.
నీ ఆట నువ్వు ఆడు…
ఈ వాక్యం పదే పదే నవ్వు తెప్పిస్తూ ఉంటుంది… బిగ్‌బాస్ హౌజ్‌కు సంబంధించిన ఫేమస్ డైలాగ్ ఇది… నిజంగానే ఎవరి ఆట వాళ్లు ఆడటం అనేది ఓ పెద్ద భ్రమపదార్థం…
Ads
హౌజులోకి వచ్చిన వెంటనే ఎలిమినేట్ అయిపోయిన ఆటమంతులు కూడా వెళ్లిపోయేటప్పుడు నాగార్జున పక్కన నిల్చుని హౌజ్ కంటెస్టెంట్లకు నీతులు చెప్పడం పెద్ద జోక్… అసలు సూచనలు, సలహాలు ఇచ్చే సీన్ వాళ్లకు ఉంటుందా..?
ఆడలేకనే కదా వెళ్లిపోతోంది… మరి ఆల్రెడీ హౌజులోనే ఉన్న పనిమంతులకు నీతిబోధలు దేనికి..? బిగ్‌బాస్ షోలో పెద్ద ప్రహసనం ఇదే… పైగా ఎవరెవరు ఎలాంటివాళ్లో ముద్రలు వేయమంటాడు నాగార్జున… తలవంచుకుని బయటికి వెళ్లిపోయేవాళ్లను వాళ్ల మానాన వాళ్లను వెళ్లనివ్వవచ్చు కదా…
అదేకాదు, బిగ్‌బాస్ బజ్ అని మరో దుకాణం అక్కడే రెడీగా ఉంటుంది… ఎలిమినేషన్ డ్రామా అయిపోగానే అందులోకి లాక్కెళ్లి, నువ్వలా, నువ్విలా, అందుకే కొట్టు కట్టేశావు, మూటాముల్లే సర్దేశావు, దీనికేమంటావు అనే తిక్క ప్రశ్నలు కొన్ని ఉంటాయి… అఫ్‌కోర్స్, బయటికి వచ్చాక చాలా యూట్యూబ్ చానెళ్లు అవే అడుగుతాయి… రెచ్చగొట్టి కంట్రవర్సీ స్టేట్‌మెంట్లు చెప్పించుకుని పబ్బం గడుపుకుంటాయి…
మళ్లీ ‘నీ ఆట నువ్వు ఆడు’ వాక్యం దగ్గరకొద్దాం… వెళ్లిపోయేవాళ్లు మాత్రమే కాదు… హౌజులోకి గెస్టులుగా వచ్చీపోయే ఫ్యామిలీ వీక్ కుటుంబసభ్యులు కూడా ఇప్పుడు అదే డైలాగ్ కొడుతున్నారు… వాడితో ఎందుకు..? నెగెటివ్ అవుతున్నావు..? ఆమెతో యవ్వారం ఏమిటి..? దూరం పెట్టు, లేకపోతే నీకే నెగెటివ్, అందుకే వోట్లు తగ్గాయ్, నీ ఆట నువ్వు ఆడు అని బోధలు…
క్రీజులో ఉన్నవాడికి తెలుస్తుంది ఏ బాల్ ఎలా ఆడాలో… అరెరె, లాంగాన్ లోకి గాకుండా స్ట్రెయిట్ డ్రైవ్ కొడితే బాగుండేది అని చెప్పొచ్చు… కానీ ఆడేవాడు ఆ క్షణంలో ఏ బాల్‌కు ఏ షాట్ ఎంచుకోవాలో వాడి బుర్ర డిక్టేట్ చేస్తుంది…
అదంతే…
బిగ్‌బాస్ కూడా అంతే… అది ఆట… లవ్వు ట్రాకులు, తొక్కాతోలూ ఉత్త డ్రామా… గ్రూపులు కట్టడం, ఒకరికొకరు సహకరించుకోవడం, తన్నుకోవడం, తిట్టుకోవడం, కిందామీదాపడి దొర్లడం, దూకుడుగా వెళ్లడం ఇవన్నీ ఆ ఆటగాడి తత్వాన్ని, ఆటతీరును చూపిస్తాయి… బిగ్‌బాస్ స్క్రిప్ట్ మేరకు ఆడే కేరక్టర్లూ ఉంటాయి…
ఎండ్ ఆఫ్ ది డే… ఎవరికీ ఎవరూ ఏమీ చెప్పనక్కర్లేదు… తను వ్యక్తిగతంగా ఎక్కువ రోజులు హౌజులో ఉండటానికి, నాలుగు డబ్బులు కమాయించడానికి, వీలయితే గెలిచి ప్రైజ్ మనీ గెలవడానికే హౌజులోకి వస్తారు… ఇంకెవరినో గెలిపించడానికో రారు, ఆడరు…
నిజానికి గేమ్స్, టాస్కులు మాత్రమే కాదు… ఎవరు ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు..? ఏ సందర్భంలో ఎలా స్పందిస్తున్నారు..? మెచ్యూరిటీ లెవల్స్ ఏమిటి..? మజ్జుగా ఓచోట కూర్చుండిపోతున్నారా..? పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారా..? సరదాగా కలిసిపోతున్నారా..? వంటి చాలా అంశాల్ని జనం గమనిస్తుంటారు… సో, అంత వీజీ కాదు..!!
Share this Article