.
Subramanyam Dogiparthi ….. 41 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడ్డ వెంకటేష్ సినిమా . బహుశా వెంకటేష్ కెరీర్లో ఇన్ని కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడిన సినిమా కూడా ఇదేనేమో !? ఇంకా ఉన్నాయా !?
అతనికి ఉత్తమ నటుడుగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది . మా నరసరావుపేట కూడా వంద రోజుల లిస్టులో ఉంది . తమిళంలో సక్సెస్ అయిన మైఖేల్ రాజా సినిమాకు రీమేక్ మన బ్రహ్మపుత్రుడు సినిమా . తమిళంలో రఘువరన్ , శరత్ బాబు , బేబీ షాలిని తదితరులు నటించారు .
Ads
బ్రహ్మ పదార్థం అనే మాట వింటూ ఉంటాం . అర్థం కానిదానిని బ్రహ్మ పదార్థం అంటాం . అలాగే బ్రహ్మపుత్రుడు అంటే ఎవరికి పుట్టారో తెలియకపోతే బ్రహ్మపుత్రుడు అని అర్థం అట (?). ఈ సినిమా ఒక బ్రహ్మపుత్రుడు , ఒక బ్రహ్మపుత్రికల కధ . పుత్రుడుగా వెంకటేష్ , పుత్రికగా బేబీ షాలిని నటించారు .
వెంకటేష్ సినిమాలను ఎంపిక చేసుకోవటంలో కానీ తాను నటించే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు . తండ్రి రామానాయుడు ఎలా calculated గా ఉంటారో వెంకటేష్ కూడా నటుడుగా అంత calculated . ఈ సినిమాలో బాగా నటించారు . మొదటి తాంబూలం ఆయనకే .
ఆ తర్వాత బేబీ షాలినికే . తమిళంలో కూడా ఆ పాపే నటించింది . పెద్ద ఆరిందాలాగా నటించింది . బ్రహ్మపుత్రుడు తండ్రిగా నూతన్ ప్రసాద్ , తల్లిగా శ్రీవిద్య నటించారు . బ్రహ్మపుత్రిక తల్లిగా జయసుధ , తండ్రిగా మోహన్ బాబు నటించారు . జయసుధ జర్నలిస్టుగా గతం మరచిపోయిన పిచ్చిదానిగా , మోసపోయిన మగువగా శ్రీవిద్య బాగా నటించారు .
ఇంక విలనాసురులు . నూతన్ ప్రసాద్ , మోహన్ బాబులు ఇద్దరూ అదరగొట్టేసారు . ఈ ఇద్దరి ప్రత్యర్ధుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది . మోహన్ బాబుకు నమ్మినబంటుగా వెంకటేష్ అతన్ని రక్షిస్తూ ఉంటాడు .
ఇతర ప్రధాన పాత్రల్లో రజని , ప్రభ , వయ్యారాల వై విజయ , జయప్రకాష్ రెడ్డి , జయమాలిని , సుత్తి వేలు , నాగేష్ , అల్లు రామలింగయ్య , మాడా , రాధాకుమారి , ఆర్జా జనార్ధనరావు ప్రభృతులు నటించారు . Of course . సెంటిమెంట్ ప్రకారం నిర్మాత రామానాయుడు డాక్టరుగా ఓచోట తళుక్కుమంటారు .
బ్రహ్మపుత్రుడు , బ్రహ్మపుత్రిక ఇద్దరూ తమ తమ తండ్రుల అన్వేషణలో ఒకరికి ఒకరు దగ్గర అవుతారు . బ్రహ్మపుత్రుడు బ్రహ్మపుత్రికను నానా కష్టాలు పడి తన బాస్ మోహన్ బాబు దగ్గరకు చేర్చటంలో సఫలీకృతుడు అవుతాడు సినిమా చివరకు . బుధ్ధి తెచ్చుకోని తన తండ్రిని చంపేసి చట్టానికి లొంగిపోతాడు బ్రహ్మపుత్రుడు .
ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం కధ , స్క్రీన్ ప్లేలే . కధ గుహనాధనుది అయితే బిర్రయిన స్క్రీన్ ప్లే ఘనత దాసరి వారిదే . సినిమా ఎక్కడా స్లో కాకుండా దడదడా సాగిపోతూ ఉంటుంది . ఈ సినిమాకు డైలాగులు గుండె కాయ లాంటివి . దాసరి వారు ఆ డైలాగులను కూడా బ్రహ్మాండంగా వ్రాసారు .

మోహన్ బాబుకు డైలాగుల రచయితలు ఏదో ఒక ఊతపదం పెడుతుంటారు . ఈ సినిమాలో ఆ పదం రన్నింగ్ కామెంట్రీ . ఈ సినిమాలో జయమాలిని ఐటమ్ గర్ల్ కాదు . లేడీ కానిస్టేబుల్ . సుత్తి వేలు , జయమాలిని మధ్య ప్రేమనగర్ సినిమా లోని ఒక సీనుని రీమిక్స్ చేసిపెట్టారు కూడా .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి , దాసరి పాటలను బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజ పాడారు . అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా నీకు నాకు తోడున్నది కన్నీళ్ళేనమ్మా అనే పాట శ్రావ్యంగా ఉంటుంది . మిగిలిన నాలుగూ వెంకటేషువే . మూడు డ్యూయెట్లు , ఒక క్లబ్ మాస్ మసాలా పాట .
అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ కుర్రాడి వేగం గుంటూరు కారం , అమ్మాయి , సన్నజాజి చెట్టు కింద అంటూ సాగుతాయి డ్యూయెట్లు . నీయబ్బ నువ్వాడుతుంటే అంటూ గెంతులు వేస్తాడు వెంకటేష్ ఈ క్లబ్ మసాలా పాటలో .
1988 జులైలో వచ్చిన ఈ హిట్ సినిమా యూట్యూబులో ఉంది . Highly emotional movie . దాసరి వారి సినిమాల్లో నాటకీయత , ఎమోషన్స్ దిట్టంగా ఉంటాయి కదా ! ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడతగ్గ సినిమాయే . వాచ్ లిస్టులో వేసుకోండి .
నేను పరిచయం చేస్తున్న 1198 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
- ఇక్కడ చిన్న క్లారిటీ…. బ్రహ్మ పుత్రుడు అంటే స్వాయంభువ మనువు (Swayambhuva Manu)… బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండు భాగాలుగా విభజించుకున్నప్పుడు, ఒక భాగం పురుషుడుగా (మనువు), మరొక భాగం స్త్రీగా (శతరూప/సరస్వతి) ఆవిర్భవించారు…
- వీరిద్దరి కలయిక వల్ల జన్మించినవాడే స్వాయంభువ మనువు… ఈయననే భూమిపై మొట్టమొదటి మానవుడిగా భావిస్తారు… వీరి నుంచే మానవ జాతి (మనుష్యులు) ఉద్భవించింది…. కానీ దర్శకుడు దాసరి కదా, తను ప్రతి పదానికీ ఎన్ని అర్థాలు, నిర్వచనాలు, బాష్యాలైనా చెప్పగలిగేవాడు…. ముచ్చట
Share this Article