ఇండియన్ ఐడల్ రేవంత్… ప్రసిద్ధ సంగీత దర్శకురాలు శ్రీలేఖ… వీళ్లు పాటల పోటీలకు జడ్జిలు అయితే… కనీసం ఎదుట నిలబడిన సింగర్ స్వయంగా పాడుతున్నదో, వెనుక నుంచి ఇంకెవరో పాడుతుంటే లిప్ మూమెంట్ ఇస్తున్నదో కూడా కనిపెట్టలేరా..? ఫాఫం… ఆ ప్రొమో చూస్తే నవ్వొచ్చింది… అనేకానేక హిట్ సినిమాల్ని తీసిన బొడ్డు రాఘవేంద్రరావు పేరు సమర్పకుడిగా ఆ ప్రొమోలో చూస్తే నవ్వు రాలేదు, జాలేసింది… 78 ఏళ్ల వయస్సులో… అన్నీ చాలించుకున్న వేళ… మళ్లీ ఏదో తిరగబెడుతున్నట్టుంది… ఎవరో ముగ్గురు హీరోయిన్లను పెట్టి, ఏదో గతస్మృతుల మీద తీయబోయే సినిమాలో తను కథానాయకుడట… నో, నో, ఇప్పుడు ఆ అసాధారణ సాహసకృత్యం గురించి కాదు చెప్పుకునేది… తను జీతెలుగు టీవీలో సమర్పించబోయే కృష్ణతులసి అనే సీరియల్ గురించి…
ఒక దర్శకేంద్రుడు… (ఆయనే రాసుకున్నాడు అలా…) అతిరథ మహారథుల్ని డీల్ చేసి, సూపర్ బంపర్ డూపర్ హిట్లు కొట్టిన దర్శకుడు… ఒక సీరియల్ సమర్పిస్తున్నాడూ అంటే, అదెలా ఉండాలి…. తుస్, ఫాఫం… మరీ ఓ సగటు నాసిరకం తెలుగు టీవీ సీరియల్… కాదు, దాని తాత అన్నట్టుగా ఉండబోతోంది… ప్రోమో చూస్తే ఆ ఘఠ్టి నమ్మకమే కలుగుతోంది… అసలు రాఘవేంద్రరావు సినిమా పాలసీ ఏమిటి..? లాజిక్ లేకపోతేనే సినిమాలో మ్యాజిక్ ఉంటుందని కదా… దానికితోడు టీవీసీరియళ్ల సూత్రం కలపండి… అదేమిటీ అంటే..? టీవీ ప్రేక్షకుల్ని ఎడ్డి ఎదవల్ని చేసేలా, కామన్ సెన్స్ కూడా లేకపోవడం… ఏ సీరియల్ చూసినా సరే, అదే తంతు… లాజిక్కులూ ఉండవ్, కామన్ సెన్సూ ఉండదు, పరమ నాసిరకం ప్రజెంటేషన్, క్రియేటివిటీ వంద భూతద్దాలు వేసుకుని వెతికినా దొరకదు… టీవీ సీరియల్ అంటేనే అలా ఉండాలి అని ఎవరైనా చెప్పారో ఏమో… ఎవరో ఏమిటి..? ఈమధ్య ఇలాంటి సీరియళ్లకు ప్రసిద్ధి పొందిన జీవాడే చెప్పి ఉంటాడు… సేమ్, రాఘవేంద్రరావు వోకే అన్నాడు…
Ads
లేకపోతే ఏమిటి..? ప్రోమో చూస్తేనే డోకొచ్చేలా ఉండాలా..? ఓ మంచి సింగర్ గొంతును ఎవతో కిరాయికి తీసుకుని, తన కూతురిని స్టేజీ మీద నిలబెట్టి, స్టేజీ వెనుక ఓ బాక్సులో ఈ అద్దె గొంతును నిలబెట్టి… పాటలు పాడిస్తుందట… అక్కడున్నోళ్లంతా టీవీ ప్రేక్షకుల్లాగే పిచ్చోళ్లా ఏం..? అందరూ చప్పట్లు కొడితే పాపం పాడిన ఆ సింగర్ (పాత్ర పేరు శ్యామ, ఆనటి పేరు ఐశ్వర్య) సంతోషపడుతుంది… ఈమెను కిరాయికి తీసుకున్నామె వచ్చి చెంప పగులగొడుతుంది… నీ గొంతు తాకట్టు పెట్టాను అని మరిచిపోయావా అని కస్సుమంటుంది… మరిచిపోయి ఆ పిల్ల చేసిన తప్పేమీ లేకుండానే, ఈ చెంపలు పగులగొట్టడం, పక్కనే ఓ నల్కా కేరక్టర్ నిలబడి ఉండటం… వామ్మో… రెండో ప్రోమో మరీ ఘోరం… ఎవతో, ఎవరి కోసమో పెళ్లిచూపులకు వచ్చి, ఆ ఈవెంటుతో ఏ సంబంధమూ లేని ఈ శ్యామను చూసి, ఆగి, తిట్టి, వెక్కిరించి వెళ్లడం ఏమిటో… రాఘవేంద్రరావూ… సీరియల్ సమర్పించడమే కాదు, అందులో ఏం కంటెంటు, ఎంత నాసిరకంగా ఉందో కూడా చూసుకోవయ్యా… ఈ వయస్సులో నీ పేరుకు ఈ మకిలి అవసరమా చెప్పు….
తనే కాదు, అక్కినేని నాగార్జున మరీ ఘోరం… అన్నపూర్ణ పేరు మీద ఏ సీరియల్ వస్తుందో, అందులో జనాన్ని ఎర్రగడ్డ హాస్పిటల్కు పంపించే కంటెంటు ఎంత ఘోరంగా ఉంటున్నదో కూడా వెనక్కి తిరిగి చూసుకునే సోయి లేదు నాగార్జునకు… ఉదాహరణ జీవాడి టాప్ సీరియళ్లలో నంబర్ వన్ త్రినయని… మొత్తం ఒక్కో ఎపిసోడ్కు లక్ష తప్పులు దొరుకుతయ్ సీరియస్గా చూస్తే… ఆ దర్శకుడెవరో గానీ తన పాదాలకు మొక్కాలి టీవీ ప్రేక్షకులందరూ… అంత నాసిరకంగా ఎవరూ తీయరు… హీరోయిన్ విషపు పూల బాగోతాన్ని కనిపెట్టి, ఓ ఇన్స్పెక్టర్కు ఇచ్చి పరీక్ష చేయించమని కోరుతుంది, తనే ఆయన్ని ఓసారి కాపాడుతుంది… ఈ పోలీసాయన వెళ్లి ఆమెనే అరెస్టు చేసుకొస్తాడు… ఈ విషయం తెలిసి హీరో వచ్చి, నేనే విషం చల్లాను అంటాడు… అసలు కేసే తనను చంపాలనే కుట్ర… నేనే విషం చల్లాను అని చెబుతుంటాడు… తలకు సర్జరీ జరిగితే, ఓ తెల్ల బ్యాండేజీ, దాని మీద ఓ ఎర్రటి రక్తపు చుక్క… హహహ… 1960 కాలంలో ఉండాల్సిన డైరెక్టర్… పైగా హీరోను చంపాలని హీరోయిన్ ఎందుకు అనుకుంటుంది..? అనుకుంటే ఆమే ఫోరెన్సిక్ పరీక్ష ఎందుకు కోరుకుంటుంది..? పోనీ హీరో తనను తనే చంపుకోవాలని, తన గదిలో విషపు పూలను పెట్టుకుంటాడా..? ఫాఫం, అసలే సమాజంలో పోలీసోళ్ల ఇమేజీ నేలబారులో ఉంది… ఇలాంటి తలకాయ్ లేని సీరియళ్లను సమర్పిస్తున్న నాగార్జునా గ్రేట్… సేమ్, బాటలో ఉన్న రాఘవేంద్రరావూ గ్రేట్… అయ్యా, మురళీమోహన్, నెక్స్ట్ నువ్వే… చాలా ఈజీ… బుర్రను ఇంట్లో పెట్టి సెట్టింగుకు వస్తే చాలు…!!
Share this Article