ఒక సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయీ అంటే… ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయీ అంటే… దాన్ని ఏరకంగా విశ్లేషించుకోవాలి..? అక్కడి మానవసమూహం సంక్షుభితంగా ఉన్నట్టా..? అభివృద్ధిరాహిత్యంలో ఉన్నట్టా..? భద్రత, బతుకు సమస్యలు పెరిగిపోయినట్టా..? మరి వాటికి ప్రధాన కారణాలు ఏమిటి…? ఇవి కొన్ని చిక్కు ప్రశ్నలు…
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఎప్పటిలాగే 2021 సంవత్సరానికి ఆత్మహత్యల సంఖ్యను క్రోడీకరించింది… చిన్న జిల్లాలతో సమానంగా ఉండే సిక్కిం, అండమాన్, పుదుచ్చేరిలను వదిలేస్తే… కేరళ, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి… అక్షరాస్యత, ఇతర జీవన నాణ్యత సూచికల్లో ముందంజలో ఉండే కేరళలో మొదటి నుంచీ ఆత్మహత్యలు ఎక్కువే… ఎవరికీ అంతుపట్టని సమస్య అది… ఇప్పుడు తెలంగాణ దాంతో పోటీపడింది…
మనకు పైనే ఉండే చత్తీస్‌గఢ్ కూడా దాదాపు ఇదే స్థాయిలో ఆత్మహత్యల్ని చూస్తోంది… అసలేం జరుగుతోంది..? దేశంలో లక్ష జనాభాకు సగటున 12 ఆత్మహత్యలు నమోదు అవుతుంటే… కేరళ, తెలంగాణల్లో అది 26.9 శాతం… మనం పేరుకు జబ్బలు చరుచుకోవడమే… పోరాటశీలత ఎక్కువ, చైతన్యసమాజం, సమస్య వస్తే ఎదుర్కుంటాం వంటి గొప్పలన్నీ అబద్ధాలేనా..? ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆత్మహత్యలు, ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆత్మహత్యలేనా..?
Ads
ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి… దేశంలో అత్యంత తక్కువ ఆత్మహత్యల రేటు ఎక్కడో తెలుసా..? బీహార్..! అసలు లేనట్టే లెక్క…!! మనం బీమారు రాష్ట్రం అంటుంటాం, ఏ లెక్కల్లో చూసినా అది ప్రగతి చార్టుల్లో దిగువన కనిపిస్తుంటుంది… కానీ అక్కడి జనానికి బతకడం ఎలాగో తెలుసు… బతుకు విలువ తెలుసు… ఈరోజు దేశంలో ఏ మూలకు వెళ్లినా బీహార్ వలసకూలీ కనిపిస్తాడు… లక్షల కుటుంబాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోయి బతికేస్తాయి… హేట్సాఫ్…
ఈసారి క్రైం రికార్డ్స్ బ్యూరో ఓ ఆశ్చర్యకరమైన ట్రెండ్‌ను పట్టి ఇచ్చింది… మొదట నమ్మశక్యం కాలేదు… అంకెలు అలా ఉన్నాయి… రైతులకన్నా దేశంలో వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు… నష్టాలపాలైనా, కష్టాలు అలవాటై రైతులు ఎలాగోలా పల్లెల్లో బతికేస్తున్నారు, కానీ వ్యాపారులు చితికిపోతే… ఇక ‘చితికే’ పోతున్నారు… ఒక్కసారి ఈ చార్టులు చూడండి… బిజినెస్ స్టాండర్డ్ కవర్ చేసింది…
2015 గణాంకాలు ఓసారి చూస్తే… 12,600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, 8700 మంది వ్యాపారులు ప్రాణాలు తీసుకున్నారు… 2021కు వచ్చేసరికి రివర్స్… 10800 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, వ్యాపారరంగంలో 12 వేల మంది ప్రాణాలు చేజేతులా తీసుకున్నారు… ఈ ధోరణి విస్తుపరుస్తోంది… నిజమే… కరోనా సంక్షోభం తరువాత లక్షల చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి… అప్పుల పాలయ్యారు… ఆదుకునే ప్రభుత్వం లేదు… ఒక రైతు తన బాధల్ని పంచుకుంటాడు… కానీ వ్యాపారి తనలోతనే కుమిలిపోతాడు, అది మరింత కుంగదీస్తుంది… పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో జీవనవ్యయం అధికం… తప్పించుకోలేని సోషల్ ఖర్చులు… వెరసి మరింతగా ఊబిలోకి… డొల్ల స్నేహాలు, ఫేక్ వెల్‌విషర్స్… టైం దొరికితే ముంచే, మోసగించే సెక్షనే చుట్టూ…!!
అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు… సమాజంలో తలెత్తుకోలేని దౌర్భాగ్యం… ఇదేనా కారణం..? 2020, 2021 అంకెలు చేసి ఆ నిర్ధారణకు రాలేం… ఇంకా లోతుల్లోకి వెళ్లాల్సిందే… కొద్దికొద్దిగా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి… సొల్యూషన్స్ వెతకాలి… వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు… మనిషిని కాపాడుకోవాలి… అభివృద్ధి చెందినట్టు చెప్పుకునే జపాన్ వంటి దేశాల్లోనే ఆత్మహత్యల నిరోధం, చైతన్యం సాధ్యం కావడం లేదు, మరి మనమేం చేయగలం అనే నిస్పృహ అక్కర్లేదు… దురదృష్టం కొద్దీ సున్నితత్వం లేని ప్రభుత్వాలు మనవి కాబట్టి తోటి సమాజమే పూనుకోవాలి… అంతే..!!
Share this Article