అయిపోయింది, అంతా అయిపోయింది… ఇక జగన్ పార్టీ ఉండదు, మాయమైపోయినట్టే… ఇద్దరు ఎంపీలు రాజీనామాలు చేసేస్తున్నారు… ఓ ఎమ్మెల్సీ రాజీనామా చేయబోతోంది… ఇంకా ఎంపీలు వెళ్లిపోతారు… రోజా కూడా వదిలేసింది… చివరకు పార్టీలో ఎవరు మిగులుతారో తెలియదు, అసలు పార్టీ మనుగడే పెద్ద ప్రశ్నార్థకం……. ఇలా వార్తలు కనిపిస్తున్నాయి జోరుగా…
ఏపీ, తెలంగాణ అని మాత్రమే కాదు… ఏ రాష్ట్రంలోనైనా ఇంతే… అవకాశవాదం, స్వార్థం మాత్రమే కాదు… గెలిచిన పార్టీ కక్షసాధింపులకు పాల్పడకుండా క్యాంపు ఫిరాయించడం కూడా ఓ రాజకీయ ఎత్తుగడే… ఐనంతమాత్రాన ఏ పార్టీ మాయమైపోదు… జగన్ ఓటమి నిజంగానే ఓ పరాభవం స్థాయి చేదు పరిణామమే… మరీ అంత తక్కువ సంఖ్యలో సీట్లు ఎవరూ ఊహించలేదు… కానీ..?
తనకూ ఏమాత్రం తక్కువగా తీసిపారేయలేని వోట్ బ్యాంకు ఉంది… బీజేపీ, జనసేన, టీడీపీ వోట్ల కలయికతోపాటు జగన్ పాలన తాలూకు ఘోర వైఫల్యాలు, అపరిపక్వ పాలన తీరు కూడా చంద్రబాబుకు ఉపయోగపడింది… అసలు జీరో నుంచి పోటీచేసిన ప్రతిచోటా జనసేన గెలవడం అచ్చంగా జగన్ పట్ల జనంలో నెలకొన్ని తీవ్ర వ్యతిరేకతకు తార్కాణం… ఐనాసరే, కొందరు నాయకులు వెళ్లిపోయినంతమాత్రాన జగన్ పార్టీకి తక్షణ ప్రమాదం ఏమీ లేదు… ఎందుకంటే..?
Ads
జగన్ మొండి, జగమొండి… మళ్లీ ఈ ప్రజలే తనను గద్దెనెక్కిస్తారనే బలమైన నమ్మకంతో ఇక జనంలోకి వెళ్తాడు… వదిలేసే కేరక్టర్ కాదు అది… నాయకులు ఇటూఅటూ జంప్ అవుతూనే ఉంటారు… మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు వరకూ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి… అందుకని నాయకుల మొహాలు చేసి వోట్లేసే రోజులు కావివి… ఓవరాల్‌గా పాలన తీరును గీటురాయిగా తీసుకుంటున్నారు వోటర్లు… అలాగని జగన్ మారతాడనుకోవడం కూడా ఓ భ్రమే… అస్సలు మారడు, జనం మారాల్సిందే అనుకుంటాడు…
పైగా జగన్, చంద్రబాబుల నడుమ స్పేస్‌లోకి దూరగలిగే, ప్రయత్నించే మరో నాయకుడు కూడా లేదు ఏపీలో… జగన్ ఏమాత్రం పికప్ అయినా మళ్లీ బోలెడు మంది నాయకులు పోలోమంటూ వరుసకడతారు… రాజకీయాలు ఇంతకు భిన్నంగా ఏమీ ఉండవు… జగన్‌కు కూడా బాగా తెలుసు అది… తెలుగుదేశం ఎంపీలు కూడా బీజేపీలో కలిసిపోయారు అప్పట్లో… ఏమైంది..? చంద్రబాబుకు ఏమాత్రం ఫరక్ పడలేదు, తనే పంపించాడనీ అంటారు కొందరు… జగన్ కూడా అలాగే పంపిస్తున్నాడు అని కాదు ఇక్కడ అర్థం..!! ఏపీ పాలిటిక్స్ మొత్తం దేశంలోనే డిఫరెంట్ కదా, అలాగే అనుకున్నా పెద్ద ఫరక్ ఏమీ పడదు…
తెలంగాణలో కాంగ్రెస్ గెలవగానే బీఆర్ఎస్ నుంచి బోలెడు మంది వెళ్లిపోయారు… అంతెందుకు టికెట్లు ఇచ్చినా నిరాకరించి, కాంగ్రెస్‌లోకి వెళ్లి టికెట్లు తెచ్చుకున్న తీరూ చూశాం కదా… రేవంత్ రెడ్డిని చాలామంది ఎమ్మెల్యేలు కలిశారు, కొందరు చేరారు, కొందరు పెండింగ్… అంతే, ఇక బీఆర్ఎస్ పని ఖతం అని ప్రచారం చేశారు… ఏమైంది..? ఏమీ కాదు… సభలో, మండలిలో బీఆర్ఎస్ విలీనం తప్పదు అన్నారు… ఎక్కడికక్కడ ఆగిపోయింది… అక్కడైనా ఇక్కడైనా నాయకులు తమ తక్షణ అవసరాలు, రక్షణల కోసం అటూఇటూ మారుతుంటారు, అంతే…
కేసీయార్ గతంలో కాంగ్రెస్‌ను పూర్తిగా బొందపెట్టాలని చూశాడు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రలోభాలు, ఎన్నో జంపింగులు… కానీ ఏమైంది..? అదే కాంగ్రెస్ గద్దెనెక్కింది… సో, జంపింగుల పర్యవసానంగా పార్టీలే కనుమరుగు అవుతాయనేది హంబగ్… కేసీయార్ కాకపోతే కేటీయార్… కాకపోతే కవిత, కాకపోతే హరీష్… ఎవరో లీడ్ చేస్తారు, అంతేతప్ప పార్టీ ఎందుకు ఉండదు..? బీజేపీలో విలీనం వార్తలు కూడా నమ్మబుల్ కాదు… అసలు బీఆర్ఎస్‌ను మింగేసినా, జీర్ణం చేసుకునేంత సీన్ బీజేపీకి ఉందా..?
మరి చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో నిమజ్జనం కాలేదా అంటారా..? తను నిజానికి ఈతరం రాజకీయాలకు సూట్ కాలేదు… తను నిజంగానే అలాగే స్థిరంగా నిలబడి, తన పార్టీని కాపాడుకుని ఉంటే… ఈరోజు చిరంజీవి ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా, బలంగా కనిపించేవాడు… బోలెడు స్కోప్ దొరికేది…!!
Share this Article