నిజానికి ఆయన రాజకీయాల్లో ఏమీ తెలియని అమాయకుడేమీ కాదు… తను సోషల్ వర్క్‌లో పీజీ చేశాడు… ఒకప్పుడు అహ్మద్ పటేల్ స్ట్రాంగ్ హోల్డ్ అయిన గుజరాత్, భరూచ్ స్థానం నుంచి 1998 నుంచి ఎంపీగా గెలుస్తూనే ఉన్నాడు… అంతకుముందు ఎమ్మెల్యే… ఒక దశలో కేంద్ర గిరిజన మంత్రిగా కూడా పనిచేశాడు… వయస్సు 63 ఏళ్లు…. పార్టీ బీజేపీ… ఎవరి గురించి ఇదంతా అంటారా..? ఆయన పేరు మాన్సుక్భాయ్ ధన్జీభాయ్ వాసవ… సింపుల్‌గా అందరూ వాసవ అని పిలుస్తారు… అయితే ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి ఎక్కాడు అంటే..?
మొన్న అకస్మాత్తుగా ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా ప్రకటించాడు… అందరూ షాక్… అదేమిటయ్యా, గుజరాత్లో ఇంత సీనియర్ పార్టీ లీడర్‌వి, వరుస ఎంపీవి, నువ్వే రాజీనామా చేయడం ఏమిటి… అసలు ఏమిటి సంగతి అని అడిగితే… ఆఫ్ ది రికార్డుగా ‘‘నా నియోజకవర్గంలోని 121 ఏళ్లను ఎకో సెన్సిటివ్ జోన్లోకి చేర్చడం నచ్చలేదు’’ అన్నాడు… కానీ పోరాడలేడు… ఇప్పటి స్థితిలో పార్టీ పెద్దలకు ఎవరికి చెప్పినా ఎవరూ వినేవాళ్లు లేరు అనేది తన బాధ…
Ads
నేరుగా మోడీకి లేఖ రాశాడు… ఫలితం లేదు… బాధపడి రాజీనామా ప్రకటించాడు… ‘‘పార్టీకి విధేయుడినే… ఇప్పటిదాకా నాకు మంచి అవకాశాల్నే ఇచ్చింది… కానీ అనారోగ్యం పీడిస్తోంది… జనాన్ని పెద్దగా కలవలేకపోతున్నాను… జనంలో తిరగనిదే ఇక ఎంపీగా ఉండి ఏం ప్రయోజనం..? అందుకే పార్టీని, పదవిని వదిలేస్తున్నాను’’ అని మీడియాకు చెప్పాడు…
సరే, బీజేపీ నాయకత్వం ఊరుకోదు కదా… మాట్లాడింది, నచ్చజెప్పింది… రాజీనామా వాపస్ తీసుకుంటున్నట్టుగా ఆ ఎంపీతో ప్రకటింపజేసింది… కథ ఇక్కడ ముగిసిపోవాలి కదా… కానీ ఎంపీ తన రాజీనామా వాపస్‌కు చెప్పిన కారణాలు రచ్చ అయిపోయాయి… నిజంగా ఇప్పటికీ ఇలాంటి అమాయక ఎంపీలు ఉన్నారా అని సోషల్ మీడియా ఆశ్చర్యపోతే… చివరకుఇలాంటి ఎంపీలు కూడా ఉన్నారు అని పెదవివిరిచినవాళ్లు కొందరు…
‘‘నాకు వెన్నునొప్పి, అది విస్తరిస్తోంది… మెడ దాకా విస్తరించింది… నువ్వు ఎంపీగా ఉంటేనే ఫ్రీ వైద్యం దొరుకుతుంది… రాజీనామా చేస్తే అది దూరం అవుతుంది అని పార్టీ నాయకులు చెప్పారు… అందుకని రాజీనామా వాపస్ తీసుకున్నా… అనారోగ్యం ఏముందిలే… నువ్వు రెస్ట్ తీసుకో, పార్టీలో కొందరికి నీ బాధ్యతలు అప్పగిద్దాం అని కూడా పార్టీ నాయకులు చెప్పారు…’’ అని చెప్పుకొచ్చాడు…
ఏమాత్రం సందు దొరికినా సరే, దేశాన్నే అమ్ముకునే నాయకులు బోలెడు మంది… ఈ స్థితిలో తన వెన్నునొప్పికి ఫ్రీ చికిత్స కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నాను అని చెప్పే ఎంపీ కనిపించడం అరుదు… అందుకే గుజరాత్ దాటి జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కాడు… ఇంతకీ పాలిటిక్స్ నీకెందుకు స్వామీ అనాలా..? నీలాంటోళ్లే పాలిటిక్సులో అవసరం అనాలా..?
Share this Article