.
నాయకుడు జనంలో ఉండాలి… జనానికి నేనున్నాననే భరోసానివ్వాలి… జనం ఆనందంలో, జనం విషాదంలో తోడుండాలి… ఆపదలో అండగా ఉంటాననే నమ్మకాన్ని ఇవ్వాలి…
కానీ మన తెలంగాణ భిన్నం… గత ముఖ్యమంత్రి కేసీయార్ జనంలో ఉండడు… జనంలోకి రాడు… అధికారంలో ఉన్నా అంతే, ప్రతిపక్షంలో ఉన్నా అంతే… ఫామ్ హౌజ్ అనే ఓ మార్మిక గుహ వదలడు… జస్ట్, ఓ ఉదాహరణ చెప్పాలంటే…
Ads
కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది మరణిస్తే ఆవైపు కూడా చూడలేదు… అలా ఎన్నో, వరదలు, భారీవర్షాలు, ప్రమాదాలు, కరువులు… జనం కన్నీళ్లు పెడుతున్న సందర్భాల్లోనూ కదలడు, కదల్లేదు… చివరకు ప్రతిపక్షంలోకి వచ్చాక మరీ దారుణం… ఈ రెండేళ్లలో ఒకటీరెండుసార్లు స్వామి వారి దర్శనభాగ్యం కలిగింది జనానికి…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? రేవంత్ రెడ్డితో పోలిక… ఎస్, నాయకుల నడుమ పోలిక సహజంగానే జనంలో చర్చనీయాంశమవుతుంది కదా… ఆమధ్య భారీ వర్షాలు పడిన బాధిత ప్రాంతాలకు హఠాత్తుగా వెళ్లాడు రేవంత్ రెడ్డి… ప్రోటోకాల్స్, భారీ బందోబస్తులు ఏమీ లేవు… ఫీల్డ్ పరిస్థితేమిటో స్వయంగా చూశాడు… ఆ ప్రభావం సహాయక చర్యల మీద ఉంటుంది సహజంగానే…
నిన్న అకస్మాత్తుగా ట్యాంక్ బండ్ మీద తేలాడు… అట్టహాసపు కాన్వాయ్‌లు, పోలీసు వాహనాలు పరుగుల్లేవు… అలా వచ్చాడు సింపుల్‌గా… జనంలో సెల్ఫీలు దిగాడు… నిమజ్జనం ఎలా జరుగుతుందో స్వయంగా చూశాడు…
నిజానికి నిమజ్జనాల సమయంలో సీఎం అక్కడికి వస్తున్నాడంటే… అంత రద్దీ, అంత హడావుడిలో… అదొక గందరగోళంగా మారే ప్రమాదం ఉంది… ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడతారు… అందుకే ఏ అధికార పటాటోపాలు లేకుండా వచ్చాడు… ఓ సాధారణ భక్తుడిలా ట్యాంక్ బండ్ మీదకు వచ్చి.. అందరిలాగే గణపతి బప్పా మోరియా నినాదాలు చేశాడు…
ఇది జనంతో కనెక్ట్ కావడం… సింప్లిసిటీ… ఓ లాల్చీలో కారు దిగిన తనతో కరచాలనాల కోసం, సెల్ఫీల కోసం జనంలో ఆసక్తి… చిన్న పిల్లలకు కరచాలనాలు ఇస్తూ… జనంలో తానూ కాసేపు తిరిగాడు… రేవంత్ రెడ్డి ఇలా రావడం వల్ల భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా సంతృప్తి వ్యక్తం చేసింది… ఇంకా పింక్ క్యాంప్ స్టార్ట్ చేయలేదు… *అబ్బే, రేవంత్ ఈరోజుకూ బీజేపీ మనిషే, అందుకే ఆగలేక అక్కడిదాకా వెళ్లి గణపతి బప్పా మోరియా అని నినాదాలు చేశాడూ* అని…!
ఇదంతా ఏదో రేవంత్ రెడ్డిని అభినందించడం కోసం కాదు రాస్తున్నది… జనంతో కనెక్ట్ అవుతూ, జనంలో ఉండే అలవాటును పోగొట్టుకోవద్దు, కొనసాగించాలని చెప్పడం కోసం… అదేసమయంలో పాత సీఎంతో పోలిక జనంలో చర్చనీయాంశం అవుతున్నదీ అని చెప్పడం కోసం..!!
Share this Article