Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక లోప్రొఫైల్ గరీబోళ్ల సీఎం… ఇప్పుడు కలలో కూడా కనిపించరు…

January 13, 2025 by M S R

.

(భండారు శ్రీనివాసరావు)…. ….. అంజయ్య ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఓ రోజు ఆయనతో కలిసి మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు నాయకులు ఆ తరువాతి కాలంలో (ఉమ్మడి) రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.

ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్ అనాలా?) లో ఇంటికి నడిచి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది.

Ads

అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి ‘ శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పద’ అన్నారు.

నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఇల్లు ఏ పరిస్తితిలో తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో ‘అమ్మవొడి’ పేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు.

అలా ఆలోచించే లోపలే, అక్కడినుంచి మూడో ఇల్లే మాది, ముఖ్యమంత్రితో సహా అందరం మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా ఇంట్లో బాగా వెనగ్గా వుంటుంది.

గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో ఎక్కడ గుంటవుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము. అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు.

మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది. గోడకు ఆనించి పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ సరిపోయేలా లేవు.

ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు భవనం వెంకట్రాం గారు కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు.

మిగిలినవారందరూ నిలబడే వుండాల్సిన పరిస్తితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా. మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరికొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు.

మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్. అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాధికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ‘ఇదేం పద్ధతిగా లేదు’ అన్నాడు.

నాకు కోపం చర్రున లేచింది. ‘ఆయన్నేమన్నా బొట్టుపెట్టి పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది. అతడు ఎవరో కాదు జర్నలిస్టులు అందరం ముద్దుగా ‘బోలోజీ’ అని పిలుచుకునే బాలాజీ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions