కేవలం యాంకర్ల పేరుతో షోలు, హీరోలతో సినిమాలు నడవవు… పెద్ద పెద్ద హీరోల సినిమాలు మొదటి ఆటకే తన్నేసిన ఉదాహరణలు బోలెడు… వంట కుదరాలి… అప్పుడు హిట్టో ఫ్లాపో తేలేది… మా అభిమాన హీరో ఉన్నాడు కదాని ‘ఉప్పూకారం లేని బిర్యానీ’ ఎవడూ తినడు… టీవీ షోలు కూడా అంతే… షోలో దమ్ముండాలి… అంతే తప్ప, మా అభిమాన సుమ చేస్తున్నది కాబట్టి బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అనే షో చూస్తాం, మా అభిమాన ప్రదీప్ చేస్తున్నాడు కాబట్టి జీలో సరిగమప చూస్తాం అనేదేమీ ఉండదు… నిజానికి రెండూ పెద్ద ఫ్లాపులు, జీవాడి మొహం పగిలిపోయింది… అంతెందుకు..? ఇదే బిగ్ సెలబ్రిటీ చాలెంజ్… 17వ తేదీ, ఆదివారం, రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రసారం అయిన షోలో ముఖ్య అతిథులు తెలుసా..? సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ సీను… యాంకర్లు సుమ, రవి… తారాగణాన్ని చూస్తే షో వీర సక్సెస్ అయి ఉండాలి కదా… దానికొచ్చిన రేటింగు ఎంతో తెలుసా..? కేవలం రెండు… ఏ హైదరాబాద్ మార్కెట్లో జీతెలుగు మాటీవీని కూడా దాటేసి దుమ్మురేపుతున్నాదో, అదే హైదరాబాద్ మార్కెట్లో ఈ షోకు వచ్చిన రేటింగ్స్ జస్ట్ టు… అదీ దాని ఫ్లాప్ కేటగిరీ… అట్టర్ ఫ్లాప్…
అదే రోజు 8 గంటలకు వచ్చిన సరిగమప ప్రోగ్రామ్ దక్కించుకున్న రేటింగ్స్ కూడా ఘోరమే… జస్ట్, 2.93 మాత్రమే… పైగా ఆరోజు సెమీ ఫైనల్స్… అంటే ఈ రెండు ప్రోగ్రాములూ ఓ నాసిరకం పాత సీరియల్ సాధించినన్ని రేటింగ్స్ కూడా ఎందుకు దక్కించుకోలేదు..? పైగా సుమ… మరోదానికి ప్రదీప్… ఆ సరిగమప షోకయితే బొచ్చెడు మంది మెంటార్లు, జడ్జిలు… తుస్… అదే షో అదే రోజు రాత్రి 10 గంటలకు రిపీట్ చేస్తే 0.9 రేటింగ్స్… అంటే దేకినోడు దాదాపు లేడన్నమాట… నిజానికి మనం ముందే చెప్పుకున్నాం కదా… సుమ ఎవరితో కలిసి యాంకరింగ్ చేసినా ఆమెకు అచ్చుబాటు కాదు… అంటే, వర్కవుట్ కాదు… గతంలో పెళ్లిచూపులు అని ప్రదీప్తో కలిసి చేసిన షోతో చేతులు, మూతులు కాలాయి… ఇప్పుడు రవి కో-యాంకర్… ఈ భీకర స్టంట్లు, బీభత్స ఫీట్లు సుమకు సూట్ కావు… అందుకే తన పరిచయాలన్నీ ఉపయోగిస్తూ పెద్ద పెద్ద యాంకర్లను తెస్తున్నా సరే, ఆ షో లేవడం లేదు సరికదా దారుణంగా పడిపోతోంది…
Ads
ఒక షోకు యాంకరింగ్ చేసి, వదిలేయడం వేరు… ఆ పని ప్రదీప్ చేస్తాడు… డబ్బు తీసుకున్నామా, యాంకరింగు చేశామా, అంతే… సుమ మరి ఏం ఒప్పందాలు చేసుకుని, ఎంత చార్జ్ చేస్తుందో తెలియదు గానీ… సెలబ్రిటీలను తెచ్చుకునే బాధ్యతనూ మోస్తున్నట్టుంది… ఈ షో పడిపోతోంది కదా… ఇలాంటప్పుడు ఆమెకు భర్త రాజీవ్ కనకాల గుర్తొస్తాడు… తనను పిలుచుకొచ్చి ఓ ఎమోషన్ తీసుకొస్తుంది… వచ్చాడు, ఆమెతో కలిసి నాలుగు గెంతులు వేశాడు… ఒకాయన వేసిన తన డాడీ పెయింటింగ్ చూసి ఎమోషన్ ఫీలయ్యాడు… ఇది సరే కానీ సుమా, అక్కడికొచ్చే సెలబ్రిటీలు, వాళ్లు చేసే కామెడీ బిట్లు, విట్లతో కథ నడవదు… పార్టిసిపెంట్లు చేసే ఫీట్లు కొత్తగా ఉంటే జనం చూస్తారు… ప్రస్తుతం ఈ షోలో చూపిస్తున్నవన్నీ గతంలో ప్రేక్షకులు వేరే షోలలో, యూట్యూబ్ వీడియోల్లో బోలెడు చూశారు… అందుకే ఈ షో ఫ్లాపయింది… కాన్సెప్టే కొట్టేసింది… ఇక ఎందరు సెలబ్రిటీలు వచ్చి, ఏం చాలెంజులు చేసినా… ఈ షో ఇక లేవదు… పాపం శమించుగాక..! ఎందుకంటే..? టీవీ షోలు ఏనుగుల్లాంటివి, గుంతలో పడితే ఇక లేపడం చాలా కష్టం…!!
Share this Article