Subramanyam Dogiparthi…… ఆకులు పోకలు ఇవ్వొద్దూ , నా నోరు ఎర్రగ చేయొద్దు , ఆశలు నాలో రేపొద్దు , నా వయసుకు అల్లరి నేర్పొద్దు . భార్యాబిడ్డలు సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆత్రేయ వ్రాసిన ఈ పాటే . నాకు చాలా ఇష్టమైన పాట . ఈ పాటలో నాగేశ్వరరావు , జయలలితల డాన్స్ కూడా నాకు భలే ఇష్టం . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే .
ఈ సినిమాలో పాటలన్నీ ఆత్రేయ ఒక్కరే వ్రాసారు . అందమైన తీగకూ పందిరుంటే చాలునూ పైకి పైకి పాకుతుంది చినదానా పరవశించీ సాగుతుంది చినదానా , చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కు లేని చుక్కలయినామూ , వలచీనానమ్మా , చల్ మోహన రంగా పాటలు హిట్టయ్యాయి .
1972 లో వచ్చిన ఈ సినిమా నాగేశ్వరరావు , జయలలితలది . భార్యాబిడ్డలని , కుటుంబాన్నీ పోషించుకోవటానికి ఓ నిరుద్యోగి అబధ్ధంతో ఉద్యోగం సంపాదించుకుని ఇరుక్కుపోతాడు . చక్కటి కుటుంబ కధాచిత్రం . Feel good , ఎమోషనల్ , మ్యూజికల్ హిట్ . ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్లో వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు తాతినేని రామారావు .
Ads
విశేషం ఏమిటంటే ఈ సినిమాకు ఆధారమయిన 1953 లో వచ్చిన బతుకుతెరువు సినిమాలో కూడా నాగేశ్వరరావే హీరో . అందులో సావిత్రి , శ్రీరంజని , SVR నటించారు . ఈ 1953 సినిమాను బలే రామన్ టైటిల్ తో తమిళంలో కూడా తీసారు . తర్వాత రోజుల్లో జీనే కీ రాహ్ టైటిల్ తో యల్ వి ప్రసాద్ జితేంద్ర , సంజీవ్ కుమార్ , తనూజలు నటించారు . ఈ హిందీ సినిమాకు కూర్పులూ మార్పులూ చేసి భార్యాబిడ్డలుగా తీసారు . అన్ని సినిమాలు హిట్టయ్యాయి .
భార్యాబిడ్డలు సినిమాలో జగ్గయ్య పాత్ర బాగుంటుంది . కృష్ణకుమారి , గుమ్మడి , రాజబాబు , హేమలత , సూరేకాంతం , సుమ , అల్లు రామలింగయ్య , మాస్టర్ విశ్వేశ్వరరావు ప్రభృతులు నటించారు . మరో విశేషం అతిలోకసుందరి శ్రీదేవి నాగేశ్వరరావు చెల్లెలుగా , బాగా నటించింది .
కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . ఒకటి రెండు సార్లు టి విలో కూడా చూసా . మంచి సినిమా . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి . నాగేశ్వరరావు , జయలలిత జంట అందంగా ఉంటుంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబులో . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article