గమనించారు. ఈ రకం ‘మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ విత్ నాన్ అబ్‌స్ట్రక్టివ్ కొరోనరీ ఆర్టెరీస్’ (MINOCA) అనేది గతంలో దాదాపు 5% ఉండగా, కోవిడ్ బాధితులైన గుండెపోటు రోగులలో… మహిళల్లో 35% గానూ పురుషుల్లో 18 శాతం గాను గమనించారు. వీరిలో రక్తం అతి చిన్న గడ్డలు కట్టి చిన్న రక్తనాళాలను అడ్డగించడం మూలంగా ఈ రకమైన గుండెపోటు సంభవిస్తుందని భావిస్తున్నారు.
గుండెపోటును నివారించడానికి గాను, గుండెపోటుకి గురయ్యే అవకాశాలు (రిస్క్ ఫ్యాక్టర్స్) ఎక్కువగా ఉన్న వారికి దీర్ఘకాలం పాటు ఏస్పిరిన్ 75 మిల్లీగ్రాములు వాడటం అనేది గొప్ప ఫలితాలను ఇచ్చేదిగా రుజువైన చికిత్స. అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, ఇప్పటికే గుండెకు రక్త సరఫరా తక్కువ కావడం వల్ల గుండె నొప్పి (ఇస్కీమియా), స్టెంట్, బైపాస్ సర్జరీ, గుండెపోటుకు గురైన వారు, బ్రెయిన్ స్ట్రోక్ పేషంట్స్ కి మళ్లీ గుండెపోటు – స్ట్రోక్ రాకుండా నివారించడానికి ఏస్పిరిన్ 75 మిల్లీ గ్రాములు రోజుకు ఒకటి చొప్పున వాడటం ప్రస్తుతం ప్రామాణిక వైద్యం. ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్ లలో కోవిడ్ ను కూడా చేర్చాలని కొందరు నిపుణులు చెప్తున్నారు.
ప్రశ్న: హఠాత్తుగా సంభవిస్తున్న గుండె మరణాలను నివారించడానికి ఏ విధమైన పరీక్షలు చేయించుకోవాలి?
సమాధానం: గుండె రక్త నాళాల ( కొరోనరీ ఆర్టెరీస్ )లో అధికంగా కొవ్వు (ప్లాక్ ) చేరడంతో పూడుకొని పోయి, తదుపరి గుండె భాగానికి రక్తం సరఫరా ఆగిపోవడం మూలంగా గుండెపోటు సంభవిస్తుంది. అయితే గుండెపోటుకు గురైన సాధారణ ప్రజలలో ఈ రకమైన అవరోధం లేకుండా గుండెపోటు సంభవించే అవకాశం వందలో ఐదుగురిలో వుంది. కాగా కోవిడ్ తర్వాత గుండెపోటుకు గురైన వారిలో దాదాపుగా నలుగురిలో ఒకరికి రక్తనాళాలలో పెద్దగా అవరోధం లేకుండానే సంభవించే గుండెపోటు సంభవిస్తున్నట్లుగా వైద్య శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ ఇబ్బందులను ఈసీజీ, యాంజియోగ్రామ్ తో సహా చాలా పరీక్షలు గుర్తించలేవు. అలాగే ట్రోపొనిన్ వంటి రక్త పరీక్షలలో MINOCA ఉంది. కోవిడ్ వ్యాధిగ్రస్తులలో, గతంలో కోవిడ్ కి గురైన వారిలో చిన్న నాళాలలో అతి చిన్న రక్త గడ్డలు ఏర్పడడం మూలంగా ఈ తరహా పరీక్షలు గుండెపోటుకు గురైన తర్వాత మాత్రమే ఉపయోగపడతాయి. కనుక పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ప్రశ్న: ఆరోగ్యవంతులలో ఏస్పిరిన్ వాడకం మూలంగా పెద్దగా ప్రయోజనం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి కదా, వాడితే ప్రయోజనం ఉంటుందా?
సమాధానం: గుండెపోటు ప్రమాదం (రిస్క్ ఫ్యాక్టర్స్) లేని వారికి ఏస్పిరిన్ వాడకం శ్రేయస్కరం కాదు. కోవిడ్ అనేది గుండె పోటుకు దారితీసే పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. గుండెపోటు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ఏ వయసు వారైనప్పటికీ ఏస్పిరిన్ వాడకం గుండెపోట్లు నివారించడంలో గొప్ప ప్రయోజనకరంగా ఉందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. కనుక కోవిడ్ నుండి బయటపడిన వారికి ఏస్పిరిన్ వాడకం మేలు చేయవచ్చు. కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ అసిడిటి సమస్యలు ఉన్న వారిలో తప్ప మిగతా అందరికీ ఇది చక్కటి ఔషధం. డాక్టర్ ని సంప్రదించి అటువంటి సమస్యలు ఉన్న కొద్దిమంది మాత్రం ఏస్పిరిన్ బదులుగా క్లోపిడోగ్రెల్ 75 మిలిగ్రాముల మాత్ర వాడుకోవచ్చు.
ప్రశ్న: కోవిడ్ అనంతరం గుండెపోటు రాకుండా తీసుకోవలసిన ఇతర జాగ్రత్తలు ఏమిటి?
జవాబు : కోవిడ్ తర్వాత మానసిక ఆందోళన, దిగులు బాగా పెరిగాయి. దీని వల్ల శరీరంలో, రక్తపోటుని పెంచి – గుండెను ఒత్తిడికి గురి చేసే కేటకోలమైన్స్ విడుదలవుతాయి. ప్రశాంతంగా ఉండడం గుండె ఆరోగ్యానికి మంచిది. తీవ్రమైన వ్యాయామము ఒక్కోసారి ప్రమాదకరం కావొచ్చు. తేలికపాటి వ్యాయామం మాత్రమే సరైనది. అలాగే తగినంత నిద్ర తప్పనిసరి. సంతులనమైన ఆహారంతో ఆరోగ్యం సంరక్షించుకోవచ్చు.
డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ
(ఇందులో కొన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం… సాక్షి దినపత్రికలోనూ పబ్లిష్ చేశారు… అయితే ఇది ఇంకా లోతుగా చర్చించిన వ్యాసం… అయితే పలుచోట్ల మెడికల్ షాపుల్లో యాస్పిరిన్ మాత్రల్ని ఓవర్ ది కౌంటర్ ఇవ్వడం లేదు… అందుకని మీకు తెలిసిన డాక్టర్లతో ప్రిస్క్రిప్షన్ రాయించుకుని వెళ్లడం బెటర్… డోస్, ప్రికాషన్స్ విషయంలో జాగ్రత్త సుమా…)
Share this Article