- గుడ్డిలో మెల్ల అంటే… భుజ్ అనే సినిమా కేవలం 110 నిమిషాలే ఉండటం… ఒక రిలీఫ్ అనిపిస్తుంది…
- ఖర్మఫలం ఏమిటంటే… ఆ 110 నిమిషాలూ భరించాల్సి రావడం… అదొక శిక్ష అనిపిస్తుంది…
- సలహా ఏమిస్తానంటే… అంత టైమ్, ఓపిక ఉన్నా సరే, అవాయిడ్ వాచింగ్… బెటర్…
- సింపుల్‌గా చెప్పాలంటే… ఒక దేశభక్తి, ఒక యుద్ధ నేపథ్యం కథను ఇంతగా భ్రష్టుపట్టించిన సినిమా మరొకటి లేదు…
- నిజానికి ఈమధ్య కాలంలో యుద్ధవీరుల బయోపిక్స్ గానీ, వాస్తవ సంఘటనలపై తీసిన సినిమాలు గానీ ట్రెండింగ్… అజయ్ దేవగణ్ మాత్రమే కాదు, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం… అంతెందుకు..? తాజాగా షేర్ షా పేరిట సిద్ధార్థ మల్హోత్రా కూడా ఆ జాబితాలో చేరాడు… మరీ అజయ్ దేవగణ్ తను నిర్మాతగా ఉండీ, ఏ దశలోనూ సినిమా ఇంత నాసిరకంగా తయారవుతోందని గుర్తించకపోవడం విచిత్రం… అసలు దర్శకుడి ఎంపిక దగ్గరే తప్పులో కాలేసినట్టు గమనించకపోవడం కూడా విచిత్రమే…
అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్… ఇంకేం కావాలి..? అలాగే సరిగ్గా తీయగలిగితే మంచి ఉత్తేజపూరిత సినిమా కాగలిగిన కథాంశం…. ఇంకేం కావాలి..? దర్శకుడు కూడా అదే అనుకున్నట్టున్నాడు… ఇంకేం కావాలి, రీళ్లు చుట్టేసుకుంటూ పోయాడు… వెరసి సినిమా చివరకు ఎలా తయారైందంటే..? పాకిస్థానీ బాంబర్లు ధ్వంసం చేసిన భుజ్ ఎయిర్‌స్ట్రిప్‌లాగా…!! సాధారణంగా యుద్ధనేపథ్యం ఉన్న సినిమాల్లో ఏదో ఒక ఎమోషన్ ప్రేక్షకుడిని కనెక్ట్ అవుతుంది… త్యాగాలు, సాహసాలు, దేశభక్తి, పోరాటాలు… ఏదో ఒకటి… కానీ ఈ సినిమాలో ఏదీ ప్రేక్షకుడిని కనెక్ట్ కాదు… ఓవరాక్షన్, సినిమాటిక్ ఓవర్ డ్రామా, నాసిరకం గ్రాఫిక్స్, భారీ నినాదాలు, తలాతోకాలేని కథనం… ఎడిటింగ్, సంగీతం, నటన దగ్గర్నుంచి ప్రతిదీ అలాగే… వందల టీవీ ఎపిసోడ్లు తీసిన అభిషేక్ ఓ మంచి అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకున్నాడు…
Ads
నిజానికి ఈ భుజ్ అసలు స్టోరీ తెలుసా..? 1971… బంగ్లాదేశ్ విముక్తి పోరాటం… పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పూనుకుంది… ఫైటర్ విమానాలు భుజ్ ఎయిర్ స్ట్రిప్ మీద బాంబింగ్ చేస్తుంటాయి… అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలకు సరిహద్దులో కీలకమైన ఎయిర్ స్ట్రిప్… దాదాపు 14 బాంబులతో అది ధ్వంసం అయిపోతుంది… విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు వీల్లేని పరిస్థితి… దాన్ని అప్పటికప్పుడు రిపేర్ చేయడానికి బీఎస్ఎఫ్ విభాగానికి కూలీలు సరిపడా లేరు… ఈ స్థితిలో ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఆఫీసర్ విజయ్ కుమార్ కార్ణిక్ ఆ పరిసరాల్లో ఉండే మాదాపూర్ నుంచి గ్రామస్థులను సమీకరిస్తాడు… అందులో దాదాపు 300 మంది మహిళలు… వరుసగా దాడులకు వస్తున్న పాకిస్థానీ విమానాల బాంబింగ్ నుంచి తప్పించుకుంటూ, వాళ్లలో ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ… ఓ పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో 72 గంటల్లో ఎయిర్ స్ట్రిప్ రిపేర్ చేయిస్తాడు… ఆకుపచ్చ చీరెలు కట్టించి, అలారమ్ మోగగానే సమీపంలోని పొదల్లో తలదాచుకుంటూ, పెద్దగా అలికిడి లేకుండా… ఆ మహిళలు కూడా ‘యుద్ధనైపుణ్యం’ చూపిస్తారు… ఇదీ కథ…
సినిమా ఆ మహిళల వర్క్‌ను, నిర్భీతిని ఎక్స్‌పోజ్ చేయలేదు సరికదా కథలోకి ఓ లేడీ ఇండియన్ స్పై, సరిహద్దుల్లో తిరిగే రా ఆఫీసర్, కార్ణిక్ భార్య పాత్ర ఎట్సెట్రా జొరబడ్డాయి… ఈ యుద్ధదృశ్యాలు, భీకరమైన పోరాటాలు, ప్రసంగాలు, అరుపులు, కేకలు, నినాదాలతో అసలు మహిళల కథ మరుగునపడిపోయింది… మాదాపూర్ మహిళల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజితులను చేసే సుందర్ బెన్ అనే గ్రామీణ యువతి పాత్రలో సోనాక్షి సిన్హా… ఒంటి చేత్తో చిరుతను చంపేయగల ఈ యువతి ఆ మహిళల్ని లీడ్ చేస్తుంటుంది… నిజానికి బాంబింగ్‌కు వెరవకుండా ‘మేము సైతం’ అంటూ ఒక్కో మహిళ ధైర్యాన్ని కూడదీసుకుని, ఓ పెద్ద సమూహంగా ఓ సీక్రెట్ ఆపరేషన్ పూర్తిచేయడానికే కథపైనే ఫోకస్ అధికంగా ఉంటే, ఖచ్చితంగా సినిమా క్లిక్ అయి ఉండేది… ప్చ్, మొత్తానికి ఓ మంచి కథను ధ్వంసం చేశారు ఇలా…! రిపేర్ చేయడానికి, మళ్లీ ఇంకెవరో అటెంప్ట్ చేయడానికి కూడా వీలు లేకుండా…!!
Share this Article