Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈయన గీతా ప్రచారానికి సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన..!

January 2, 2025 by M S R

.

బంజారా భాషలోకి భగవద్గీత… ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత…ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి; భగవంతుడికే చెప్పినవి. లేదా భగవంతుడి గురించి రుషులు చెప్పినవి.

18 అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణమూ కాదు; కావ్యమూ కాదు. మహాభారత కావ్యంలో అంతర్భాగం. గీత ప్రారంభమే “ధర్మ క్షేత్రే కురు క్షేత్రే”. ఈ మాటలను అటు ఇటు జరిపి “క్షేత్రే క్షేత్రే ధర్మం కురు” “ప్రతి చోటా ధర్మాన్నే పాటించు” అన్న అర్థం తీసుకోవాలని పురాణ ప్రవచనకారుల భాష్యం.

Ads

అటు ఇటు కురు పాండవులు కత్తులు దూసుకోవడానికి సమరశంఖం పూరించిన వేళ… కదనసీమ కురుక్షేత్రం మధ్యలో విల్లమ్ములు పారేసి వైరాగ్యంతో నీరుగారి… యుద్ధం చేయను… అన్న అర్జునుడికి కృష్ణుడు చెప్పినది ఈ భగవద్గీత.

మనమేమీ సంసార యుద్ధసీమలో అర్జునుడిలా భయపడి విల్లమ్ములు పారేసి… పలాయనం చిత్తగించలేదే? మరి మనకెందుకు ఈ గీత?

ఎందుకంటే?
కృష్ణుడు అర్జునుడి ద్వారా లోకానికే చెప్పాడు కనుక. ఒక్క అర్జునుడికి మాత్రమే ఇలాంటి వ్యామోహాలు, వైరాగ్యాలు, నిట్టూర్పులు, నిస్సత్తువ, పలాయనవాదాలు లేవు… లోకంలో అందరూ ఇదే జబ్బుతో బాధపడుతున్నారని కృష్ణుడికి తెలుసు కనుక.

ఆ రోజుల్లో వాట్సాప్ లు, ఫేస్ బుక్ లైవ్ లు, శాటిలైట్ లైవ్ లు లేవు కాబట్టి కోట్ల మంది పోగయిన ఒకేచోట అందరికీ వినిపించేలా ఒకేసారి చెప్పేశాడు. అర్జునుడు ఒక్కడికే అయితే గుడారంలోకి పిలిచి చెవిలో చెప్పేవాడు. మనకు వినపడి ఉండేది కాదు.

ఘంటసాల ఏ క్షణాన భగవద్గీతలో కొన్ని శ్లోకాలను పాడాడో కానీ… అప్పటి నుండి భగవద్గీత శవయాత్రలకు శబ్దసహకారంగా మారిపోయింది. ఆత్మలకు సంబంధించిన తాత్విక విషయాలు కొన్ని గీతలో ఉండడం, ఘంటసాల వాటిని అనితర సాధ్యంగా పాడడం, చావు పందిట్లో సౌండ్ బాక్సులో ఏమి పెట్టాలో తెలియకపోవడంతో భగవద్గీత చావు పందిరి మేళం అయిన మాట నిజం. ఇలా చచ్చినవారి వెంట నేపథ్య గానం అవుతుందని తెలిసి ఉంటే ఘంటసాల ఎట్టి పరిస్థితుల్లో భగవద్గీత పాడి ఉండేవారు కాదు.

బతికి ఉండగా ఏనాడూ గీతలో ఒక్క మాట వినలేదు… కనీసం చచ్చాక అయినా భగవంతుడి వాక్కు వెంట వస్తోంది… పుణ్యమే కదా? వద్దంటే ఎలా? అన్నది ఒక వాదన.

మన మెదళ్లలో బూజు దులిపి, మన మనసుల్లో అలముకున్న నైరాశ్యాన్ని పారద్రోలి, వంగిన మన వెన్నెముకలను నిటారుగా నిలబెట్టి, మన జీవన కార్య క్షేత్రంలో యుద్ధానికి కావాల్సిన భౌతిక, బౌద్ధిక బలాన్ని ఇచ్చే భగవద్గీతను బతికి ఉండగా వాడుకుని బతుకును బాగు చేసుకోకుండా… చచ్చాక వినిపిస్తే ఎవరిని ఉద్ధరించడానికి? అన్నది మరొక వాదన.

ఈ చర్చల జోలికి వెళ్ళకుండా అందులో ఉన్న మంచిని పదిమందికీ పంచుతుంటారు కొందరు. బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన కేతావత్ సోమ్ లాల్ భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించారు. నిజానికి భగవద్గీతా ప్రచార కార్యక్రమాల కోసమే ఇంకా చాలా ఏళ్ళ సర్వీసు ఉండగానే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

బంజారా భాషలోకి అనువదించిన భగవద్గీతకు, దాని మీద ఆయన ఉపన్యాసాలకు సామాజిక మాధ్యమాల్లో విశేషమైన స్పందన వస్తోంది. అటు బంజారా భాషలో, ఇటు సాధారణ తెలుగులో ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. కేతావత్ సోమ్ లాల్ తపన, ప్రయత్నం అభినందనీయం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018


ఇలాంటి ఆధ్యాత్మిక ప్రచారం గతంలో కూడా కొందరు చేశారు… ఎం.కృష్ణ అనే రైల్వే ఎంప్లాయీ ఈ దిశలో బాగా వర్క్ చేశాడు… ఇదీ హిందూలో వచ్చిన స్టోరీ లింక్…

https://www.thehindu.com/news/cities/Hyderabad/bhagavad-gita-translated-into-banjara-dialect/article3871303.ece

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions