.
ఈ కథన ముఖ చిత్రం చూశారు కదా… హమ్మా, అతగాడికి ఎంత ధైర్యం అనిపించిందా..?
ఎన్టీవోడులు, అక్కినేనిలు కూడా తాకడానికి సంకోచించే, సందేహించే అంతటి భానుమతి చేతుల్ని అలా పట్టుకుని రొమాంటిక్ ఫోజు పెడుతున్నాడు… ఆమె కూడా పర్లేదులేవేయ్ అన్నట్టుగా అలా కూర్చుని, ఫోటోకు ఫోజులిచ్చింది…
Ads
ఇంతకీ ఎవరబ్బా ఈ సాహసి..? అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఉండబడిన ఈ ధైర్యవంతుడి వివరాలేమిటి అనే కుతూహలం కలుగుతోందా..?
మిత్రుడు రంగావఝల భరద్వాజ పోస్టు చదవండి ఓసారి…
ఈ ఫొటోలో భానుమతి ని ధైర్యంగా పట్టుకుని నిలబడ్డ వ్యక్తి పేరు సూర్యనారాయణ. సినిమా పేరు రత్నమాల. ఈ సినిమాలో ఓ డ్రీమ్ సీక్వెన్స్ లోనూ క్లైమాక్స్ లోనూ మాత్రమే అతను కనిపిస్తాడు.
సువర్ణ మాల అనే సినిమాలో హీరోగా చేశాడు. ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో నటిస్తూండేవాడు. అప్పుడు అది ప్రయివేట్ బ్యాంక్ పాపం. ఓసారి బ్యాంకు డబ్బు వేరే చోటికి తీసుకెడుతుండగా ఎవరో అతని మీద దాడి చేసి హత్య చేశారు.
ఈ రత్నమాల సినిమాకు సంబంధించి మరో విశేషం ఉంది. ఈ సినిమాకు… సి.ఆర్.సుబ్బరామన్ సంగీతం అందించారు. ఘంటసాల ఆయన దగ్గర సహాయ సంగీత దర్శకుడుగా పనిచేశారు. నిజానికి అప్పటికే ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు.
అయితే సుబ్బరామన్ ఆర్కెస్ట్రైజేషన్ విపరీతంగా నచ్చి, అది చూసి, అలా చేయడం నేర్చుకోవాలనే ఘంటసాల అక్కడ చేరారు. ఇక దాడి, హత్య విషయానికి వస్తే 1958 లో అతనితో కలిసి సినిమాల్లో వేసిన వారే డబ్బు కోసం హత్య చేసారు, ముగ్గురిలో ఇద్దరికీ శిక్ష పడితే, ఒకడు ఇంత వరకు దొరకలేదు.
ఈ సెన్సేషనల్ మర్డర్ కేసుని కొద్ది మార్పులతో భీమ్ సింగ్ 1966 లో ‘సాధు మిరండాల్’ పేరుతో తమిళంలో సినిమా తీసాడు. Randor Guy (ఇంగ్లీష్ వాడని అనుకున్నారు కానీ, రావి కొండలరావు ‘రంగ దురై’ ని పరిచయం చేసాక నిజం తెలిసింది) ఒక పుస్తకం కూడా ఇతని హత్య పైన రాసినట్లు జ్ఞాపకం…
మళ్లీ ఆ రత్నమాల సినిమా విషయానికి వస్తే అది భానుమతి సొంత నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్ మొదటి సినిమా… ఏఎన్నార్, భానుమతి నటించారు… కథావిశేషం ఏమిటంటే… పదహారేళ్ల అమ్మాయిని పదహారు నెలల అబ్బాయి పెళ్లాడతాడు… ఓ జానపద కథ…
దైవసాయం, రాజరికపు ఎత్తులు గట్రా ఉంటాయి… ఇలాంటి కథతో ఒకటీరెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయని అనిపిస్తోందా..? నిజమే, ఉన్నాయి… మహేశ్ బాబు నాని సినిమా కథ కూడా ఈ కథను సోషలైజ్ చేయబడినదే… మాధవి నటించిన మరో సినిమా కూడా ఉన్నట్టు గుర్తు…
భానుమతి ఇందులో నాట్యం కూడా చేస్తుంది… దర్శకుడు వేదాంతం రాఘవయ్య కొరియోగ్రాఫర్ దీనికి… అప్పట్లోనే సినిమా కొన్ని విమర్శలకు గురైంది… ఐననూ జనం ఆదరించారు..!!
Share this Article