Chalasani Srinivas…….. భగవంత్ కేసరి ఈ చలనచిత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చూసిన బాలకృష్ణ సినిమాల్లోకెల్లా ఆయన పర్ఫామెన్స్ సందేశాత్మకంగా బాగున్నదిగా భావిస్తున్నాను. ఎందుకంటే అఖండతో సహా చాలా నాకు నచ్చలేదు.
…
ముందుగా ఈ సినిమాలో మైనస్ పాయింట్లు చెప్పుకుంటే. షరా మామూలుగా హీరో పదుల సంఖ్యలో చిన్న ఆయుధం ఆఖరికి వైన్ బాటిల్ ఓపెనర్ కూడా తీసుకొని పిల్ల విలన్లని చంపేస్తాఉంటాడు. ఆయన మాస్ ఫాన్స్ కోసం ఈ సీన్లు అయి ఉంటాయి, ఫైట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ చిత్రం యాక్షన్ తో కూడా కూడి ఉన్నది కాబట్టి కొన్ని అవసరమే కానీ అనవసరంగా ఈ చలన చిత్రంలో బోయపాటి శ్రీను గారి ఫైటింగ్ ఆత్మ అప్పుడప్పుడు ఈ సినిమాలోకి రావడం చిరాగ్గా అనిపించింది.
Ads
మొదటిభాగం మరియు బాలకృష్ణ గారు కాజల్ మధ్యన ముదురు ప్రేమ కృత్రిమమైన డైలాగ్స్ పెద్దగా ప్రేక్షకుల్ని అలరించవు. స్కంద సినిమాలో లాగా ముఖ్యమంత్రి లాంటి పెద్ద కారక్టర్స్ అందర్నీ చాలా చీప్ గా చూపించడం సహజంగా లేదు. సినిమా మొదలు పెట్టడం చాలా బాగా తీసినా సరే తర్వాత మొదటి భాగం కొన్ని సీన్లు మినహా మినహా చాలా నెమ్మదిగా సాగింది.
కొంత తండ్రీ కూతుర్ల లాంటి అనుబంధం పెంచడానికి ఉపయోగపడినా, జనరల గా స్క్రీన్ ప్లే లేదా ఇంకా గట్టిగా దృష్టి పెడితే బాగుండేది. మెరిట్ తో పోస్టింగ్ అయ్యాను రికమండేషన్ బ్యాచ్ కాదు అని చెప్పాల్సిన డైలాగు కొంచెం మారి వచ్చింది. కొన్ని చోట్ల సినిమాలో ఏం జరుగుతుందో ముందే ఊహించవచ్చు. ఫ్లాష్ బ్యాక్ లు రెండు పెట్టినా సరే భయంకరమైన/ఊహాతీతమైన ట్విస్టులేమీ సినిమాలో లేవు.
..
ఈ సినిమాలో నాకు కనెక్ట్ అయింది ఒక అద్భుతమైన సందేశం. ఆ సందేశం వల్ల ఈ సినిమాని కలెక్షన్ జయాపజయాలతో నిమిత్తం లేకుండా మంచి సినిమాలు కేటగిరిలో వేయవచ్చు. ఫ్లాష్ బ్యాక్ లో తన కుటుంబాన్ని గ్యాంగ్స్టర్ తో పోరాడుతూ కోల్పోయిన ఒక మాజీ సీఐ (పోలీస్ ఆఫీసర్) ఒక చిచ్చాగా అంటే బాబాయ్ లాంటి క్యారెక్టర్, తల్లిదండ్రులను పోగొట్టుకున్న తను పెంచిన కూతురులో చిన్నప్పుడు తల్లి తండ్రి చనిపోవడం వల్ల వచ్చిన భయ రుగ్మత పోగొట్టడానికి చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ఆర్మీలో చేర్పించడానికి చూడటం ఆ ప్రయత్నములో భాగం.
ఆ సినిమాలో “లీవ్ మీ చిచ్చా” అనే తండ్రి కూతురు అనుబంధంలో వచ్చిన సన్నివేశం, తర్వాత ఆ కూతురే తండ్రిని కాపాడటానికి తెగించి చేసిన పోరాటంలో వచ్చిన డైలాగ్స్, తనను ప్రేమించి వచ్చినవాడు తన తండ్రి కాపలా/ట్రాప్ నుంచి బయటికి రమ్మంటే చెప్పిన డైలాగ్స్ మరియు ఆ ముఖంలోని హావభావాలు ఆ సెంటిమెంట్ విషయాల్లో నా కళ్ళు చెమ్మగిల్లాయి.
హిందీలో అవసరానికి మించి డైలాగులు ఉన్నా సరే ప్రతికూతుర్ని సింహాలాగా పెంచాలి, ధైర్యంతో పెంచాలి అనే గొప్ప సందేశం నా మనసుకు కనెక్ట్ అయింది నేను అలా పెంచలేకపోయాను అనే బాధ గుండెను పిండేసింది. బయట పెద్దలపట్ల గౌరవం, చక్కటి వ్యక్తిత్వం, కాఫీ టీ తో సహా మొత్తం చెడు అలవాట్లు దూరంగా ఉండాలని, అబద్ధాలు చెప్పకూడదని ఇలా పెంచాను కానీ అవసరం వచ్చినప్పుడు సివంగిలా పోరాడాలని చెప్పటం మర్చిపోయాను. సమాజసేవలో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను (నా పిల్లలలో నిజాయితీ, ఆత్మగౌరవం ఉంది, కొంత కోపం ఉండొచ్చు గాని జీవితం అంతా చక్కటి అలవాట్లతో పెరిగిన వాళ్ళు. ఈ సమాజంలో కల్లాకపటం తెలవకుండా ఉన్న అబ్బాయి కూడా ఎలా పోరాడి ఎలా నెగ్గుతాడో అన్నది భయంగా ఉంది).
బాలకృష్ణ గారి క్యారెక్టర్ లో, ఆ ఫైట్లలో అతి తీసివేసి చూస్తే చాలా గొప్పగా నటనలో ఇమిడిపోయారు. బాలకృష్ణ గారిని కంట్రోల్లో పెట్టగలిగే డైరెక్టర్ ఉంటే ఇంకా గొప్ప పర్ఫార్మెన్స్ తీయవచ్చు. దీన్ని ఒక ఫ్యామిలీ సందేశ చిత్రంగా చూడవచ్చు. చిత్రంలో ఎక్కడా కూడా అసభ్యత లేదు. రెండు మూడు డబల్ మీనింగ్ డైలాగులున్నా సరే అది మహిళలని కించపరిచేటట్లు లేవు. బాలకృష్ణ గారు బయట ఏం మాట్లాడారు అనేది నేటి సినిమా చర్చలో కొంతమంది చేస్తున్నారు, అది అవసరం లేదు, ఆయన బోళాతత్వం ఓపెన్ నెస్ మంచిదే, అయినా సరే, వ్యవహార శైలి, వారు అదుపుతప్పి స్పందించడం వ్యక్తిగతంగా ఇష్టపడను. ఆది వేరే.. సినిమాని సినిమాగా చూడాలి.
ఇక శ్రీలీల అనే అమెరికాలో పుట్టి బెంగుళూరులో స్థిరపడ్డ తెలుగు అమ్మాయి, సినిమా ఫీల్డ్ కొచ్చి దాదాపు 5 ఏళ్ళు అయింది అంట. తెలుగులో రెండు మూడు సినిమాలలో వచ్చినట్లు ఉంది కానీ ఆ 22 ఏళ్ల అమ్మాయి తన జీవితంలో ఊహించని పాత్ర ఇంత చిన్న వయసులో చేయడం అది కూడా దాదాపు ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ఇవ్వటం, దాన్లో అద్భుతంగా ఆ వయసులో రాణించింది అని చెప్పాలి. ఈ నవీన కాలంలో తెలుగు సినిమాల్లో ఆ వయసులో, ఆ పరిణితితో నటించిన నటి నాకు కనపడలేదు. డాన్సులు కూడా మంచి ఈజ్ తో చేసింది. జూనియర్ ఎన్టీఆర్తో సమానంగా నృత్యం చేసే మరొక అమ్మాయి దొరికింది. అయితే రిథం కనెక్టివిటీలో ఇంకా కొంత పరిణితి రావాల్సి ఉంది. తన జీవితంలో గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ గా ఇది కచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తెలుగు కన్నడ ఫీల్డ్ లో ‘చాలా కాలం’ నెంబర్ వన్ హీరోయిన్గా ఆమె రాణించే అవకాశం ఉంది.
సినిమాలో మహిళలకి బాలకృష్ణ ద్వారా చెప్పించిన ‘బాడ్ టచ్ -గుడ్ టచ్’ ఇవన్నీ కూడా చూపించినట్లు ఉన్న సందేశం మంచిదే కదా. నాటి మాస్ తమిళ హీరో శరత్ కుమార్ ను చూడగానే ఒక మ్యాన్లీ ఒక హీరోయిక్ గుర్తుకొస్తాడు. ఆయన క్యారెక్టర్ మొట్టమొదటే సినిమా అంచనాలను పెంచింది. అర్జున్ రాంపాల్ రాహుల్ సింగ్విగా చేసిన నటన చాలా బాగుంది. అయితే విలనిజంలో క్యారెక్టర్ ఇంకా బలంగా ఆఖరి వరకు పెడితే బాగుండేది.
ఇక మొత్తం దేశంలో ముఖ్యమైన లాజిస్టిక్స్ కాజేయటానికి సింఘ్వి అనే గుమా వ్యాపారి క్యారెక్టర్ ప్రవేశ పెట్టడం ప్రస్తుతం ఆదాని గారిలాంటి షేడ్స్ ఆ క్యారెక్టర్ లో నాకు కనపడ్డాయి అనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఆయన బెదిరించో కత్తిపెట్టొ లేదో బామాలో లాగేసిన ఐదు తెలుగు వారి ప్రతిష్టాత్మక సంస్థల విషయమే కాకుండా మొత్తం ఎయిర్పోర్ట్ విషయంలో పోర్టుల విషయంలో ఈ ఇండియాని దోచేయడానికి చూస్తుంది సినిమాలో అంతర్లీనంగా చూపించారని అనిపిస్తుంది. బాలకృష్ణ గారికి పొలిటికల్ డైలాగ్ ఒకటి ఉన్నా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. కానీ వాళ్ళ నాన్నగారు చెప్పిన డైలాగులు అంటూ నాలుగు సార్లు జీవిత సత్యాలుగా చెప్పినవి మాత్రం కనెక్ట్ అవుతాయి.
కాజల్ ‘ఆంటీ‘కి కొంత తప్ప పెద్దగా నటించే అవకాశం కథలో లేదు. చాలామంది తమకు ఇచ్చిన పాత్రకు పరిమితమై చేశారు కానీ సినిమా మొత్తం చిచ్చా బిడ్డ (విజ్జు) సినిమానే. అనిల్ రావిపూడి గారి దర్శకత్వం బావుంది. తమన్ గారి బిజిఎం రెండవ భాగంలో కొంత ఎలివేట్ అయింది. అయితే బాగా ఆకట్టుకునే పాటల విషయంలో ఈ మధ్యన లోపం జరుగుతుంది. ఎడిటింగ్ బాగానే ఉంది, ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని కొన్ని చోట్ల ట్రిమ్ చేస్తే బాగుండేది.
కెమెరామెన్ పనితనం పర్ఫెక్షన్ ఇంకా బాగా రావాలి అనేది అనిపిస్తుంది . మొత్తానికి కుటుంబం కుటుంబం చూడదగ్గ సినిమా ఇది. బాలకృష్ణ గారి సినిమాల్లో అలాగే ఎన్టీఆర్ గారు సినిమాలో కొన్ని పాత పాటలు ఇక్కడ జత చేయడం బాగుంది. ఏదేమైనా బాలకృష్ణ గారి సినిమాల్లో రెండు మూడు దశాబ్దాలలో నాకు నచ్చిన సినిమా ఇది. మహిళలకు, పిల్లలకి కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్+ ఖచ్చితంగా అవుతుంది.
P.S: పనిగా దంగల్ సినిమాతో పోల్చకపోయినా దీంట్లో ఉన్న సెంటిమెంట్ హిందీ సినిమాల్లో అలాగే బయట కూడా బాగా వర్కౌట్ అవ్వవచ్చు వెంటనే దర్శకుడు నిర్మాతలు కొంత మార్చి హిందీ నేటివిటికి మిగతా వాటికి అనుగుణంగా చేసి డబ్ చేసి రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమాగా హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. తెలిసినవారు వారికి, చెప్పండి. MovieTeam… all the best. – chalasani
Share this Article