.
అనుకున్నట్టే అవుతోంది… బిగ్‌బాస్‌కు ప్రేక్షకాదరణ కరువైంది… అసలు షో లాంచింగ్ రేటింగ్సే దారుణంగా ఉండిపోగా… రెండోవారం వీక్ షో రేటింగ్స్, వీకెండ్ షోలకు కూడా రేటింగ్స్ మరీ తక్కువగా నమోదయ్యాయి…
నవ్వొచ్చేది ఏమిటంటే..? నాగార్జునను ఓ కంటెస్టెంట్ అడిగింది… జనంలో ఈ సీజన్ షోకు ఆదరణ ఎలా ఉందీ అని…! ఫాఫం నాగార్జునతో ఏం చెప్పించారంటే… ఈ సీజన్ బిగ్ బాస్ షో స్టార్టయ్యాక స్టార్ మా చానెల్ దేశంలోనే నెంబర్ వన్ ప్లేసులోకి వచ్చింది అని..!
Ads
దేశంలోనే నెంబర్ వన్ ప్లేసులోకి వచ్చింది అనేది నిజమే… కానీ కేవలం బిగ్ బాస్ షో వల్ల కాదు కదా… చాలా కథలుంటాయి… స్టార్ మా బలం దాని సీరియల్స్, దాని రీచ్… మీటర్లు మన్నూమశానం కథలు వేరు… అంతెందుకు..? టాప్ టెన్ చానెళ్లలో జీ తెలుగు కూడా ఉంది… సెకండ్ ప్లేసులో సన్ టీవీ…
అంటే ప్రాంతీయ చానెళ్లు చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ… అంతెందుకు..? సౌత్ సినిమాలను హిందీలోకి డబ్ చేసి ప్రసారం చేసుకునే గోల్డ్ మైన్స్ అనే మామూలు టీవీ చానెల్ కూడా ఇప్పుడు టాప్ టెన్‌లోకి వచ్చింది… అంతే తప్ప ఈ బిగ్‌బాస్ రియాలిటీ షో వల్ల స్టార్ మాటీవీ నెంబర్ వన్ ప్లేసులోకి రాలేదు… బిగ్‌బాస్ టీం తమ దరిద్రపు క్రియేటివిటీని ఇక్కడ చూపించాల్సిన పనిలేదు…
అదేదో కంటెస్టెంట్ల ఎంపికలో, టాస్కుల్లో ప్రదర్శిస్తే కాస్త రేటింగ్స్ మెరుగుపడతాయి… అగ్నిపరీక్ష అని పైత్యపు తంతు ఏదో బెట్టి దిక్కుమాలిన కంటెస్టెంట్లను జనం మీదకు రుద్దారు… హరిత హరీష్, డెమోన్ పవన్… వీళ్లను మించి దమ్ము శ్రీజ, ప్రియ దారుణంగా విసిగిస్తున్నారు ప్రేక్షకులను…
వీళ్లను చకచకా ఎలిమినేట్ చేసేస్తే ఓ పనైపోతుంది అనుకుంటే, మళ్లీ అదే అగ్నిపరీక్ష బ్యాచ్‌ను హౌజులో దింపే ప్లానుందట బిగ్‌బాస్ టీమ్‌కు… సచ్చింది గొర్రె.., ఈసారి కాస్తో కూస్తో సెలబ్రిటీలే నయం, ఈ కామనర్స్‌తో పోలిస్తే…
సరే, రేటింగ్స్ విషయానికి వద్దాం… ఆదివారం నాగార్జున షోకు కేవలం 4.82… దాంతో పోలిస్తే శనివారం కాస్త నయం… ఆ రేటింగ్స్ 5.26…. ఎన్నోసార్లు జెమినీ టీవీలో, అదీ పెద్దగా రీచ్ లేని చానెల్‌లో ప్రసారం అయిన సరైనోడుతో పోలిస్తే (4.97) మరీ మరీ దిగదుడుపు నాగార్జున సండే స్పెషల్… ఫాఫం…
వీక్ డేస్‌లో మరీ వీక్… శుక్రవారం 3.69, సోమవారం 3.39, మంగళవారం 3.25, బుధవారం 3.10, గురువారం 3.07 …. ప్రసారం చేసీ చేసీ, రికార్డులు వేసీ వేసీ అరిగిపోయిన పాత సినిమాలకు కాస్త ఎక్కువ రేటింగ్స్ వస్తాయి…!!
- చివరగా…. తనూజ ఒక్కతే బెటర్ అనిపిస్తోంది… బిగ్‌బాసోడు రెండు హౌజులు అని పెట్టి… కామనర్లు వర్సెస్ సెలబ్రిటీల పోరాటం అని క్రియేట్ చేసి… ఔట్ హౌజుల్లో ఉన్నవాళ్లు మెయిన్ హౌజులోకి రావద్దు అని చెప్పినా…. కామనర్లు ఎప్పుడంటే అప్పుడు ఎవరినీ అడగాల్సిన అక్కర లేకుండా మెయిన్ హౌజులోకి వచ్చేలా… తోటి సెలబ్రిటీలను ఆమె ఒప్పించిన తీరు కూడా బాగుంది…
Share this Article