- అయప్పునుం కోషియం అనే మలయాళ సినిమా బీమ్లానాయక్‌కు మాతృక… నిడివి ఎక్కువైన, మలయాళీ ప్రేక్షకులకు నచ్చేలా తీయబడిన సినిమా అది… దాంతో బీమ్లానాయక్ సినిమాను పోల్చడం దండుగ… తెలుగులో రీమేక్ చేశాక, తెలుగు ప్రేక్షకుడి కోణం నుంచే చూడాలి… రీమేక్ అన్నంతమాత్రాన ఒరిజినల్‌లాగే ఉండాలా..? అలా ఉండాలనుకుంటే డబ్బింగ్ చేస్తే సరిపోతుంది కదా, రీమేక్ దేనికి..?
- మలయాళ ఒరిజినల్ నటులు వేరు… కానీ తెలుగులోకి వచ్చేసరికి కచ్చితంగా ఇక్కడి మార్కెట్ అవసరాల మేరకు మార్పులు అవసరం… ప్రత్యేకించి పవన్ కల్యాణ్ ఇమేజీకి అనుగుణంగా మార్పులు మరీ తప్పనిసరి… త్రివిక్రమ్ (దర్శకుడు ఎవరైనా సరే, త్రివిక్రమే అన్నీ…) సో, ఓ స్ట్రెయిట్ సినిమాలాగే చూసి విశ్లేషించుకోవాలి… ఎందుకంటే..? ఒరిజినల్‌కు దీనికీ తేడా ఏమిటో పరిశీలించడానికి సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లడు…
- ఈ సినిమా ప్రధానంగా రెండు బలమైన శక్తుల నడుమ ఇగోక్లాష్… ఎవరికి ఎవరూ తక్కువ కాని అహాల నడుమ పోరాటం… అఫ్‌కోర్స్, ఒకరికి అధికారం అనే అదనపు బలం… మరొకరికి అహమే బలం… ఇక్కడ నచ్చిందేమిటీ అంటే… రానా పేరుకు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రే అయినా సరే, పవన్ కల్యాణ్ ఇగోకు పోకుండా రానాకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం… పలుసార్లు రానాయే హీరో అన్నంత ప్రాధాన్యం… గుడ్…
- బాహుబలిలో మనం చూసింది అదే… ప్రభాస్‌కు దీటుగా రానా కనిపిస్తాడు… పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ వదిలేయండి… కథానుసారం ఏదొస్తే అది… కానీ రానాను తక్కువగా చూడలేం… సేమ్, బీమ్లానాయక్ సినిమాలోనూ అంతే… రానా తన ‘‘ఇగో’’తో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు…
- నిత్యామేనన్… ప్రతిభ కలిగిన నటి… కానీ ఈమధ్య అవకాశాల్లేవ్… బరువు సమస్య… ఒరిజినల్‌లో ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం అనిపించదు… కానీ ఈ రీమేక్‌లో ఆమే స్క్రీన్ స్పేస్ పెంచారు… అఫ్‌కోర్స్, ఓమేరకు సంయుక్త మేనన్ పాత్రకు కూడా… మామూలుగా తెలుగు సినిమా, అందులోనూ పవన్ సినిమా అనగానే తను తప్ప ఇంకొకరు కనిపించకూడదు కదా… కానీ ఈ సినిమాలో రానాకు, నిత్యకు మంచి ప్రాధాన్యమే దక్కింది…
- ఈమధ్య కొంతకాలంగా రానాకు మంచి సినిమా ఏమీ పడలేదు… బాహుబలిలో ప్రభాస్‌కు దీటుగా నిలబడినా సరే, తరువాత ప్రభాస్ తన పాన్ ఇండియా సినిమాలతో, కొత్త ప్రాజెక్టులతో ఎక్కడికో వెళ్లిపోయాడు… కానీ రానా అరణ్య వంటి సినిమాలతో ఇంకాస్త తగ్గిపోయాడు… ఈ స్థితిలో ఓ పాపులర్ స్టార్ హీరో సినిమాలో సెకండ్ లీడ్ పోషించడానికి అంగీకరించడం రానా విశిష్టత… కానీ తనకు కలిసొచ్చింది… దీటుగా కనిపించాడు… రానా కోణంలో బీమ్లానాయక్ మళ్లీ ఓ లైఫ్…
Ads
- ఎస్… పాటలు బాగాలేవ్… కామెడీ రిలీఫ్ లేదు… ఎమోషన్ కంటెంట్ లేదు… అసలు తెలుగు జనానికి సంబంధం లేని మద్యనిషేధం, వాహనంలో బాటిల్స్ దొరకడం బాపతు సీన్ చిరాకెత్తిస్తుంది… ఎంతసేపూ రెండు పాత్రల అహపు డైలాగులు, ప్రవర్తన, యాక్షన్, డిష్యూం, డిష్యూం… ఐతేనేం… పవన్ కల్యాణ్ ఇమేజీతో దాన్ని అధిగమించాడు…
- ఇక సినిమా అంటారా..? థాంక్ గాడ్, పోలీస్ డ్రెస్ అనగానే పవన్ మీద ఓ డౌట్… కానీ ఆ సర్దార్ గబ్బర్‌సింగ్ తాలూకు చేదును చూపించలేదు… డైలాగులు, స్క్రీన్-ప్లే సహా అనేక అంశాల్లో చెయ్యి, కాలు చేసుకున్న త్రివిక్రమ్‌కు ఈసారి పవన్ చెంపదెబ్బ తప్పినట్టే…
- మరి సినిమా సంగతి..? ఏముంది..? పవన్ కల్యాణ్ అంటేనే ఓరకమైన ప్రత్యర్థితనంతో జగన్ ప్రభుత్వం వ్యవహరించింది… పవన్‌ను లైట్ తీసుకోవాల్సింది పోయి, ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి తనను హీరోను చేసింది… చిరంజీవి తదితరులందరూ జగన్ ఎదుట మోకరిల్లినవేళ పవన్ ఒక్కడే నిలబడి సవాల్ చేశాడు… అందుకని ఈ సినిమా విజయం పట్ల చర్చ…
- అందుకే తెలుగు సొసైటీలో ఈ సినిమా ఫట్టా, హిట్టా అనే చర్చ… అఫ్‌కోర్స్, తెలంగాణలో ఎన్ని షోలైనా వేసుకొండి, ఏ రేట్లయినా వసూలు చేసుకొండి… ఫుల్లు ఫ్రీడం… ఏపీలో మాత్రం మస్తు ఆంక్షలు… అందుకే యాంటీ-జగన్ సెక్షన్లన్నీ ఈ సినిమా హిట్ కావాలని కోరుకున్నయ్…
- అసలే పవన్ కల్యాణ్, ఆపై ఫుల్ యాక్షన్, పైగా దీటుగా రానా… రానా బాపతు దగ్గుబాటి సురేష్ కూడా ప్రస్తుతం జగన్ ఎదుట మోకరిల్లలేదు కదా, అందుకే ఇంత ఆసక్తి… ఏపీలో వసూళ్లు అలా పెట్టేస్తే… సినిమా మరీ తీసికట్టు బాపతేమీ కాదు… ఓ టిపికల్ సౌతిండియన్ కమర్షియల్ సినిమా… ఇంతకుమించి చెప్పడానికి ఏమీలేదు…!!
- చాలామందికి నచ్చకపోవచ్చు కూడా..!! పవన్ కల్యాణ్ కూడా ఏమీ మారడు… సేమ్, ఫ్యాన్స్ అంటే అనురక్తి… తనను ఎంతకు కిందకు లాగేసినా, కిందే ఉంచేసినా… రాజకీయంగానైనా… సినిమా హీరోగానైనా… పవన్ మారలేడు… ఇక తను అంతే…!!
- పవన్ ఇలాంటి పాత్రలకే సూటవుతాడు… రానా దీటుగా నిలబడ్డాడు… నిత్యామేనన్ గురించి చెప్పడానికేముంది..? జగమెరిగిన నటి… సంయుక్త కాస్త ఇంట్రస్టింగ్, తెలుగు నిర్మాతలకు మరో హీరోయిన్ దొరికినట్టే… థమన్ మళ్లీ వేస్ట్… దీనికి త్రివిక్రమ్ దర్శకుడు కాదట, వేరే దర్శకుడు ఉన్నాడని టైటిల్స్ లో కనిపించింది, అది మరీ ఇంట్రస్టింగ్…!!
Share this Article