.
ప్రతి గుడికీ ఓ స్థల పురాణం ఉంటుంది… అందరూ అన్నీ నమ్మాలనేమీ లేదు… భక్తి ఉన్నవారు నమ్ముతారు… భక్తి ఉన్నవాళ్లలోనూ కొందరు నమ్మరు… హేతువు, లాజిక్ మాత్రం అవన్నీ ట్రాష్ అని కొట్టేస్తుంటాయి కూడా…
కానీ కొన్ని చదవడానికి బాగుంటాయి… ఫాంటసీ అనుకొండి, క్రియేటివ్ స్టోరీ అనుకొండి… మన కల్కి, మన కాంతారా, మన కార్తికేయ సినిమాల్లాగా…! కొన్ని కథలు కొన్ని నిజాల మధ్య వినిపించేవయితే మరింత విశేషంగా అనిపిస్తాయి… ఉదాహరణకు… భద్రాచలం కోవెల శిఖరంపైన ఉన్న సుదర్శనచక్రం కథ…
Ads
ఎందుకంటే..? రామదాసు కథ నిజం… తను తాసీల్దారుగా ఉండి, శిస్తు వసూళ్ల సొమ్ము వాడి, విరాళాలు పోగేసి గుడి కట్టడం నిజం… తనను జైలుపాలు చేయడమూ నిజం… తరువాత తానీషాకు ఏం చెప్పి ఒప్పించారో గానీ తనను తరువాత కాలంలో విడుదల చేయడం నిజం… ఆరోజు నుంచే పాలకులు రాముడి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపించడమూ నిజం… అదంతా గుడి చరిత్ర… స్థలపురాణం కాదు…
ఐతే ఎవరి కలలోనో దేవుడు కనిపించి ఫలానా పుట్టలో విగ్రహాలు ఉన్నాయని చెప్పడం, అక్కదే దొరకడం రామదాసు వంటి సినిమాల్లో చూపిస్తుంటారు… సేమ్, సుదర్శన చక్రం కథా అదే…
మిత్రుడు గోపిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పోస్టు ఒకటి దీనిపై ఆసక్తికరంగా అనిపించింది… అదే ఇది…
భద్రాచలం కోవెల శిఖరం, దానిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరో మానవులు తయారు చేసినది కానీ కాదు! అది దేవతా నిర్మితమైనది.
శ్రీ రామదాసు దేవాలయం నిర్మించే సమయంలో కారాగారంలో తురుష్కుల వల్ల వుండవలసి వచ్చింది. చివరి భాగం ఈ సుదర్శన చక్రం స్థానం ఖాళీగా ఉండి పోయింది.
శ్రీ రామదాసు కారాగారంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు వేరే కలశం అక్కడ ఉంచగా, అది ప్రతి చిన్నపాటి గాలికి, వర్షానికి క్రింద పడిపోతూ అస్తమాను అపచారం జరిగేది. ఈ సంఘటనకు అక్కడ ఉన్నవారంతా చాలా బాధపడ్డారు.
ఈ విషయం కారాగారంలో ఉన్న రామదాసుకు కూడా చేరి, ఆయన అక్కడ అన్న పానాదులు ముట్టుకునే వారు కాదు. తదుపరి ఆయన కారాగారం నుండి బయటకు వచ్చాక ఆయన నిద్రలేని రాత్రుళ్ళు ఎన్నో గడిపారు.
తర్వాత ఒక రోజు ఆయనకు స్వప్నంలో శ్రీ రాముల వారు ప్రత్యక్షమై ఆ ఆలయ శిఖరంపై పెట్టవలసిన సుదర్శన చక్రం తనకు గోదావరి నదిలో లభిస్తుందని చెప్పి అంతర్ధానం అయ్యాడు. అంతే ఇంకేముంది, మన రామదాసు తెల్లవారుజామున అందరికీ సదరు విషయం చెప్పి, తాను గోదావరిలో స్నానానికి వెళ్లి, నీటిలో మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్న సుదర్శన చక్ర సహిత పెరుమాళ్లు రెండు చేతులపై తేలియాడుతూ లభించింది. ఇంక ఆనందంతో వేద మంత్రాలతో ఆదే రోజు శ్రీవారి ఆలయ శిఖరంపై దానిని ప్రతిష్ట చేశారు. అది ఈనాటికి అలాగే వుంది.
మళ్ళీ శిఖరానికి అపశృతి అన్న మాట లేదు. సదరు విషయం తురుష్కుల హుకుమత్ కి కూడా తెలిసి ఆయన కూడా సీతారాముల వారిని దర్శించుకుని కానుకలు మొక్కులు చెల్లించుకొని, శ్రీ రామదాసుని బంధించి వుంచినందుకు మాఫీ కోరుకొని వెళ్లారుట ఆ జహాపన. క్లుప్తంగా ఇది ఆ గోపురం మహత్తు…
Share this Article