ఇది చిన్న వార్తే… ఈమధ్యే రాసుకున్న కథనం ఇది… ఒక వార్త ఎందుకు ఠక్కున ఆకర్షించిందంటే… అందులోని కంటెంటు… ‘‘రాజమహేంద్రవరంలోని మహాకాళేశ్వరాలయంలో 4 రోజుల నుంచీ ప్రతీ రోజూ తెల్లవారు జామున భస్మాభిషేకాలు జరుగుతున్నాయి. నగరంలో 2 స్మశానాల నుంచి తెప్పించిన మానవ చితాభస్మాలను ఇందుకు వినియోగిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయంలో మినహా మరెక్కడా భస్మాభిషేకం సేవ లేదు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని పలుచటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో వున్న మహాకాళేశ్వరుడిపై శివనామ స్మరణలు, శంఖారావాలు, ఢమరుక నాదాలు మార్మోగిపోతూండగా భక్తి పారవశ్యంతో గుమ్మరిస్తారు. ఇది రోజూ జరిగే సేవ అని, ఎవరైనా ఏ రుసుమూ లేకుండా భస్మాభిషేకం చేసుకోవచ్చునని ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకటరావు చెప్పారు…’’
ఇక వివరణలోకి వెళ్దాం… ఇదెందుకు ఆకర్షించిందో చెప్పడానికి… ఏ దేవుడినైనా తీసుకొండి, శివుడు డిఫరెంట్… అట్టహాసాలు, ఆడంబరాలు, వైభవోపేత అలంకారాలు పట్టవు… అఘోరాల నుంచి మామూలు అర్చకుల దాకా… ఎవరు ఏ పద్ధతిలో పూజించినా వరమిస్తాడు, కరుణిస్తాడు… అందుకే తను భక్తసులభుడు… లయకారుడు… స్మశానాల్లో తిరిగే భస్మాలంకృతుడు… అందుకే మరణానంతరమూ తనలో ఐక్యం కావాలనే ఓ సగటు శివభక్తుడు కోరుకుంటాడు… శివుడిలో ఐక్యం కావడం ఎలా..?
Ads
గతంలో ఓ పద్ధతి ఉండేదీ అంటారు… ఇప్పుడు లేదు… ఎవరైనా భక్తులు చివరిరోజుల్లో ఉజ్జయినిలోనే ఉండి, అక్కడే మరణిస్తే, వాళ్లు ముందే చెప్పి ఉంటే, నిర్ణీత సొమ్ము చెల్లించి ఉంటే, తెల్లవారుజామున వాళ్ల చితాభస్మంతో శివుడికి హారతి ఇచ్చేవారట… అచ్చంగా శివుడిలో ఐక్యం కావడం…! తరువాత ఇవన్నీ ఆగిపోయాయంటున్నారు మరి… స్మశానాల్లో చితుల నుంచి తెచ్చిన భస్మంతో ఇచ్చే హారతికి గతంలో ఆడవాళ్లను కూడా అనుమతించేవారు కాదు… ఇప్పుడు సంప్రదాయ దుస్తుల్లో అందరినీ అనుమతిస్తున్నారు… కాకపోతే ఆన్‌లైన్‌లో ముందే బుక్ చేసుకోవాలి… పరిమిత సంఖ్యలోనే టికెట్లు ఇస్తారు… ఇదంతా మనం ఆల్‌రెడీ చెప్పుకున్నాం…
అభిషేకాలు, ఈ హారతులతో ఈ జ్యోతిర్లింగ పరిమాణ క్షీణత సంభవిస్తున్నదనే ఆందోళనల నడుమ… పురావస్తు నిపుణులతో ఓ కమిటీ వేసిన సుప్రీంకోర్టు 2017లో కొన్ని ఆంక్షల్ని ప్రకటించింది… దాని ప్రకారం భస్మహారతి సమయంలో లింగాన్ని కొంతమేరకు పొడిబట్టతో కవర్ చేయాలి… అభిషేకమే కాదు, పంచామృతం, పూలు, పత్రికి కూడా పరిమితులు పెట్టారు… గతంలో ఓసారి పూజారికి సమయానికి ఏ శవమూ దొరక్క, సొంత కొడుకునే కాల్చి, ఆ భస్మంతో హారతి ఇచ్చాడనే స్థలపురాణం విస్తుపరుస్తుంది, భస్మహారతి ప్రాధాన్యం, ప్రాశస్త్యం అర్థమవుతుంది… ప్రస్తుతం కొన్ని రోజుల్లో కపిల గోవు పేడను కాల్చగా వచ్చిన భస్మం, శివుడికి ఇష్టమైన మోదుగ, శమీ, రేగు, రేల, రావి, మర్రి కలప కాల్చిన బూడిద కలిపి హారతి ఇస్తున్నారు…
ఉజ్జయిని గుడిలో రకరకాల హారతులు, అర్చనలు ఉంటాయి… ఆ గుడిలో దిగువ అంతస్థులో ఈ భస్మహారతి ఉంటుంది… ఉదయమే 4 గంటల నుంచి మొదలు… అంటే 3.30 వరకే అక్కడికి చేరుకోవాలి… డమరుకాలు, భంభంబోలే నినాదాలు, ఉచ్ఛస్వరంతో నాగసాధువులు ఉచ్చరించే మంత్రాలు, శంఖనాదాలతో ఆ హారతి సమయం ఓ ఆధ్యాత్మిక మత్తులో ఊగిపోతుంది… ఇక వర్తమానానికి వద్దాం… ఏ రుసుమూ లేకుండా రాజమహేంద్రవరం కాలేశ్వరుడి గుడిలో భస్మహారతి ప్రవేశపెట్టడం అందుకే ఆసక్తిని రేకెత్తించింది… అదీ దేహం చాలించిన వారి చితాభస్మంతో ఎవరైనా భస్మాభిషేకం చేసుకోవచ్చుననే వార్త, అదీ గోదావరి ఒడ్డున… అందుకే ఠక్కున కనెక్టయింది..!! కొనసాగుతున్నదా లేదా తెలియదు…!!
Share this Article