కాస్త జాగ్రత్తగా చదవండి ఇది… బిగ్బాస్ టాప్ ఫైవ్ ఫైనలిస్టులందరూ ఫినాలే అయిపోయాక ఊరేగింపులుగా తమ అభిమానులతో ఇళ్లకు వెళ్లారు… కానీ సిరి ఊరేగింపులో ఆమె బాయ్ ఫ్రెండ్, లివ్ -ఇన్ సహచరుడు అనగా, ప్రస్తుత జీవన భాగస్వామిగా చెప్పబడే శ్రీహాన్ కనిపించలేదు, ఈరోజుకూ వాళ్లిద్దరూ కలవలేదు… ఎందుకు..? పోనీ, షణ్ముఖ్ అలియాస్ షన్ను, అనగా నాగార్జున భాషలో బ్రహ్మ (షణ్ముఖ్ అంటే బ్రహ్మ అని నాగార్జునకు ఎవరు చెప్పారో ఫాఫం, తనకెలాగూ తెలియదు) ఊరేగింపులో దీప్తి జాడ లేదు, అభినందనల ఊసు లేదు, పరుగున వచ్చి ఆమె హత్తుకున్నదీ లేదు… ఎందుకు..? సింపుల్… సిరి అనే సూపర్ లవ్ కేరక్టర్ తన పాత దోస్తు షన్నూను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, మరీ హౌజులో ఓవరాక్షన్లోకి దింపింది… షన్నూ అడ్డంగా పడిపోయాడు… ఆ దెబ్బకు బిగ్బాస్ కిరీటం కూడా పోయింది… నిజానికి తను మెయింటెయిన్ చేస్తున్న సోషల్ మీడియా, వోటింగు ప్లానుకు తను విజేతగా నిలవాల్సినవాడు కాస్తా సిరితో ఈ డర్టీ యవ్వారంతో వ్యతిరేకత పెంచుకుని, ఓటింగులో వెనుకబడిపోయి, చేజేతులా సన్నీకి ఆ ట్రోఫి అప్పగించాల్సి వచ్చింది…
ఇక ఇప్పుడు జరిగింది ఏమిటి..? సిరి పెట్టిన ఆ మెంటల్ చిచ్చుతో…. ఆమె కాపురమే (?) కాదు, ఇంకోవైపు షన్నూ కాబోయే కాపురమూ కూలిపోయినట్టయింది… సిరిని, షన్నూను ఈ పిచ్చి రొమాన్సులో ఇరికించి రేటింగుల సొమ్ము చేసుకున్న బిగ్బాసోడు రెండు జంటల్లో ఇలా నిప్పులు పోశాడు… వెరసి రెండు జంటల ప్రేమాయణం కాస్తా ఫసాక్ అయిపోయింది… మీరు జాగ్రత్తగా గమనిస్తే… సిరి గానీ, షన్నూ గానీ రకరకాల ఇంటర్వ్యూల్లో మాట్లాడితే ఇదే అర్థమవుతుంది… అంతదాకా ఎందుకు..? తాజాగా షన్నూ ప్రియురాలు దీప్తి సునయన తన ఇన్స్టాగ్రాంలో ఏం పోస్టు పెట్టిందో తెలుసా..? చూడండి…(ఆమెకు బిగ్బాస్ కథలన్నీ తెలుసు, ఆమె గతంలో హౌజులోకి వెళ్లి వచ్చిన కేరక్టరే….)
Ads
‘‘ఒరేయ్ షన్నూ, ఇప్పటికైనా నీకు నువ్వు జవాబుదారీగా ఆలోచించు’’ అన్నట్టుగా ఉంది కదా… అదీ సంగతి… ఎహె, ఈమాత్రం దానికి ఆ రెండు జంటల ఉసురుపోసుకున్నాడు బిగ్బాసోడు అని ఎలా చెప్పగలం అంటారా..? మీకు ఓపిక ఉంటే… కాస్త ఆ నలుగురి ఇన్స్టాగ్రాం ఖాతాల్ని చెక్ చేయండి… దీప్తి ఖాతాలో అయితే గతంలో షన్నూకు అనుకూలంగా పెట్టిన పోస్టులన్నీ ఇప్పుడు కనిపించడం లేదు… అంటే ఏమని అర్థం..? అలాగే శ్రీహాన్ అనే కేరక్టర్ ఇన్స్టాగ్రాం ఖాతాయే కనిపించడం లేదు ఇప్పుడు… ఎందుకు డియాక్టివేట్ చేసుకున్నట్టు..? ఆలోచించండి… సేమ్, షన్ను ఖాతా ఫాలోయర్లలో దీప్తి ఉండదు… సిరి ఫాలోయర్లలో శ్రీహాన్ ఉండడు… ఇదంతా ఎందుకు జరిగింది..? ఆ బిగ్బాసోడు పెట్టిన పెంట యవ్వారం… సిరి ఆ ట్రాపులో పడి డర్టీ యవ్వారానికి తలొంచడం…
నిజానికి సిరి, షన్నూ చాలాకాలంగా పరిచయస్తులు, దోస్తులు… కలిసి వీడియోలు చేసేవాళ్లు, అవి హిట్టయ్యాయి… చూడ ముచ్చటైన జంట… అదంతా వోకే, గుడ్… బయట ఆమెకు శ్రీహాన్ తోడుగా దొరికాడు, షన్నూకు దీప్తి దొరికింది… ఎప్పుడైతే బిగ్బాస్లో సిరి, షన్నూ చేరారో, ఇక మొదలైంది… ఒకే బెడ్డు, ఒకే దుప్పటి, హగ్గులు, ముద్దులు, నానా ఛండాలం… ప్రధాన కారణం సిరియే… ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఓసారి బాత్రూంలోకి వెళ్లి తననుతాను గాయపరుచుకుంది కూడా… మరి షన్నూను అమితంగా ప్రేమించిన నాగార్జున ఈ వ్యవహారానికి ఎక్కడైనా బ్రేకులు వేయాలి కదా… జనం గతంలో ఎప్పుడూ లేనంతగా బిగ్బాస్ షోను బండబూతులు తిడుతుంటే ఎందుకు ఊరుకున్నట్టు..? జరగనీ, ఎంత ట్రోల్ జరిగితే అంత పాపులారిటీ అనుకున్నాడా..? మీ రేటింగ్స్ కోసం రెండు పచ్చని జంటల్లో నిప్పులు పోశావు కదరా బిగ్బాసోడా అని ఎవరైనా తిడితే పెద్దగా తప్పేమీ లేదని అనిపిస్తోంది..!!
Share this Article