దర్శకుడు వి మధుసూధనరావు వామపక్ష భావజాలాలు కలిగిన వాడు . అక్కినేని నాస్తికుడు . వీళ్ళిద్దరూ కలిసి ఓ చక్కని భక్తి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు . భక్తితో పాటు కాస్త రక్తిని కూడా కాంచన పాత్ర ద్వారా అందించారు . శివాజీ మహారాజ్ పాత్రలో శివాజీ గణేశన్ కాసేపే కనిపించినా ప్రేక్షకులు ఆ పాత్రను , పాత్రధారినీ మరచిపోరు . 1973 లో రిలీజయిన ఈ భక్త తుకారాం సినిమా మూడు విజయవాడ , విశాఖపట్నం , హైదరాబాదులలో వంద రోజులు ఆడింది .
అంజలీదేవి స్వంత బేనర్ అయిన అంజలీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఆయువుపట్టు పి ఆదినారాయణరావు అందించిన సంగీతమే . ఘనాఘన సుందరా , భలే భలే అందాలు సృష్టించావు , కరుణామయా దేవా , పాండురంగ నామం , నా పిలుపు వినగలేవా , శ్యామసుందరా , ఉన్నావా అసలున్నావా , పడవెళ్ళిపోతుందిరా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . బాగా హిట్టయ్యాయి కూడా …
మరో రెండు పాటలు , ఆ పాటల్లో కాంచన నృత్యం , ఆమె అందచందాలు ఈ సినిమాలో మరచిపోలేనివి . పూజకు వేళాయెరా రంగ పూజకు వేళాయెరా , సరిసరి… పాటల్లో రక్తి అధ్భుతం . పూజకు వేళాయెరా రక్తి పాట వెంటనే మానవ శరీరం ఎలా శుష్కించి , అందవిహీనంగా తయారవుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించే వేదాంతం , జీవిత సారాంశం నాకు బాగా ఇష్టమయినవి . అందరికీ తెలిసినవే , అందరం మరచిపోయేవే .
Ads
అక్కినేని నాస్తికుడయినా చక్రధారి , క్షేత్రయ్య , తుకారాం వంటి భక్తి పాత్రల్లో ఆయనకు ఆయనే సాటి అని రుజువు చేసారు . ANR , అంజలీదేవి , కాంచన , శివాజీ గణేశన్ , నాగభూషణం , ధూళిపాళ , నాగరాజు ప్రభృతులు నటించారు . అతిలోకసుందరి శ్రీదేవి అక్కినేని అంజలీదేవిల కుమార్తెగా నటించింది .
కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో చూసా . టివిలో తరచూ వస్తూనే ఉంటుంది . మంచి సినిమా . యూట్యూబులో కూడా ఉంది . చూడనివారు తప్పక చూడవలసిన భక్తి రక్తి సినిమా . పాటల వీడియోలన్నీ యూట్యూబులో ఉన్నాయి . గొప్ప ప్రశాంతతను ఇస్తాయి . ఆస్వాదించండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…. (డోగిపర్తి సుబ్రహ్మణ్యం)
ఇక్కడే ఇంకాస్త యాడింగ్… నిజానికి రక్తి పాట లేనిదే, శృంగార వ్యామోహాల ప్రస్తావన లేనిదే భక్తి సినిమా కథ లేదు… భక్త తుకారాం దగ్గర నుంచి భక్త కన్నప్ప, ఆమధ్య వచ్చిన శ్రీరామదాసు, అన్నమయ్యల వరకూ అంతే… రక్తి చూపనిదే భక్తి కథ రక్తికట్టదని మన సినిమా నిర్మాతల కమర్షియల్ పోకడ… దానికితోడు ఓ కంట్రాస్టు కూడా… ఈ వ్యామోహాల్ని బాగా చూపిస్తేనే కదా కంట్రాస్టుగా వైరాగ్యం ఇంటెన్స్ పెరిగేది…
శివశివ అననేలరా..? చాలు చాలు చాలు సరసాలు చాలు చాలు, అస్మదీయ మగటిమి పాటల్లాగే భక్త తుకారాంలోని పూజకు వేళాయెరా పాట కూడా..!! రంగపూజ అంటే ఆ రంగ పూజ, రంగడి పూజ అనే ద్వంద్వార్థం ధ్వనించేలా రాశాడు గీత రచయిత… అన్నమయ్యలో అస్మదీయ మగటిమితో పాటు ఏలే ఏలే మరదలా కూడా… అన్నింటికీ మించి ఓ ప్రయోగం చేశారు మరో పాటలో…
అర్చన అంటే అంగాంగ వర్ణన… ఈ స్థితిలో ఉన్న అన్నమయ్య తన రసాధిదేవతలకు శృంగారార్చన చేస్తున్నట్లుగా సినిమాలో చిత్రీకరించారు… తిరుమలలో స్వామివారికి షోడశోపచార పూజ (షోడశ అనగా పదహారు) జరుగుతూ ఉంటుంది… ఇక్కడ అన్నమయ్య ప్రియురాళ్లకు ప్రేమ పూజ చేస్తుంటాడు… రెండింటినీ సమంగా పోలుస్తూ నడుస్తుందీ పాట, దాని చిత్రీకరణ… అదీ రసాత్మకమైన పాటే… (ముచ్చట)
Share this Article