“అయినా అవినీతి యేడ లేదు తమ్మీ, పైసలు ఇస్తే పొగిడేటి పత్రికలు లేవా..? మన కులపోడే కదా అని ఇడిచేసే ఎడిటర్లు లేరా..? ఇష్టమైతే లీడర్ ని, లేకపోతే జోకర్ ని చేసే పత్రికా ఓనర్లు లేరా..?”
ఇది 1998 లో విడుదల అయిన గణేష్ మూవీలో ఒక డైలాగ్. ఒక్క తెలుగు రాష్ట్రాలలో మాత్రమే మీడియా రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తూ చెలరేగిపోతున్నది నేను అనటం లేదు. ప్రపంచం అంతటా ఇలానే ఉంది, ఇదే పరిస్థితి అమెరికా, యూరప్ వంటి ప్రస్తుత శక్తివంతమైన దేశాల్లో కూడా కనిపిస్తుంది. “అమెరికా మీడియా కంటే రోడ్డు పక్కన ఉండే వ్యభిచారులు చాలా బెటర్” అనేది ఒక అభిప్రాయం.
నిజానికి వచ్చే నెలలో జరగబోయే అమెరికా ఎన్నికల్లో ప్రస్తుత వాస్తవ పరిస్తితులని బట్టి కొంత మొగ్గు రిపబ్లికన్ పార్టీ డోనాల్డ్ ట్రంప్ వైపే ఉంది. కానీ అమెరికా మీడియా దాదాపుగా అంతా డెమోక్రాటిక్ పార్టీకి కొమ్ము కాస్తున్నై. అందుకే అన్ని సర్వేల్లో కమలా హారిస్ గెలుస్తుంది అని చెప్తున్నారు.
Ads
అమెరికాలో ఉన్న మీడియా అంతా కమలా హారిస్ కే సపోర్ట్ చేస్తూ ఆమెనే గెలుస్తుంది అని విపరీత ప్రచారం చేస్తున్నారు. ఈ విధమైన మీడియా ప్రవర్తన ప్రజల అభిప్రాయాలను మార్చి, ఒకటే కోణం నుండి వారిని చూడడానికి బలవంతం చేస్తుంది. ఏ మీడియా సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే, అది తన కథనాలను ఆ దిశలో మలచి చూపిస్తుంది.
న్యూయార్క్ నుంచి వెలువడే ప్రపంచంలోనే నంబర్ వన్ పత్రిక “న్యూయార్క్ టైంస్” పత్రిక పూర్తిగా సిగ్గు విడిచి అధికారికంగా, బహిరంగంగా మేము డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్ ని ఎండోర్స్ చేస్తున్నం అని ఎడిటర్లు మొన్న ప్రకటించారు. నాకు తెలిసినంత వరకు అమెరికన్ మీడియాకి సిగ్గు, శరం, మానం, మర్యాద లాంటివి ఇసుమంత కూడా ఉండవు.
అమెరికా ఎన్నికల సమయంలో, ప్రజల అవగాహనను మార్చడానికి మీడియా కీలక పాత్ర పోషిస్తోందని అనిపిస్తుంది. ప్రజల ముందు ఉండే మీడియా, న్యూస్ ఎడిటర్లు, ఛానెల్ ఓనర్లు… ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో వారు పుట్టించే కథలు కూడా ఆ దిశలోనే ఉంటాయి. ఎవరు ఎక్కువ డబ్బు ఇచ్చినా, వాళ్ళకి అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడం, మీడియా సంస్థలు వాటి స్వంత అజెండాలను అమలు చేయడం పెద్ద సమస్యగా మారింది. ప్రతి విషయంలోనూ తమకిష్టమైన వ్యక్తిని “లీడర్” గా చూపడం, లేదా ఇష్టంలేని వ్యక్తిని “జోకర్” గా చూపించడంలో కూడా కొందరు మీడియా సంస్థలు తక్కువ కాకుండా పోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నిజమైన, నిష్పక్షపాతమైన సమాచారాన్ని అందించాలన్నది అనివార్యంగా మారింది. మీడియా స్వేచ్ఛ పేరుతో, ప్రజల ఆలోచనా విధానాలను ప్రభావితం చేయడం కాదు, వారిని సంపూర్ణ సత్యానికి దారితీసే మార్గం చూపడమే అసలు ధ్యేయం కావాలి.
మీడియా నిజాయితీగా వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలబడగలవు. లేకుంటే, ప్రజలు ఎప్పుడూ ఒక వైపు చూసి, మరొక వైపు చూపించే అబద్దాలను నమ్మేస్తూ ఉంటారు.
ప్రజల అవగాహనను మార్చడానికి, వారి ఆలోచనా విధానాలను ప్రభావితం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు ఒక పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి.
ఈ ప్రభావం కేవలం ప్రజల అభిప్రాయాలను మారుస్తూ ఉండదు, ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఒక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఉన్న మీడియాను ఉపయోగించుకుని ప్రజలకి ఒక ప్రత్యేక దృక్పథం మాత్రమే చూపిస్తూ ఉంటాయి. దీనివల్ల ప్రజలు పూర్తి సత్యాన్ని తెలుసుకోలేరు, విభజనలకు గురవుతారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
ఏమైనా, ప్రజల అభిప్రాయాలు రాజకీయంగా వేరువేరుగా ఉండటం, లేదా విమర్శించుకోవటం మరింత విభజనకి దారితీస్తుంది అనేది నిజం. మున్ముందు ఇటువంటి పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని అనిపిస్తోంది. మీడియా ఆజెండాలు, వ్యక్తిగత పక్షపాతాలు ప్రజల మధ్య విభజనను మరింతగా పెంచవచ్చు.
అమెరికా ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. నిజంగా గెలుపు మీడియా ప్రోద్బలంతో జరుగుతుందా, లేక వాస్తవ పరిస్థితులు గెలుస్తాయా అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ మీడియా కథనాలు ప్రజల ఆలోచనా విధానాలను పూర్తిగా ప్రభావితం చేస్తే, అప్పుడు ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తి క్షీణించిపోయే అవకాశం ఉంది. కానీ, వాస్తవ పరిస్థితులు గెలిస్తే, ప్రజలు స్వతంత్రంగా ఆలోచించి, తమ ఓట్ల ద్వారా నిజాయితీకి అంగీకారం తెలుపుతారు.
ఈ ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల గెలుపు/ ఓటమి మాత్రమే కాదు, మీడియా యొక్క శక్తి మరియు ప్రజల అవగాహనల మీద దీని ప్రభావం ఎలా ఉందో కూడా స్పష్టమవుతుంది. ప్రజలు గెలుస్తారో, మీడియా గెలుస్తుందో చూడాలి….. (జగన్నాథ్ గౌడ్)
Share this Article