.
పెయిడ్ నెగెటివ్ డర్టీ క్యాంపెయిన్… బూతు వీడియోలే వార్తలు… బురద యూట్యూబిజం… కానీ దానికి జర్నలిజం అనే పేరు పెడితేనే జనానికి ఓ ఏవగింపు… కేసు పెడితే భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అట, జర్నలిజంపై ఉక్కుపాదం అట… జైళ్లకు వెళ్లి సంఘీభావాలు, పరామర్శలు…
ఎవడు, ఏ పార్టీవాడు ఇవి చేస్తేనేం, అన్నీ తప్పే… అది బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా… రియాలిటీ తెలియక ఢిల్లీలో కూర్చున్న కొన్ని తలకాయలు ఆ ముసుగు జర్నలిజాన్ని సమర్థిస్తే అదొక రీసెంటు పాత్రికేయ దరిద్రం…
Ads
సరే, ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే…? మిత్రుడు గోపాలక్రిష్ణ చెరుకు రాసిన ఓ స్టోరీ అసలు యూట్యూబ్ వీడియోల్లో కూడా ఎంత జర్నలిస్టిక్ టెంపర్‌మెంట్ చూపించవచ్చో, రియల్ జర్నలిజం అంటే ఏమిటో చెబుతుంది… ఆ కథనం ఇలా యథాతథంగా…
జర్నలిస్ట్…ఈ మాట వినగానే ఏ పార్టీ మనిషి అని ఠక్కున అడిగే రోజులివి. కానీ నిజంగా ఓ జర్నలిస్ట్ అంటే ఏంటి…? జర్నలిస్ట్ అనుకుంటే ఏం జరుగుతుంది…??
గత కొన్ని రోజుల క్రితం జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్దులు వరుసగా పాము కాట్లతో హాస్పిటల్ లో చేరారు. చనిపోయారు కూడా. అయితే, పాము కాటు అనే విషయాన్ని దాచేందుకు అక్కడి సిబ్బంది విశ్వప్రయత్నాలు చేశారు. కానీ జర్నలిస్టులు మాత్రం ఆ పాయింట్ వదల్లేదు.
ఇంకాస్త లోతుగా ఆరా తీస్తూ పాముకాటు వల్లే పిల్లలు చనిపోయారా అనే ప్రశ్నని కొన్ని రోజులపాటు బతికించారు. ఆ యాంగిల్ లోనే వార్తలు రాశారు. ఆ తరువాత ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా కదలడంతో ఆ ప్రాంతంలో పాముల పుట్టలు, పదుల సంఖ్యలో పాము పిల్లల ఆనవాళ్లూ కనిపించాయి. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అక్కడికి వచ్చి మరీ హాస్టల్లో పరిస్దితి ఆరా తీసేదాకా వెళ్లింది వ్యవహారం…
ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. ఇదిగో నెట్ ఫ్లిక్స్ లోని భక్షక్ అనే ఓ సినిమా చూస్తే… జర్నలిస్ట్ అంటే ఇలా కదా పనిచేయాలనిపించింది. బీహార్ లో జర్నలిజం మీద ఆసక్తితో యూట్యూబ్ చానల్ పెట్టుకుని ప్రజాసమస్యలను చూపిస్తూ ఉంటుంది వైశాలి అనే జర్నలిస్ట్.
ఓ సోర్స్ ద్వారా సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఉండే ఓ ఎన్జీవో వసతి గృహంలో చాలామంది ఆనాథ ఆడపిల్లలుంటారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి అండదండలతో ఆ ఆడపిల్లల్ని శారీరకంగా ఇష్టానుసారం వాడుతూంటారు. కనీసం మనుషులు అనే కనీస విజ్ఘత కూడా లేనంతగా వారి చర్యలుంటాయి.
ఈ విషయం ఓ సోర్స్ ద్వారా తెలుసుకున్న జర్నలిస్ట్ వైశాలి.. ఆ వార్తని ప్రసారం చేయాలనుకుంటుంది. కానీ అది పసిగట్టిన సదరు దుర్మార్గులు ఆమెని బెదిరిస్తారు. బంధువులపై దాడి చేసి ఆమెని కృంగదీస్తారు. నీదో చిన్న యూట్యూబ్ చానల్.. నీ వార్తలెవరు చూస్తారంటూ అవమానిస్తారు..
చివరికి భర్త కూడా.. రూపాయి సంపాదించలేని ఆ జర్నలిజం అవసరమా అంటూ ఆమెని నిలదీస్తాడు. కానీ జర్నలిజం చేస్తోంది డబ్బుకోసం కాదు… తృప్తి కోసమంటూ మరింతగా ముందుకు సాగుతుంది జర్నలిస్ట్ వైశాలి. ఆమె పట్టుదలతో చివరికి ఆ పిల్లల్ని ఎలా రక్షిస్తుందన్నదే ఈ భక్షక్ సినిమా కథ.
నిజానికి ఈ సినిమా కథంతా 2018 లో నిజంగా వెలుగులోకి వచ్చిన ఓ యథార్దం. నిజంగానే బీహార్ రాష్ట్రంలోని ముఝాఫర్ పూర్ లో జరిగిన ఘటన. ఆనాడు దేశంలో ఓ సంచలనం ఈ వార్త… హాస్టల్ లో ఉన్న 42 మంది బాలికల్లో 38 మందిపై లైంగిక దాడి జరిగినట్టుగా నాడు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ఆ ఎన్జీవో నిర్వహిస్తున్న బ్రిజేష్ అనే వ్యక్తితో పాటు, 11 మందిపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగానే తీసిన సినిమా భక్షక్. 2024 లోనే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కానీ ప్రతి జర్నలిస్ట్ ఒకసారి చూడాల్సిన సినిమా.
“Main sirf ek patrakar nahi, ek ladne wali aurat hoon!”
( I’m not just a journalist; I’m a woman who fights! )
అంటుంది సినిమాలో లేడీ జర్నలిస్టు వైశాలిగా నటించిన Bhumi Pednekar.
జర్నలిజం అంటే నిజంగానే జీతం కోసమో.. లేదా, ఏ పార్టీయో ఇచ్చే ఫండింగ్ కోసమో చేసేది కాదు.. ఓ ప్యాషన్ తో చేసేదని చెబుతుంది ఈ సినిమా. అవతలి వ్యక్తి కష్టానికో, బాధకో స్పందించే హృదయమే జర్నలిజం.
ఓ జర్నలిస్ట్ రాసిన వార్తతో ప్రభుత్వం కదిలింది అంటే ఆ జర్నలిస్ట్ పొందే తృప్తి వేల కోట్లు సంపాదించినా రాదు. యూట్యూబ్ ఛానలా.. లేక, ఏదైనా పేరు మోసిన పేపరో, ఛానలా అన్నది కాదు. రాస్తున్న అక్షరాల్లో “జర్నలిజం” అనేది ఉందా లేదా అనేదే పాయింట్….
Share this Article