.
అందరి ఇళ్ల ముందు భోగి మంటల బూడిద కనిపిస్తోంది… మీ ఇంటి ముందు ఆ ఛాయలే లేవు, కాకపోతే ముగ్గులు కనిపిస్తున్నాయి… చిన్న చిన్న గొబ్బెమ్మలు కనిపిస్తున్నాయి అంతే… ఇదేంటమ్మా…
అవునే… భోగి మంటలు మాకు వొంతెన లేదులే… తెలంగాణ జనానికి నిజానికి సంక్రాంతికన్నా దసరాయే పెద్దపండుగ… ఈ భోగి మంటలు అంటే ఇంట్లో పాత సామాను తెచ్చి వాకిట్లో పెట్టి కాల్చేస్తారట కదా, పక్కింటి ఆంటీ చెప్పింది…
Ads
అవునమ్మా… మన వాడలో తెలంగాణ వాళ్లు కూడా భోగి మంటలు వేశారు కదమ్మా, మీకే కల్చర్ తెలియదు అని బదనాం చేస్తారు మరి…
పర్లేదు లేవే… ఎవరి కల్చర్ వాళ్లది… మేం ముగ్గులు వేసుకుంటాం, పిల్లలుంటే బోడపళ్లు అంటే భోగిపళ్లు పోస్తాం… చలి కదా, కొందరు చలిమంటలు వేసుకుంటారు… అంతే…
అబ్బా, ఊర్కోండి మేడమ్… ఏ కల్చర్ అయితేనేం, తోటి ఆంధ్రా కల్చరే కదా, అదీ జరుపుకుంటే ఆనందమే కదా… పండుగ అంటేనే ఉత్సవం, ఉత్సాహం కదా…
అవునులే… మేం సంక్రాంతి రోజున నవధాన్యాలు, గొబ్బెమ్మల నడుమ పిడకలతో మంట వేసి, గురిగిలో పాలు పొంగిస్తాం, చేతనైన పిండివంటలు… అంతే… నోములు సరేసరి… కనుమ మాత్రం రైతు కుటుంబాలు బాగానే జరుపుకుంటాయి…
అవునమ్మా, మీ పెళ్లిళ్లలో మెహందీ, మంగళస్నానాలు, సంగీత్ ఎవరివి..? మార్వాడోళ్లవి కావా… మరి మీరెందుకు అలవాటు చేసుకున్నారు… భోగిని కూడా అలాగే మీ కల్చర్‌లో కలుపుకోవాలి…
వామ్మో, నీ లాజిక్ తెల్లారిపోను… బాగుందే… మావోళ్లకు బుద్దిలేక, కల్చర్ బలిసి… పైత్యం ఎక్కువై… డబ్బు, తమ స్టేటస్ ప్రదర్శనకు ఆడంబరంగా, అట్టహాసంగా ఈ సంగీత్‌లు, ఈ మెహందీలు మన్నూమశానం పెట్టుకుంటారు… పైగా అదొక ఘనత… నిజమే, నువ్వు చెప్పింది… కల్చర్ అంటే అది అనేక నదీనదాల సంగమం… ఏదీ స్థిరం కాదు… కానీ నువ్వు చెప్పవే ఒకటి…
ఏమిటమ్మా.,.
ఎవరికి వాళ్లు వాళ్ల కల్చర్‌ను రుద్దుతున్నారు, మావాళ్లు పిచ్చిమేళం కదా, అలవాటు చేసుకుని అదొక ఘనతగా ఆనందిస్తారు… ఒక్కరు, కనీసం ఒక్క కుటుంబం చూపించవే నాకు… బోనం ఎత్తిన తెలంగాణేతర కుటుంబాన్ని… బతుకమ్మ ఆడిన ఒక్క కుటుంబాన్ని… మా కల్చర్ ఎవడికీ అక్కర్లేదు, కానీ అందరివీ మేం మోయాలి… అంతేనా..? మొన్న సద్దుల బతుకమ్మ రోజున కూడా ఒక్కరైనా మన వాడలో మర్యాదకైనా ఆడటానికి వచ్చారా..? బొడ్డెమ్మ జాడ చూశామా…?
నా దగ్గర జవాబు లేదమ్మా…
అదే నేను చెప్పేది… మాకు సంక్రాంతి అంటే అప్పాలు, సకినాలు… పల్లీలు, నువ్వులు, పుట్నాలు, పేలాల ముద్దలు… ఆడపిల్లల నోములు… వాయినాలు… పాలు పొంగించడాలు… వీళ్లంతా సంక్రాంతి అనగానే బారులు తీరి సొంతిళ్లకు తరలిపోతుంటారు కదా… మాకు ఈ కోడిపందేలు గట్రా ఉండవ్… కానీ ఇక్కడే దశాబ్దాలుగా బతుకుతూ, ఒక్కరైనా తెలంగాణ కల్చర్‌లో మేమేకం అయ్యారా చూపించవే… బీ రోమన్ ఇన్ రోమ్ అంటారు కదా… ఏదీ ఎక్కడుందే..? బతుకమ్మ వద్దు, దేవీ నవరాత్రులు అంటారు… మేం ఈరోజుకూ కల్చరల్ అస్పృశ్యులమే వీళ్లకు… మా భాష, మా యాస, మా కల్చర్ అన్నీ ఎవరికి పట్టాయో చెప్పు…
అమ్మా… నా దగ్గర సమాధానం లేదు… అసలు ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలమ్మా అవి..!
మాకు అందరూ కావాలి… అందరి కల్చరూ మాది కావాలి… ఎటొచ్చీ మేమే ఎవరికీ అక్కరలేదు… మా కల్చర్ కూడా ఎవరికీ అక్కరలేదు… మా భూమి అందరిదీ కావాలి, మేమే అందరికీ పరాయివాళ్లం కావాలి…
అమ్మా, నేను పోయొస్తా…
Share this Article