తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందన హుందాగా ఉంది… కాకపోతే యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగిన సంఘటన మీద కొద్ది గంటలుగా సాగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టిన తీరు బాగుంది… ఒక్కరోజు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే… సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, సురేఖ, ఉత్తమకుమార్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లారు, బ్రహ్మోత్సవాలు ప్రారంభవేళ… పూజల అనంతరం ఆశీర్వచనాలు తీసుకున్నారు అర్చకుల ద్వారా…
ఐతే అక్కడ డిప్యూటీ సీఎం కింద కూర్చోగా, సీఎం, ఆయన సతీమణి, ఇద్దరు మంత్రులు కుర్చీలపై కూర్చున్నారు… సురేఖ కూడా చిన్న పీటపై కూర్చుని ఉన్నట్టు కనిపించింది… దీనిమీద విపరీతంగా ట్రోలింగ్ సాగింది… భలే దొరికాడు రేవంత్ అన్నట్టుగా బీఆర్ఎస్ క్యాంపు విపరీతంగా విరుచుకుపడింది… ఫోటో చూస్తే నిజంగానే ఓ దళిత ఉపముఖ్యమంత్రికి అవమానం జరిగినట్టుగానే కనిపిస్తూ ఉండటంతో పార్టీలకు అతీతంగా కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి…
నిజంగా అక్కడేమి జరిగిందో ఎవరికీ తెలియదు, కాకపోతే రేవంత్ మీద దళిత వ్యతిరేక ముద్ర వేయడానికి ఇది బాగా ఉపయోగపడింది… ఈ సంఘటన మీద జరిగినంత ట్రోల్ జనంలోకి వేగంగా వెళ్లిపోయింది… ఇప్పుడిక భట్టి ఇచ్చిన స్పష్టీకరణ అంతగా జనంలోకి వెళ్తుందా..? వెళ్లదు..! సో, అసలు నిజానిజాలు ఎలా ఉన్నా, ప్రభుత్వానికి కొంత డ్యామేజీ జరిగిన మాట నిజం…
Ads
భట్టి ఏమంటున్నాడంటే… ‘‘డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నాను… నేనెవరికో తలవంచే వాడిని కాదు… ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కాదు… ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు… నేను కావాలనే యాదాద్రి దేవాలయంలో వేద పండితుల ఆశీర్వచన సమయంలో చిన్న పీట మీద కూర్చున్నాను… ఆ ఫోటోతో కావాలనే ట్రోల్ చేస్తున్నారు… వారందరికీ ధన్యవాదాలు… పాదయాత్రలో భాగంగా నడుచుకుంటూ యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామీ గుట్ట పైకి వెళ్లాను… ఆరోజు మనస్ఫూర్తిగా యాదగిరి లక్ష్మీనరసింహుడిని కోరుకున్న… కావాలనే నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది… ఎందుకంటే, ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తున్నామని కావాలనే కూర్చున్న… ఇది ఎవరు కావాలనే చేసింది కాదు… నేనే కింద కూర్చుండి లక్ష్మి నరసింహ స్వామీ వారి దేవస్థానం వద్ద కింద కూర్చొన్న…’’
ఇక్కడ రెండు అంశాలు… రాజకీయాల్లో చాలా సీనియర్ తను, ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి, టరమ్స్ డిక్టేట్ చేసే స్థాయిలో ఉన్నవాడిని అలా ఎవరైనా ఓ పక్కన కించపరిచినట్టు కూర్చోబెట్టగలరా..? అలా కూర్చొమ్మని చెబితే తను కూర్చుంటాడా..? తనను కించపరుస్తున్నట్టు, అగౌరవ పరుస్తున్నట్టు ఏమాత్రం డౌట్ వచ్చినా తన రియాక్షన్ అక్కడే వేరేలా ఉండేది కదా… BRS campaign కి BSP, CPIM జత కలిశాయి…
మరో విషయం… ఎస్, భట్టి తనంతట తానే ఉద్దేశపూర్వకంగానే కింద కూర్చున్నాడు… వోకే… కానీ రేవంత్, మరో ఇద్దరు మంత్రులు కూడా కుర్చీలను వదిలేసి, తామూ కింద కూర్చుంటే ఇంకా బాగుండేది, అది సరైన స్పందన అయి ఉండేది… మనస్సుల్లో కపటబుద్ధి లేకపోయినా సరే, బయట జనానికి ఎలా కనిపిస్తున్నారనేదీ ప్రధానమే… చివరగా… ఎంతటివారైనా సరే, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, అర్చకులు ఆశీర్వచనం ఇస్తున్నప్పుడు కింద తివాచీ మీద కూర్చోబెడుతుంటారు, పెద్ద పెద్ద గుళ్లల్లో సైతం… వెళ్లినవాళ్లూ దాన్ని పాటిస్తారు… ఇక్కడేమో కుర్చీలు వేశారు, తప్పు… సో, ఈ రచ్చకు కారకుడు దేవస్థానం ఈవో… అనవసర రాచమర్యాదలకు వెళ్లి, అనవసర ప్రచారానికి తావిచ్చింది తనే..!!
Share this Article