.
ఆడవాళ్లను ఆటకు వాడుకున్నాడని హౌజులోనే నిందించారు, ఆటలో అలా డిప్రెస్ చేయాలని చూశారు, కన్నడ కంటెస్టెంట్లతో గ్రూపు కట్టి, గ్రూపు గేమ్ ఆడుతున్నాడని విమర్శించారు, గ్రూపు చీల్చాలని చూశారు…
తెలుగు బిగ్‌బాస్‌లో ఈ కన్నడ పెత్తనం ఏమిటంటూ క్యాంపెయిన్ నడిపి, తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదం తీసుకొచ్చారు… తన వోట్లను మళ్లించారు… ఎన్ని చేసినా జనం అవన్నీ ఏమీ పట్టించుకోలేదు… సింపుల్‌గా ‘నిఖిల్ నువ్వే ఈసారి విజేతవు’ అని తేల్చిచెప్పారు… బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్ ట్రోఫీ చేతుల్లో పెట్టారు…
Ads
తనేమీ పల్లవి ప్రశాంత్‌లా, నేను రైతు బిడ్డను, నేను గెలిచే సొమ్మంతా రైతులకే వంటి మోసపు అబద్ధాలు చెప్పలేదు నిఖిల్… స్ట్రెయిట్ ఫార్వర్డ్… ఫస్ట్ నుంచి తన 100 శాతం ఎఫర్ట్ పెట్టాడు గేమ్సులో, టాస్కుల్లో, చాలెంజుల్లో… ఈ ట్రోఫీ గెలవడానికి అర్హుడు…
ఈసారి బిగ్‌బాస్ సీజన్ నిస్సారంగా, పేలవంగా సాగి ఉండవచ్చుగాక… కానీ ఉన్నంతలో చివరకు అర్హుడినే గెలిపించారు జనం… అబ్బే, బిగ్‌బాస్ గెలిపించాడు అంటారా..? పోనీ, బిగ్‌బాస్ టీమ్ అర్హుడినే గెలిపించింది..! కులం, మతం, భాష, ప్రాంతం వారీ వోటింగులేమీ లేవు… ఆటను చూసి వోట్లేశారు..!
రన్నరప్ గౌతమ్ మైనసులు… 1) నోటి దురుసు వ్యాఖ్యలు… 2) తోటి కంటెస్టెంట్ల పైపైకి వెళ్లడం… 3) క్రష్ అంటూనే, వాళ్లు తోసిపుచ్చితే అక్కా అని వెటకారపు పిలుపులు… 4) సోలో ఆట… 5) ఒక దశలో ఎవిక్షన్ అంచులో నిలబడి తృటిలో రక్షింపబడటం 6) తనది వైల్డ్ కార్డ్ ఎంట్రీ… ఇలా…
సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం, అల్లు అర్జున్ అరెస్టు వంటివి బలంగా పనిచేసి… ఈసారి విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు… గేమ్ చేంజర్ రాంచరణ్ వచ్చినా సాఫీగా, పద్ధతిగా సాగిపోయింది ఈసారి ఫినాలే…
కాకపోతే..? మూడు నాలుగు గంటలు ఫినాలే నడిపినా… ఈసారి పెద్దగా రంజింపచేయలేదు… ఆ గ్రూప్ డాన్సులు, పాటలు… చివరకు గీతామాధురి, కృష్ణ కచేరీ కూడా ఆకట్టుకోలేదు… యూఐ సినిమా కోసం ఉపేంద్ర వచ్చాడు… విడుదల ప్రమోషన్ కోసం విజయ్ సేతుపతి, మంజూ వారియర్ వచ్చారు… యూఐ టీజర్ కొత్తగా ఉంది…
డాకూ మహారాజ్‌లో చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ వచ్చింది గానీ… ఆ సినిమా గురించిన ముచ్చట్లేమీ లేవు… టీవీలో ఏమో గానీ, హాట్‌స్టార్‌లో ఫినాలే చూస్తున్న వారికి సిల్వర్ సూట్‌కేసు ఎపిసోడ్ ఏమీ కనిపించలేదు… పైగా నాగార్జున నబీల్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రస్తావన కూడా వచ్చింది… ముందే షూట్ చేసి, తీరా సమయానికి కట్ చేశారా..?
గోల్డెన్ సూట్‌కేసు ఎపిసోడ్ కూడా వేగంగా పూర్తయింది… నో డ్రామా… ఆడి గెలుస్తాం తప్ప, అందులో ఎంతున్నా మాకు అక్కర్లేదు అని గౌతమ్, నిఖిల్ చెప్పడంతో ఇక బేరాలకూ చాన్స్ లేకుండా పోయింది… రాంచరణ్ కూడా హుందాగా వ్యవహరించాడు తప్ప కించిత్ ఓవరాక్షన్ లేదు…
చివరగా… ఈసారి అవినాష్, రోహిణిలను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా తీసుకురాకపోతే… ఈమాత్రం రేటింగులు కూడా ఉండేవి కావు… వాళ్లు విజేతలు కాకపోవచ్చు… కానీ షో అల్టిమేట్ ఉద్దేశం వినోదాన్ని పండించగలరు..!!
ఇవి మునుపటి రోజులు కావు కదా… అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు… నిఖిల్ జస్ట్, అలా ఆ ట్రోఫీ తీసుకుని, కారులో సైలెంటుగా ఇంటికి వెళ్లిపోయాడు… గుడ్… ఈసారి పోలీసులు సరిగ్గా వ్యవహరించారు..!
Share this Article