మీరు టీవీ, సినిమాల రెగ్యులర్ ప్రేక్షకులయితే మీకు ఓంకార్ గురించి తెలిసే ఉంటుంది… అదేనండీ, వన్ సెకండ్ అంటూ ఓ విచిత్రమైన గొంతుతో ఖంగుమంటాడుగా… తనే… 2006 నుంచీ టీవీ ఫీల్డులో ఉన్నాడు… రకరకాల టీవీ షోలు హోస్ట్ చేస్తాడు, నిర్మిస్తాడు… రెండుమూడు సినిమాలు కూడా తీసినట్టున్నాడు… ఇప్పుడు తన చేతికి బిగ్‌బాస్ వెళ్లిపోనుంది… అర్థం కాలేదా..? బిగ్‌బాస్ నిర్మాణ వ్యవహారాల్ని ఈ ఓంకార్ సొంత నిర్మాణ సంస్థ ఓక్ ఎంటర్‌టెయిన్‌మెంట్స్ చేపట్టనుంది… అంటే ఇన్నాళ్లూ రకరకాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న టీం మొత్తం మారిపోతుందా, దాని ప్రక్షాళన అవసరాన్ని బిగ్‌బాస్ ఒరిజినల్ నిర్మాతలైన ఎండెమాల్ ఇండియా గుర్తించినట్టేనా అనడగబోతున్నారా..? కాస్త వివరంగా చెప్పుకుందాం…
మొన్నమొన్ననే కదా బిగ్‌బాస్ షో అయిదో సీజన్ అయిపోయింది… తదుపరి ఆరో సీజన్ మరో రెండు నెలల్లో స్టార్ట్ చేస్తామనీ, దానికీ నేనే హోస్ట్ చేస్తాననీ నాగార్జున కూడా చెప్పినట్టున్నాడు కదా… ఈలోపు అన్నపూర్ణ స్టూడియోలోని అదే సెట్‌లో ‘‘బిగ్‌బాస్ ఓటీటీ’’ నిర్వహించాలని ప్లాన్… ఆల్‌రెడీ 15 సీజన్లు నడిచిన హిందీలో ఈమధ్య ఈ కొత్త ప్రయోగం చేశారు, హోస్టింగ్ కూడా రెగ్యులర్ సల్మాన్ ఖాన్ గాకుండా కరణ్ జోహార్ చేశాడు… ఐతే అది పెద్దగా రీచ్ లేని వూట్ అనే ఓటీటీలో ప్రసారం చేయడం వల్ల అది జనానికి పెద్దగా చేరలేదు… కొన్నిరోజులు కలర్స్ టీవీలో రాత్రి పూట ప్రసారం చేశారు కానీ తరువాత అదీ ఆపేశారు… మొత్తానికి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఆ ఓటీటీ బిగ్‌బాస్…
Ads
ఇప్పుడు తెలుగులో కూడా ఆ ప్రయోగం చేయాలనేది ప్లాన్… తక్కువ ప్రైజ్ మనీ, తక్కువ మంది కంటెస్టెంట్లు, 24 గంటల కెమెరా, ఓటీటీలో ఎక్కువ సేపు ప్రసారం, ప్రేక్షకులే నామినేట్ చేసే అవకాశం తదితర వివరాలతో వార్తలు వినిపిస్తున్నాయి గానీ, అవన్నీ ధ్రువీకరణకు నోచనివే… ఈ ఓటీటీ బిగ్‌బాస్ షో నిర్మాణ బాధ్యతల్ని మాత్రం ఓంకార్‌కు చెందిన ఓక్ సంస్థకు అప్పగిస్తారట… (ఓక్ అంటే OAK… ముగ్గురు అన్నదమ్ములు ఓంకార్, అశ్విన్, కల్యాణ్ పేర్ల మొదటి అక్షరాలతో ఈ పేరు పెట్టినట్టున్నారు) దీన్ని డిస్నీ-హాట్‌స్టార్‌లో ప్రసారం చేస్తారు… దాని రీచ్ ఎక్కువ కాబట్టి మంచి నిర్ణయమే… పైగా ఎడిటెడ్ వెర్షన్‌ను మాటీవీలో ప్రసారం చేసే విషయంలో తుది నిర్ణయమేదీ జరిగినట్లు లేదు…
సాధారణంగా తను నిర్మించే ప్రతి టీవీషోను హోస్ట్ చేసేది ఓంకారే… అది డాన్స్ షో ఐనా, స్మార్ట్ జోడీ ఐనా, పిల్లల మాయద్వీపం ఐనా, సరదాగా సాగే సిక్స్త్ సెన్స్ షో ఐనా… ఏదైనా సరే, తన ముద్ర ఉండాల్సిందే… కామెడీ స్టార్స్ షో విషయంలో కాస్త సంయమనం పాటించి, దూరం ఉన్నట్టున్నాడు… డాన్స్ ప్లస్ షో విషయంలో తమాయించుకోలేక అప్పుడప్పుడూ కనిపించేవాడు… మరి ఈ బిగ్‌బాస్ ఓటీటీ హోస్టింగ్ తనే చేస్తాడా..? దానికీ నాగార్జుననే ఎంచుకున్నారా..? దీనిపై ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు… రెగ్యులర్ షో ఆరో సీజన్‌కు నాగార్జునే ఉంటాడు, కానీ ఈ ఓటీటీ షోకు వేరేవాళ్లతో హోస్టింగ్ చేస్తే బెటర్ కదా, మొనాటనీ బ్రేక్ చేసినట్టు ఉంటుంది కదా, హిందీలో కూడా చేసింది అందుకే కదా అనే వాదనలున్నయ్… పైగా రెండు నెలల్లో రెగ్యులర్ బిగ్‌బాస్ షో మొదలయ్యే పక్షంలో ఇప్పటినుంచే ఎంపిక ప్రక్రియ, సంప్రదింపుల కసరత్తు స్టార్ట్ కావాలి… మరి ఈ రెండు నెలల్లో ఓటీటీ షో కంటెస్టెంట్ల ఎంపిక ఎప్పుడు జరిగేను, ఎప్పుడు స్టార్టయ్యేను, ఆరో సీజన్‌లోపు ఎలా పూర్తయ్యేను అనే ప్రశ్నలు కూడా ఉన్నయ్… ఓంకారో, నాగార్జునో క్లారిటీ ఇస్తారేమో త్వరలో…!
Share this Article