ఒకవైపు లావణ్య నిను వీడని నీడను నేనే అన్నట్టుగా వెంటాడుతోంది… సహజీవనం తాలూకు విషాదం, వివాదం రాజ్ తరుణ్ కెరీర్‌కు మబ్బులు కమ్మినట్టే ఇక అనుకుంటున్న దశలో… వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి తనకు… నిర్మాతలు దొరుకుతున్నారు… చేతినిండా పని, సంపాదన ఉంది…
అటు ప్లస్, ఇటు మైనస్… వరుసగా సినిమాలు వస్తున్నాయి సరే, కానీ అన్నీ తన్నేస్తున్నాయి… చెప్పుకోదగిన హిట్ పడటం లేదు… ఏమాటకామాట తను మాత్రం వీలైనంతగా కష్టపడుతున్నాడు… వరుస పరాజయాలు తనను ఇక ఏ తీరానికి చేరుస్తాయో గానీ, కొత్తగా వచ్చిన తన సినిమా భలే ఉన్నాడే కూడా పెద్దగా తనకు ఫాయిదా కలిగించేలా ఏమీ లేదు పాపం…
నిజానికి సాదాసీదా సీన్లలో అలవోకగా నటించేస్తాడు గానీ ఈరోజుకూ ఉద్వేగాల్ని పండించే సన్నివేశాల్లో తడబాటు కనిపిస్తోంది… సాధన అవసరం… సినిమాకు ఓ కొత్త హీరోయిన్ ఉంటుంది కదా… ఈ సినిమాలోనూ మనీషా అనే హీరోయిన్ ఉంది… అందగత్తే, కానీ నటనకు పెద్ద స్కోపేమీ లేని పాత్ర కాబట్టి చల్తా…
Ads
స్టోరీ పాయింట్ కాస్త బోల్డ్… దర్శకుడు ఎక్కడా అసభ్యత జోలికి పోలేదు, వెగటు సీన్ల కోసం కూడా తాపత్రయపడలేదు… నీట్‌గానే ప్రజెంట్ చేశాడు… రాముడు మంచి బాలుడు టైపు పాత్ర… అమ్మాయిలకు చీరెలు కట్టే డ్రేపర్ పాత్ర… తల్లికి సహాయకారిగా కూడా ఉంటాడు… ఆమె పనిచేసే ఆఫీసులోనే హీరోయిన్… ఈ రాముడి (హీరో) వంటలు టేస్ట్ చేసి, మనసు పారేసుకుని, లంచ్ బాక్సు సందేశాలు పంపించుకుంటూ ప్రేమలో పడిపోతారు… ఒకరికొకరు చూసుకోకుండానే…
కానీ నిశ్చితార్థం టైమ్‌కు ఎవరో చెబితే హీరో ‘కెపాసిటీ అండ్ కేరక్టర్’ మీద డౌటొస్తుంది… అసలు సంసారానికి పనికొస్తాడా లేదా..? కథ పరీక్షల కోసం కేరళ వెళ్తుంది… పెద్దగా మలుపులు ఏమీ లేకుండా అలా అలా కథ సాగీ సాగీ, నడుమ సింగీతం శ్రీనివాస్ కొన్ని మెరుపులు అద్దుకుని, చివరకు అనాస్తకంగానే ముగుస్తుంది… సంగీతం, కామెడీ, యాక్షన్ గట్రా ప్చ్ ప్చ్…
పెద్దగా ఖర్చు పెట్టలేదు సినిమాకు… సో, ఓటీటీ, శాటిలైట్ టీవీ, థియేటర్ రెవిన్యూ మొత్తం కలిస్తే నష్టాల్లేకుండా బయటపడొచ్చు… అక్కడక్కడా బోరింగుగా ఉన్నా సరే, క్లీన్ సినిమా… ఏమో, స్టిల్ నిర్మాతలు దొరికితే, ఇలాంటి లోబడ్జెట్ పాత్రలతోనే కథ నడిపిస్తే… ఏమో, ఏదో ఓ సినిమాతో సుడి తిరగొచ్చు… ఈలోపు లావణ్య నుంచీ విముక్తి లభించొచ్చు… రాజ్ తరుణ్ ఆశాజీవి… అనివార్యంగా…!!
Share this Article