.
జాగ్రత్తగా గమనించండి… సెలబ్రిటీలు కొన్నాళ్లుగా మామూలు పూజలకన్నా వామాచార, తాంత్రిక పూజల మీద ఆసక్తి కనబరుస్తున్నారు… పవర్‌ఫుల్ అని నమ్ముతున్నారు… కామాఖ్యకు వచ్చే తెలుగు వాళ్లను గమనిస్తే అర్థమయ్యేది అదే…
గౌహతిలో దాదాపు 2 లక్షల మంది తెలుగువాళ్లుంటారు… మంచి యాక్టివ్ తెలుగు సంఘం ఉంది… తెలుగు వాళ్ల హోటళ్లు కూడా ఉన్నాయి… ప్రత్యేకించి హైదరాబాదీలు రన్ చేసేవి… గుడి మెట్లు ఎక్కే ముందే ఓ హైదరాబాదీ హోటల్ కనిపిస్తుంది…
Ads
ఇవన్నీ సరే… మన తెలుగు వాళ్లు అక్కడికి వచ్చి బలి పూజలు చేయించుకోవడమే కాదు… వారానికి ఒకరోజు భగాలాముఖి ప్రత్యేక పూజ ఉంటుంది… మనవాళ్లు ఫ్లయిట్‌లో సాయంత్రానికల్లా అక్కడికి చేరుకోవడం, ఈ పూజ చేసుకుని, పొద్దున ఫ్లయిట్‌లో తిరిగి హైదరాబాద్‌లో వాలిపోవడం… ఇదీ ఎక్కువైంది…
నిజానికి ఈ పూజల మీద గోప్యత అనవసరం… కానీ ఎందుకో రహస్యంగానే ఉంచుతుంటారు… క్షుద్ర పూజలు అని జనం బదనాం చేస్తారనే సంకోచం కావచ్చు… నిజానికి ఇందులో క్షుద్రం ఏమీ లేదు… ఇవేమీ క్షుద్ర శక్తుల కరుణ కోసం చేసే పూజలు కూడా కావు… కాకపోతే మనకు బాగా తెలిసిన దక్షిణాచార పద్ధతి పూజలు గాకుండా వామాచార పద్ధతిలో చేసే పూజలు… అంతే తేడా…
కొన్నేళ్ల క్రితం చండీయాగం వంటివి చేయించుకునేవాళ్లు నాయకులు… అంతెందుకు..? కేసీయార్ అయితే ఏకంగా ఆయుత చండీయాగమే చేయించిన సంగతి తెలుసు కదా… తరువాత కాలంలో నాయకుల్లో రాజశ్యామల పూజల మీద భక్తి పెరిగింది… నిజానికి రాజశ్యామల పూజల్ని దక్షిణ, వామాచార రెండు పద్ధతుల్లోనూ చేయిస్తుంటారు కూడా…
మూడేళ్ల క్రితం కేసీయార్ పేరిట ఎవరో భగాలాముఖి పూజ చేయించడాన్ని ‘ముచ్చట’లో చెప్పుకున్నాం గుర్తుందా..? రెండు ఫోటోలు పెట్టి మరీ… ఒకటి కేసీయార్, రెండో వ్యక్తి ఫోటో ఎవరిదో గుర్తుపట్టేట్టుగా లేదు…
సరే, పూజ చేయించడం అస్సలు తప్పేమీ కాదు… అది విశిష్టమైన, ప్రభావశీల పూజే… అసలు ఏమిటీ భగాలాముఖి..?
- ఊళ్లల్లో మైసమ్మ, ఉప్పలమ్మ, బాలమ్మ, పోశమ్మ వంటి గ్రామదేవతలకు పూజలు ఎలా చేస్తామో తెలుసు కదా..? వాళ్లందరూ శక్తిస్వరూపిణులే… దేవీ అవతారాలే అని గ్రామీణుల నమ్మకం… కల్లు లేదా సారా సాగపోస్తారు… మేకనో, కోడినో బలి ఇస్తారు… తరతరాలుగా వాళ్లకు చేసే పూజా పద్ధతులు అవే…
సేమ్, అలాగే దశ మహావిద్యలు… అంటే అమ్మవారిని పది అవతారాల్లో పూజించడం… మామూలుగా మనం గుళ్లల్లో చూసే దక్షిణాచార పూజా పద్ధతులు ఈ అమ్మవార్లకు సంబంధించి అంత ప్రభావమంతం కావు… వామాచారమే పవర్‌ఫుల్… దశ మహావిద్యలు అంటే కాళి, చిన్నమస్త, తార, మాతంగి, త్రిపురసుందరి, కమల, భువనేశ్వరి, ధూమావతి, భైరవి, భగాళాముఖి...
వీటిలో భగాలాముఖి పూజ ఆరోగ్యం కోసం, శత్రువుపై విజయం కోసం..! మూడేళ్ల క్రితం కేసీయార్ మోడీ మీద కస్సుబుస్సుమంటూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనీ, ఏమాత్రం చాన్స్ దొరికినా ప్రధాని అయిపోవాలనేంత ఊపులో కనిపించాడు తెలుసు కదా… బహుశా ‘మా బాసుకు మోడీ మీద విజయం’ అనే లక్ష్యంతో బాసు ఫ్యాన్ ఎవరో ఈ పూజ చేయించి ఉంటారులెండి… కానీ స్వయంగా చేయాలి ఈ పూజలు…
కామాఖ్య గుడి ఇలాంటి తాంత్రిక పూజలకు ఫేమస్ అని మొన్న చెప్పుకున్నాం కదా… ఈ దశమహావిద్యల పూజలు ఇతర గుళ్లల్లో చేయడం వేరు, కామాఖ్య గుడిలో చేయడం వేరు… పైగా వైజాగ్ పీఠాలు, ముచ్చింతల్ పీఠాలు, శృంగేరీ పీఠాలు గట్రా ఈ పూజలు చేయలేవు..!!
Share this Article