ఆనందంగా ఉందిరా బిగ్‌బాస్… ఈసారి సీజన్ పరమ చెత్త అని నీఅంతట నువ్వే అంగీకరించడం బాగుంది… ఐనా అంగీకరించక చచ్చేదేముందిలే గానీ… ఛి, నా సెలక్షన్స్ పాడుగాను, ఛిఛీ, ఒక్కడికీ ఆట చేతకావడం లేదు, వీళ్లనేం చేయాలో అర్థం కావడం లేదు అని చేతులెత్తేసి, ఆత్మమథనంలో పడ్డావు చూడు, అది ఆనందంగా ఉంది… కానీ పిచ్చోడా… మంచి చాన్స్ మిస్ చేశావు… బిగ్‌బాస్ ప్రేక్షకులను కూడా తీవ్ర నిరాశకు గురిచేశావు…
ఏదో కెప్టెన్సీ టాస్క్ అన్నావు… ఈసారి ఏ టాస్కులూ సరిగ్గా చేసిచావలేదు కదా… ఇదీ అంతే… కాకపోతే ఇది మరీ ఘోరం… ఒక్కడూ తమ పాత్రలకు కట్టుబడి లేరు… కనీసం బిగ్‌బాస్ ఆట అంటే ఏమిటో కూడా తెలియదు ఎవరికీ… ఏదో అన్నపూర్ణ స్టూడియోస్ బయట తిరుగుతుంటే పట్టుకొచ్చి, లోపల హౌజులో పెట్టినట్టుగా ఉంది చూడబోతే… ఎవరికీ ఆట తెలియదు, చావగొట్టేస్తున్నారు అని బిగ్‌బాసే అధికారికంగా ఏడిచాడు… అంతేకాదు, ఒరేయ్, తక్షణం బయటికి పొండిరా అని గేట్లు తెరిచాడు…
ప్చ్, దానికి కట్టుబడి ఉంటే ఎంత బాగుండేది… మిగతా సగం రోజుల ఖర్చు మిగిలేది… బిగ్‌బాస్ ప్రేక్షకుల కోరిక నెరవేరేది… ఎలాగూ యాడ్స్ లేవు, రెవిన్యూ లేదు… ప్రోగ్రామ్‌లో జోష్ లేదు… సడెన్ ఎంట్రీలు లేవు, సర్‌ప్రయిజ్ ఎలిమినేషన్లు లేవు… అసలు పాత బిగ్‌బాస్ సీజన్లతో పోలిస్తే అసలు పోలికే లేదు… ఏదో నడుస్తోంది, నడిపిస్తున్నాం… అంతే… వాడి దయ, ప్రేక్షకుడి ఖర్మ…
Ads
టాస్క్ ఏదైనా సరే, ఒక్కరూ సరిగ్గా ఆడి చావడం లేదు, ఇంకేం చేయను, ఎలా చావను అని బిగ్‌బాస్ తనే స్వయంగా ఏడుస్తున్నాడు… మరి ఏం చూసి ఈ ఎంపికలు జరిగినట్టు..? చివరకు కెప్టెన్సీ టాస్క్‌నే రద్దు చేసి, ఈసారి హౌజుకు కెప్టెన్ ఉండడుపో అని ప్రకటించాడు బిగ్‌బాస్… ప్చ్, హౌజుకు తాళాలు వేస్తే బాగుండేది… నిజానికి ఎంత ఘోరం అంటే…
ఫైమా కాస్త అనుభవమున్న నటే కదా… కమెడియనే కదా… కానీ ఫ్లాప్… మిమిక్రీ తెలిసిన సూర్యకు పుష్ప పాత్ర ఈజీయే కదా, అదెందుకు చేతకావడం లేదు..? అన్నింటికీ మించి గీతు గతంలో జబర్దస్త్‌లో కూడా పుష్ప స్పూఫ్ చేసిన అనుభవం ఉంది కదా, ఆమె చిత్తూరు యాస బ్రహ్మాండంగా పలకగలదు కదా, మరెందుకు చేతకావడం లేదు..? జస్ట్ ఉదాహరణలు… దాదాపు అందరూ అంతే… ఆకార పుష్టి, నైవేద్య నష్టి… అంటే నిజంగానే హౌజులో ఏదో డ్రైవింగ్ ఫోర్స్ మిస్సయింది… ఇంకెవరు..? క్రియేటివ్ టీం చేతకానితనమే…
అసలు టీవీ రేటింగ్స్‌లో వీక్‌డేస్ పరమ దరిద్రంగా ఉంటన్నయ్… శనివారం, ఆదివారాల్లో నాగార్జున వస్తాడు, అవీ బోర్ కొడుతున్నయ్… అందుకే ఎవరూ సరిగ్గా పర్‌ఫామ్ చేయడం లేదు అని చెప్పే చాన్స్ వచ్చినప్పుడు, మూసేస్తే సరిపోయేది… బిగ్‌బాస్ చరిత్రలో అదీ ఓ రికార్డుగా నిలిచిపోయేది… కనీసం అది కూడా చేతకావడం లేదు… ఈలోపు హైకోర్టు ఏదో కొరడా పట్టుకునేట్టుగా కనిపిస్తోంది… వేచిచూడాలి…!!
Share this Article