Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భర్తా రూపవాన్ శత్రుః … ఆడాళ్లు ట్రాప్ చేసి పడేస్తారు, బహుపరాక్…!!

November 11, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. భర్తా రూపవాన్ శత్రుః . అంటే అందంగా ఉండే భర్త శత్రువు . అంటే కొందరు ఆడవాళ్లు అందంగా ఉండే మగవారి మీద మనసు పారేసుకుంటారని , దరిమిలా భర్త భార్యకు దూరం అవుతాడని కవి హృదయం .

ఈ కాన్సెప్ట్ చుట్టూ నేయబడిన కధ . నేసింది ఆదివిష్ణు కాబట్టి సరదాగా , కాస్త కామెడీగా కాస్త కారంగా , అంతా కలిపి శుభాంతం చేయబడిన సినిమా 1988 జనవరిలో వచ్చిన ఈ భామాకలాపం .

Ads

చాలా చాలా సరదాగా , నవ్వుల పువ్వులతో , రొమాంటిగ్గా సాగుతుంది సినిమా . ఆదివిష్ణు పాత్రల్ని భలే సృష్టించారు . హీరో పాత్ర రాముడు మంచి బాలుడు . అయితే భావుకుడు , కవి . పూర్వాశ్రమంలో లవ్ స్టోరీ ఉన్నా పెళ్ళయాక భార్యే అంతా , అన్నీ . సిన్సియర్ హజ్బెండ్ . చాలా చలాకీగా , క్రిటికల్ సీన్సులో బరువుగా బాగా నటించారు . ఒక హీరోయిన్ రజని . ఆమే అతని భార్య . భర్తకు తగ్గ భార్య . ఒరిజనల్గా భర్తంటే శ్రీరాముడు అని త్రికరణశుధ్ధిగా నమ్మేది .

మూడో పాత్ర అతి కీలకమైన మంథర పాత్ర శ్రీలక్ష్మిది . మగ ద్వేషి , మగవాళ్ళందరూ స్టెపినీలను మెయింటైన్ చేస్తుంటారని , చీరె కనపడితే వెంట పడతారని భ్రమించే ప్రమీలాదేవి . సినిమాలో ఆ పాత్ర పేరు కూడా ప్రమీలే . ఆదివిష్ణు కావాలనే ఆ పేరు పెట్టి ఉంటారు .

మొగుళ్ళ మీద గూఢచర్యం చేయించటానికి జయశీల లాంటి CID లను కూడా నియమిస్తుంది . ఈ పాత్రకు మరో ప్రత్యేకతను కూడా పెట్టారు ఆదివిష్ణు . ఈమె ప్రతీ మాటలోని మొదటి అక్షరానికి క్రావడి ఇస్తుంది . ఉదా : మామయ్యని మ్రామయ్య అంటుంది . క భాష లాగా అన్న మాట .

మరో ముఖ్య పాత్ర సుత్తి వేలు . ఆడ ద్వేషి . పాత్ర పేరు వైద్యం ఆంజనేయులు . ఈ వైద్యమాయన దగ్గర పనిచేసే నర్సుకి అతనంటే ఇష్టం . ఆమె ఎక్కడ ఎగరేసుకు పోతుందో అని భయపడిపోతూ ఉంటాడు ఈ వైద్యం . ఈ ఆంజనేయులు , హీరో రాజేంద్రప్రసాద్ చిన్ననాటి స్నేహితులు కూడా .

ఈ నాలుగు పాత్రల తర్వాత ముఖ్య పాత్ర ఫస్ట్ హీరోయిన్ తండ్రి సుత్తి వీరభద్రరావు . కంపెనీ బోర్డ్ మీటింగని చెప్పి గెస్ట్ హౌసులో పీకల దాకా తాగి రోడ్ మీద కనిపించినోళ్ళందరినీ పట్టుకుని గతం చెపుతూ ఏడ్చేస్తుంటాడు .

అయిదో ముఖ్య పాత్ర రెండో హీరోయిన్ రమ్యకృష్ణది . హీరో గారి పూర్వాశ్రమ ప్రేయసి . తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నాక కూడా ప్రియుడిని ఏప్రిల్ ఫూల్ని చేయాలని అతను వింటూ ఉన్నప్పుడు అతని మీద ప్రేమంతా నాటకం అని చెప్పి తన పెళ్ళిని తానే చెడగొట్టుకుంటుంది . పెళ్ళయాక కూడా ప్రియుడిని మరచిపోలేక , కట్టుకున్న మొగుడితో సర్దుకుపోలేక జీవితాన్ని పాడుచేసుకుంటుంది .

మరో ముఖ్య పాత్ర రమ్యకృష్ణ తండ్రి నూతన్ ప్రసాదుది . ప్రకృతి వైద్యుడు . ఆసనాలు వేయిస్తుంటాడు జనం చేత . ఇతర పాత్రల్లో అన్నపూర్ణ , రాజా , తదితరులు చక్కగా , సంసారపక్షంగా నటించారు .

1+2 సినిమా అయినా చివర్లో జనానికి ఓ సందేశాన్ని ఇచ్చేసారు ఆదివిష్ణు , దర్శకుడు రేలంగి నరసింహారావు . పెళ్లికి ముందు ప్రేమా దోమా ఉన్నా పెళ్ళయాక భర్తతో/ భార్యతో సీతారాముల్లాగా ఉండాలి . ఏ తిత్తికి ఆ తిత్తే . గతాన్ని పట్టుకుని వేలాడకూడదు . డైలాగులను కూడా ఆదివిష్ణే వ్రాసారు . ఓ కామెడీ సినిమాకు ఎలా ఉండాలో అలా వ్రాసారు . దర్శకుడు రేలంగి కూడా హాస్య రస ప్రియుడు కావడంతో ఇద్దరూ సినిమాను వినోదభరితంగా మలిచారు .

వీరందరి తర్వాత మెచ్చుకోవలసింది సాలూరి వాసూరావుని . చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . నృత్య దర్శకులు శ్రీను , ఏంథొనీ నృత్యాలను బాగా కంపోజ్ చేసారు . ముఖ్యంగా మల్లెల వేళయ్యా అల్లరి కృష్ణయ్యా అంటూ సాగే పాటలో రాజేంద్రప్రసాద్ , రజని డాన్స్ ; కవితా ఓ కవితా అంటూ సాగే పాటలో రాజేంద్రప్రసాద్ , రమ్యకృష్ణ డాన్సూ బాగా కంపోజ్ చేయబడ్డాయి , చిత్రీకరించబడ్డాయి .

మరో రెండు డ్యూయెట్లు అకుపచ్చ చేలలో తోకపిట్ట వాలెరో , చంపల అందం చంపకమాలే కాదా అంటూ సాగేవి కూడా బాగుంటాయి . సిరివెన్నెల వారు చంపకమాల , ఉత్పలమాలలను కూడా లాక్కొచ్చారు . సుత్తి వేలు , శ్రీలక్ష్మి డ్యూయెట్ అయ్యయ్యో పిచ్చెక్కింది సరదాగా ఉంటుంది . పాటల్ని సి నారాయణరెడ్డి , ఆత్రేయ , సిరివెన్నెల వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజ పాడారు .

సినిమాలో ఒక హైలైట్ ఏంటంటే ఆత్రేయ గారు పేషంటుగా సుత్తి వేలు దగ్గరకు రావటం . ఇరువురి మధ్యా సంభాషణ సరదాగా సాగుతుంది . దర్శకుడు భలేగా దూర్చారు ఈ సన్నివేశాన్ని . సినిమా అంతా బోరించకుండా బిర్రుగా రజని, రమ్యకృష్ణ అందాలు , రాజేంద్రప్రసాద్ , సుత్తి జంట , నూతన్ ప్రసాదుల హాస్యభరిత నటన సంసారపక్షంగా చక్కగా సాగుతుంది .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంటిల్లిపాదీ కలిసి చూడవచ్చు . It’s a neat , romantic , hilarious , feel good movie . నేను పరిచయం చేస్తున్న 1163 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భర్తా రూపవాన్ శత్రుః … ఆడాళ్లు ట్రాప్ చేసి పడేస్తారు, బహుపరాక్…!!
  • ఒక బీర్ సీసా నుంచి… కోట్ల డిమాండ్ల దాకా ఎదిగిన జర్నలిజం..!!
  • 4 నెలల పసిపాప… మొన్నటి వరల్డ్ కప్ గెలుపు వెనుక ప్రేరణ..!!
  • ‘కూడు పెడుతున్న’ ఓటీటీకే టోపీ… ఏమిటీ ఆ స్కామ్..? ఎవరు ఆ నిర్మాత..?
  • రివ్యూ అంటే ఇదీ… క్లైమాక్స్ అంటే ఇదీ… దర్శకత్వం అంటే ఇదీ…
  • ఇది స్మార్ట్ వెలుతురు చీకటి కోణం..! గుండెకే గురిపెడుతోంది..!!
  • ఓ నొటోరియస్ హత్యాచారి..!! వీడింకా బతికే ఉన్నాడు… జైలులో విలాసంగా…!!
  • నాది కవితాగానం కాదు… కాలజ్ఞానం… అందెశ్రీ అంతరంగం ఇదీ…
  • హక్..! దశాబ్దాలనాటి ఆ షాబానో కేసు ఈ సినిమా కథకు నేపథ్యం..!
  • బాడీ షేమింగ్..! ఫిలిమ్ జర్నలిస్టులు ఎక్కడైనా అదే తిక్క ధోరణి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions