ఆర్టిస్టులు దొరుకుతారు, కానీ వాళ్లతో పర్‌ఫామెన్స్ తీసుకునే తెలివితేటలు టీవీచానెళ్ల క్రియేటివ్ టీమ్స్ దగ్గర ఉండాలి, అప్పుడే ఆర్టిస్టులకు పేరు, డబ్బు, చానెళ్లకు రేటింగ్స్, యాడ్స్, డబ్బు… ఈటీవీ వాడికి జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు కాబట్టి, వాళ్లనే శ్రీదేవి డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్, ఢీ, స్పెషల్ ఫెస్టివల్ షోలలో వాడేసుకుంటాడు… సరే, ఎంత కొంత అదనంగా డబ్బొస్తున్నది కాబట్టి ఆ ఆర్టిస్టులంతా సంతోషంగా ఉన్నారు… పైగా ఆ సచ్చిపోదాం, సారీ, రెచ్చిపోదాం బ్రదర్ అనే షో తప్ప మిగతావి పాపులరే కాబట్టి ఆర్టిస్టులకు పేరు కూడా వస్తోంది… మరి స్టార్‌మాటీవీ వాడి సంగతి..? ఎక్కడేమీ దిక్కులేదు కదా, ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్లనే పట్టుకొచ్చి ఏవో వేషాలు, స్కిట్లు వేయిస్తుంటాడు… నానా పాట్లూ పడుతుంటాడు… ఆ కామెడీ స్టార్స్ కూడా అదే… ఆ బిగ్‌బాస్ ఆర్టిస్టులకూ ఎంతోకొంత ఆనందమే, రెగ్యులర్‌గా తెర మీద కనిపిస్తున్నందుకు ప్లస్ నాలుగు డబ్బులు కూడా వస్తున్నందుకు… ఇలా బిగ్‌బాస్ నుంచి వచ్చేయడం, అలా తెర మీదకు ఏదో షోలో అడుగుపెట్టడం, బాగుంది…
తాజాగా సరయు కూడా కామెడీ స్టార్స్ షోలోకి అడుగుపెట్టింది… నిజానికి ఆమె అప్పటికే యూట్యూబ్‌లో బూతుల స్టార్… నోరిప్పితే ఏపీ రాజకీయ నేతలకు దీటుగా రకరకాల పచ్చి బూతుల్ని అలవోకగా మాట్లాడగలదు… చూశారుగా ఈ ఫోటో… రాబోయే సండే షోకు సంబంధించిన ప్రోమో అది… రాగానే ఓ సీనియర్ కమెడియన్‌ను జాడించి ముడ్డి మీద తన్నేసింది ఇలా… ఆమెకు అలవాటైన బూతుల్ని కూడా తీసుకొచ్చేరు సుమా, ఇప్పుడొచ్చే ఈ రెండు, రెండున్నర రేటింగ్స్ కూడా ఢమాల్ అంటాయి… అంతే… అందుకే చెప్పింది, ఆర్టిస్టులు దొరుకుతారు, కానీ ఎలా పర్‌ఫామెన్స్ తీసుకోవాలో టీవీ క్రియేటివ్ టీమ్స్‌కు తెలివి ఉండాలి అనేది… అసలే అది నానాటికీ ఘోరంగా పడిపోతోంది రేటింగ్స్‌లో… తాజాగా శ్రీముఖిని తెచ్చిపెట్టారు… నో యూజ్… అసలు శ్రీదేవి జడ్జిగా ఓ మైనస్ పాయింట్… సద్దాం పర్‌ఫామెన్స్ ఒక్కటే మంచి టైమింగుతో, సరదాగా చూడబుద్దవుతుంది… సరయు కూడా వచ్చిందిగా, ఇక లహరిని కూడా తీసుకువచ్చేయండర్రా… ఉమాదేవి ఆల్‌రెడీ సీరియళ్లలో నటిస్తుంది కాబట్టి పర్లేదు… హమీదా, శ్వేత వస్తే ఇంకాస్త చూడబుల్… (బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక ఒక్కసారి కూడా ఆ ఫేమ్ వాడుకోని కేరక్టర్ మనకు తెలిసి టీవీ9 దేవి మాత్రమే… మళ్లీ మాటీవీ గడప తొక్కినట్టు లేదు, పిలిచినా పోదు, బిగ్‌బాస్ టీం దొంగవేషాలు అంటే అంత ఏవగింపు వచ్చేశాయట ఆమెకు… ఆ టెంపర్మెంట్ టీవీ ఫీల్డ్ లో చాలా అరుదు…)
Ads
ఆ కామెడీ స్టార్స్ ఇలా ఎక్కడో దిగువన 2.62 దగ్గర రేటింగ్స్ జాబితాలో కొట్టుకుంటూ ఉంటే (గత వారం 2.37)… శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం 4.25 దాకా రేటింగ్స్ కొట్టేసి, ఈటీవీ వాడి టాప్-30 ప్రోగ్రాముల జాబితాలోకి ఎక్కేసింది… ఈ కంపెనీ కేవలం కామెడీ స్కిట్లనే నమ్ముకోకుండా దానికి కాస్త హ్యూమన్ టచ్ ఇస్తోంది… కొంత భిన్నత్వాన్ని చూపిస్తోంది… (వీసమెత్తు విషాద వీచిక లేక ఏ హాస్యం పరిపూర్ణం కాదు)… తాజా ప్రోమో కూడా కాస్త అదే ధోరణిలో కనిపించింది… అన్నట్టు… బిగ్‌బాస్ నుంచి మాటీవీలోకి మాత్రమే కాదండోయ్, ఈటీవీ కూడా తన సహజ అంటరాని ధోరణిని వదిలేసి, వాళ్లను ఆహ్వానిస్తోంది, తాజాగా సొహెల్, దేత్తడి హారిక పార్టిసిపేట్ చేశారు, డాన్స్ ఇరగేశారు… గుడ్… సరే, మళ్లీ బిగ్‌బాస్ దగ్గరకే వద్దాం… లాంచింగ్ రికార్డు రేటింగ్స్, వారం వారం దునియా వోట్లు అని సొల్లు గొప్పలే తప్ప ఈసారి బిగ్‌బాస్ షో ఓ పెద్ద ఫ్లాప్… కంటెస్టెంట్ల ఎంపిక, వాళ్ల పర్‌ఫామెన్స్ దగ్గర నుంచి రేటింగ్స్ దాకా మొత్తం ఢమాల్… పాపం, ఆమధ్య ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా… నాగార్జున ఒర్లుతూనే ఉన్నడు గానీ… దానికి ఫలితం మాత్రం లేదు, జస్ట్, 6.54 రేటింగ్స్ కొట్టేసి, చతికిలపడిపోయింది… హౌజులో సరుకు లేదు, బిగ్‌బాస్ టీం బుర్రల్లో గుజ్జు మిగల్లేదు సార్, ఫాఫం, మీరేం చేస్తారు..? *ప్రియ* భాషలో చెంప పగిలిపోద్ది అని ఎవరినీ బెదిరించలేరు కదా… అంతకుముందురోజు, శనివారం వీకెండ్ షో రేటింగ్స్ కూడా అయిదు దాటలేదు… ఇక వీక్ డేస్ అయితే మరీ ‘వీక్ డేస్’… 2.74, 2.54, 2.45, 2.44… అలా కొట్టుకుంటోంది గ్రాఫ్…
బిగ్‌బాస్ హౌజు నుంచి తరిమేయగానే అరియానా పట్టుకుంటుంది… ఏవేవో ప్రశ్నలు వేస్తుంది… ఆమెకు ఇంటర్వ్యూలు చేయడం రాదు… చూస్తుంటేనే తెలుస్తోంది… ఆ బిగ్‌బాస్ బజ్ అనే ఇంటర్ వ్యూలను దేకినోడే లేడు… రేటింగ్స్ జాబితాలో ఈ ప్రోగ్రాం ఎక్కడుందో వెతకడానికే బోలెడంత టైమ్ పట్టింది… అదీ ఆ షో దుర్గతి… సర్లెండి… అన్ని చానెళ్లలోనూ కలిపి, అత్యంత ఫ్లాప్ షోలు అనే అపకీర్తిని, అవమానాన్ని భరిస్తున్న ప్రోగ్రామ్స్ రెండు, అవి ఎవరు మీలో కోటీశ్వరులు? మాస్టర్ చెఫ్… గత వారం కూడా తమ ‘కీర్తిని’ కొనసాగించాయి, ఇంకాస్త దిగువకు జారిపోయాయి కూడా… మరీ ఎవరు మీలో కోటీశ్వరులు షో జూనియర్ ఎన్టీయార్ ఇమేజీని దారుణంగా దెబ్బతీస్తున్నట్టుంది… రెండురెండున్నర రేటింగ్స్ నడుమ కొట్టుకుంటోంది… ఇక ఆ షో అంతేసంగతులు, ఇక లేవదు… మాస్టర్ చెఫ్ అయితే పాచిపోయింది వంట… మరీ దారుణంగా 1.29 రేంజులో రేటింగ్స్… తమన్నాకు కాదు అవమానం, ఆ షో లీడ్ చేస్తున్న మొత్తం క్రియేటివ్ టీం సిగ్గుపడాలి… తాజాగా తమన్నాను తరిమేశారు కదా, అనసూయక్క వచ్చి చేరింది… ఇక మస్తు ఉద్దరిస్తుందేమో… ఫాఫం, జెమిని టీవీ…!! ఇదీ దాని దుర్గతి… మరీ ఘోరంగా సినిమా చానెళ్ల స్థాయికి దిగజారిపోయింది ఈసారి…
Share this Article