Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హే భైరవా, హే గరుడా… ముగ్గురు హీరోయిన్లు మూడు సహాయక పాత్రలు…

May 30, 2025 by M S R

.

ముగ్గురూ కాస్త దేహపుష్టి ఉన్నవాళ్లే… అందరూ ఓ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నవాళ్లే… మీడియం రేంజ్ హీరోల స్థాయి నుంచి మనీ గ్యారంటీ హీరోల రేంజ్‌కు పెరగలేకపోతున్నవాళ్లే… ముగ్గురూ కలిసి భైరవం అన్నారు… ఏమైంది..?

“భైరవం” ముగ్గురు ఆప్త మిత్రులు — వరద (నారా రోహిత్), గజపతి (మంచు మనోజ్), సీను (బెల్లంకొండ శ్రీనివాస్) — చుట్టూ కథ తిరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడు ₹1000 కోట్ల విలువైన దేవాలయ భూమిని లక్ష్యంగా చేసుకోవడంతో వీళ్ల జీవితాలు మలుపు తీసుకుంటాయి.., అదీ కథ…

Ads

ముగ్గురికీ సమప్రాధాన్యం ఉన్న పాత్రలే ఇవ్వబడ్డాయి… వాళ్ల పాత్రలకు తగినట్టు న్యాయం చేశారు కూడా… ఏ పాత్రకు ఎంత నటన అవసరమో అంతే… ఎక్కువ లేదు, తక్కువ లేదు… ఏ పాత్ర కూడా అనవసరంగా కథలో ఇరికించారు అన్నట్టుగా లేదు…

బెల్లంకొండ శ్రీనివాస్ : తనకు ఇచ్చిన పాత్ర సాఫ్ట్ నేచర్… అసలు ఫస్టాఫ్‌లో కేవలం పాటలు, స్టెప్పుల కోసమే తీసుకున్నారా అన్నట్టుగా ఉంది… కాకపోతే సెకండాఫ్‌లో పాత్రకు ప్రయారిటీ పెరుగుతుంది కాస్త… పర్లేదు…

మంచు మనోజ్: చాన్నాళ్ల తరువాత తెర మీద కనిపించాడు… నిజానికి చాన్నాళ్లుగా కుటుంబ గొడవలతో చిన్న తెర మీదే ప్రధానంగా కనిపిస్తున్నాడు ఎక్కువసార్లు… ఈ కథలో కూడా మంచి పాత్రే… కాకపోతే తనకు తగినట్టుగా ఆ పాత్ర కేరక్టరైజేషన్ బలంగా ఉండి ఉంటే మనోజ్‌కు కాస్ల ప్లస్ అయ్యేది… డైలాగ్ డిక్షన్ అచ్చం తండ్రిలాగే అనుకరిస్తున్నట్టు అనిపిస్తుంది… నెగెటివ్ అని కాదు, కానీ తనకంటూ ఓ స్టయిల్ అలవాటు చేసుకోవాలి తను…

నారా రోహిత్: కొంచెం పరిణతిలో కూడిన నటనే… అగ్రెసివ్ రోల్… ఆకారం కూడా డిఫరెంట్… తెల్ల జుట్టు, భారీ కాయం ఆ పాత్రకు నప్పింది… ముగ్గురు హీరోల పర్‌ఫామెన్స్ గురించి నెగెటివ్‌గా చెప్పేదేమీ లేదు, ఈ సినిమాకు బలం వాళ్లే…

గతంలో ఇదే దర్శకుడు నాంది, ఉగ్రం సినిమాలు చేశాడు కదా, అదే డిఫరెంట్ స్టోరీ లైన్, ప్రజెంటేషన్ ఆశిస్తాం కదా, అక్కడ కాస్త నిరాశ… పైగా తమిళ గరుడన్‌కు రీమేక్… (వెట్రిమారన్ దానికి దర్శకుడు, హిట్టే… గరుడన్ అమెజాన్ స్ట్రీమింగులో కూడా ఉంది)… తెలుగు దర్శకుడు విజయ్ కనకమేడల పాత కామెంట్స్, తాజా కామెంట్స్ వివాదాన్ని రేకెత్తించి, భైరవం సినిమాకు నెగెటివ్ క్యాంపెయిన్ తీసుకున్నట్టుంది వైసీపీ…

సరే, సినిమా కథలో లోపాలకు వస్తే… ఫస్టాఫ్ హీరోల ఇంట్రోలకే సరిపోయింది… త్వరగా ప్రేక్షకుడు కథతో కనెక్ట్ కాడు… ఫస్టాఫ్ నిజం చెప్పాలంటే బోర్…. ప్రధాన పాత్రల కేరక్టరైజేషన్లలో ఎమోషన్స్ డెప్త్ సరిగ్గా లేదు… మరీ ఏదో ఓ పాత తరహా చిత్రంలాగా అనిపిస్తుంది…

కాస్తోకూస్తో సినిమాకు ఊపు సెకండాఫ్‌లోనే… ఇంటర్వెల్ సన్నివేశం బాగానే రాసుకున్నారు… కాకపోతే సినిమాలో యాక్షన్ సీన్లు ఎక్కువయ్యాయి… అంత అవసరం లేదు నిజానికి… కాంతారా తరహాలో దైవికసాయం అనే పాయింట్ సినిమాలో సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు… డ్రామా పండలేదు… అదీ ఓ మైనస్సే…

పాటలు శిరోభారం… కాకపోతే బీజీఎం విషయంలో మాత్రం సంగీత దర్శకుడు శ్రీచరణ్ కాస్త మెరిట్ చూపించాడు… వాల్యూ ఆడిషన్… మరీ మైనస్ ఏమిటంటే..? హీరోయిన్లు… ఒక్క అదితి శంకర్‌కు కాస్త పాటలు దక్కాయి, మిగతవాళ్లయితే మరీ సహాయక పాత్రలే…

తెలుగు సినిమా అనగానే ప్రస్తుతం వెన్నెల కిషోర్ కనిపించడం ఓ సెంటిమెంట్‌గానో, తప్పనిసరి అవసరంగానో మారినట్టుంది… ఇందులోనూ ఉన్నాడు… కానీ పెద్ద ఇంప్రెసివ్ పాత్ర కాదు, తను పెద్దగా చేసిందేమీ లేదు… తనను సరిగ్గా వినియోగించుకోలేదు దర్శకుడు….  అమ్మమ్మ పాత్రలో జయసుధ వోకే… ఆమె ఇవి అలవోకగా చేసేయగలదు కదా…

బలాలు… సెకండాఫ్, ముగ్గురు హీరోలు, కొన్ని యాక్షన్ సీన్లు, బీజీఎం…….. బలహీనతలు… పాటలు, హీరోయిన్లు, ఎమోషన్ డెప్త్ లేని కథనం, ఫస్టాఫ్, వీక్ క్లైమాక్స్…. నిజానికి పాటలు మొత్తానికే లేకుండా ఉంటే సినిమాకు బాగుండేది… (యూఎస్ ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్‌లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’
  • ఫిక్సేనా..? ‘ఈసాల కప్ నమ్‌దే’ నిజమేనా..? ఈ జోస్యం ఫలిస్తుందా..?
  • ఈమె సోనియాని మించిన హక్కుదారు..!? అడుగడుగునా ఓవరాక్షన్..!!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • మొక్కు కోడెల ఉసురు… కలుక్కుమనిపించే మరణాల వార్తలు…
  • ‘మిస్ బిహేవ్’ అంటే… మిస్ వరల్డ్ వివాదం రేవంత్ మెడకు చుట్టడమా..?!
  • నాటి జతొజడ జమజచ్చ జంట… ప్లెయిన్, ఫెయిర్ మూవీ…
  • మూడు ‘నందుల’ ముచ్చటైన ‘ఉషాకిరణం’… కాంచనగంగ…
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • ఉహుహుహు… మనవాళ్లు వణికే చలిలోనూ వేడి పుట్టించగలరు సుమీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions