నిజమే… చాన్నాళ్ల తరువాత ఒక పుస్తకాన్ని వేగంగా చదివేయడం ఇదే… ఎందుకు..? అది రేఖ జీవితానికి సంబంధించింది కావడం… ఆమె భారతీయ సౌందర్య ప్రతీక… యాభై, అరవైలలోని లక్షలమందికి ఈరోజుకూ ఆమె అంటే ఆరాధన… అప్పట్లో కోట్ల మందికి ఆమె కలలనాయిక… అంతేనా..? కాదు, ఆమె జీవితం ఓ సినిమా కథను మించి ఎన్నోరెట్లు అబ్బురం కాబట్టి… ఆమె గతాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అలా పుస్తకాన్ని వేగంగా చదివేలా చేసింది…
నిజానికి ఏడెనిమిదేళ్లుగా రేఖ బయట కనిపించింది చాలా చాలా తక్కువ… తన ఇల్లు, తను, తన లోకం… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏకాంతవాసమే… తనలో తను… తన చుట్టూ తను… జస్ట్, 6 శాతం హాజరీతో అప్పుడప్పుడూ రాజ్యసభలో కనిపించేది… మాట్లాడేది లేదు, ఆమెకు రాజకీయాలతో పనే లేదు, నామినేట్ చేశారు, వచ్చింది, కూర్చుంది… అంతే… ఆమధ్య ఇండియన్ ఐడల్ షోలో తళుక్కుమని మెరిసి భలే హంగామా చేసింది… మన సింగర్ షణ్ముఖ ప్రియతో కలిసి, ఈ 69 ఏళ్ల వయస్సులోనూ సరదా డాన్స్ చేసింది… ఆమె ఆహార్యం మార్క్ పట్టుచీర, మల్లెపూలు, ఆ పూలదండలా మెరిసే మెడహారం…
Ads
కానీ ఒకప్పుడు..? రేఖ అంటే ఓ వెలుగు… మోహంతో కాల్చేసే వెలుగు… ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, కేలండర్లు,, ముఖచిత్రాలు… ఆమె అంటేనే ఓ ఆకర్షణ… రకరకాలుగా..! ఆమె జీవితాన్ని ఆవిష్కరించిన ‘స్వయంసిద్ధ’ అనే ఆ పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి పెంచింది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ సమీక్ష కూడా… నిజానికి మన పత్రికల్లో పుస్తకసమీక్షల నిడివి నాలుగైదు వాక్యాలు… మరీ సంచలన పుస్తకాలైతే వార్తలుగా అందులోని కాస్త కంటెంట్ ప్రచురించడం… కానీ ఈ సమీక్ష దాదాపు హాఫ్ పేజీ… అసాధారణమైన నిడివి… ఆమె జీవితంలాగే…
ఐతే ఆ రివ్యూ మొత్తం రేఖ- అమితాబ్ చుట్టే తిరిగింది… ఒక్క వాక్యం కూడా భిన్నంగా లేదు… అంటే ఆ పుస్తకం మొత్తం రేఖ- అమితాబ్ ప్రణయ గాథేనా..? అసలు అమితాబ్ లేకుండా రేఖ జీవితమే లేదా..? రేఖ జీవితం తాలూకు వెలుగునీడల్లో అమితాబ్ ఉనికి ఎంత..? అమితాబ్ లేని ఆమె జీవితం బోలెడంత… అసలు ఆమె సినిమా కథలో అమితాబ్ హీరో కాదు, జస్ట్, ఓ పాత్ర… తనను ఆమెతో ముడివేసి టన్నులకొద్దీ వార్తలు, గాసిప్స్, స్టోరీలు రాసీ రాసీ మీడియాకే అలుపొచ్చింది తప్ప… ఎన్నెన్నో రంగులు పూశారు తప్ప, అదొక నిస్సారమైన ప్రేమకథ…
ఆమె కథలో ఎన్నో దరిచేరని ప్రణయాలున్నయ్… ఓ విఫల వివాహం కూడా ఉంది… రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలున్నయ్… కావచ్చు, అమితాబ్‌ను ఆమె గాఢంగానే ప్రేమించి ఉండవచ్చు… ఏమో, ప్రణయాన్ని మించిన దైహిక బంధమూ ఉండవచ్చు… కానీ ఆమె జీవితపుస్తకంలో ఆ ప్రణయగాథ ఓ శుష్క అధ్యాయం మాత్రమే… చివరికి మీడియా ఊహాగానాలు ఎక్కడివరకూ అంటే… జయలలిత- శశికళ సంబంధంలాగే… రేఖకూ తన సెక్రెటరీ ఫర్జానాకు నడుమ బోలెడంత ఊహాగానాన్ని రంగరించి, ఏకంగా వాళ్ల నడుమ లైంగిక బంధాన్ని కూడా అంటగట్టేశారు… అమితాబ్‌లా జుట్టు, బట్టలు వేయించి, అమితాబే అనుకుంటూ ఆమెను ప్రేమించేదట…
పతి పత్ని ఔర్ వో… ఈ ‘ఔర్ వో’ పాత్రలే అధికం ఆమె నట జీవితంలో కూడా… లేదంటే వేశ్యపాత్రలు… వివాహేతర సంబంధాలు, విచ్చలవిడి లైంగిక ధోరణుల పాత్రలే ఆమెను వరించేవి… ఏమో, ఆమే ఆ పాత్రలను ఇష్టపడేదేమో… ఆమెను స్వేచ్ఛాసంభోగాలకు ఓ ప్రతీకగా చిత్రించారు, ఆమె దానికీ బాధ పడలేదు… ఎందుకు..? ఆమె బతుకంతా అదే కదా… తల్లి పుష్పవల్లి ఓ నటి… ఆమె చుట్టూ అనేక అసహజ వివాహేతర బంధాలు… తండ్రి జెమినీ గణేశన్… తన బతుకంతా అదే కదా… అనేకానేక సంబంధాల ఉత్తమ పురుష్… రేఖ పుట్టుకే ఓ అక్రమ సంబంధం ఉత్పత్తి… ఆ ఆత్మన్యూనత నుంచే ఆమెలో ఆ అరాచక ధోరణి పుట్టుకొచ్చిందా..? అలా ఒళ్లు విరుచుకుని తలెగరేసేదా..?
పద్నాలుగేళ్లకే ముంబై చేరి, తెలిసీతెలియని నటనను వృత్తిగా తీసుకుంది… ఆడదాన్ని అంగడి సరుకుగా మాత్రమే భావించే బాలీవుడ్ కూడా ఆమెను చిన్నప్పటి నుంచే వాడుకుంది… కమర్షియల్‌గా, లైంగికంగా… ఆమె శరీరఛాయ, మొరటు మొహం, పెద్ద నడుం గట్రా ఆమె ఆస్తులు… దాంతో వెక్కిరింతలు, అవమానాలు, పరాభవాలు… ఐనా ఆ మోటు రూపంతోనే బోలెడన్ని సినిమాలు చేసింది… మెల్లిమెల్లిగా రాటుదేలింది… రకరకాల గాసిప్స్ తనే అందిస్తూ, తన ప్రణయ యవ్వారాల్నే ప్రచారం చేసుకుంటూ ఎప్పుడూ మీడియాలో కనిపించేది… మీడియాతో, సినిమాతో కావాలనే నవ్వుతూ ఆడుకుంది…
సౌందర్యాన్ని రకరకాల పద్ధతుల్లో పెంచుకుంది, అనగా మెరుగుపెట్టుకుంది.., ప్రదర్శించుకుంది… కానీ సినిమా బంధాల డొల్లతనం అర్థమయ్యేకొద్దీ తనలో తను ముడుచుకుపోయింది… అనేక నైరాశ్యాల నుంచి, ఆశాభంగాల నుంచి వైరాగ్యం కూడా ఆవరించిందేమో ఏకాంతాన్ని ఆశ్రయించింది… అనేకానేక ఆటుపోట్ల నడుమ క్రమంలో ఆమె తనను తను కోల్పోయింది… ఓ స్థిరమైన సాంత్వన ఆమెకు లభించలేదు… స్థిరమైన బంధం ఏదీ జీవితంలో ఏర్పడలేదు… నేనున్నాను అనే భరోసా ఏదీ ఆమె భుజం తట్టలేదు… చివరకు ఆమె పోషించిన అనేక పాత్రల్లాగే జస్ట్ ‘‘ఔర్ వో’’లాగే ఉండిపోయింది…
ఈ పుస్తకం వీలైనంతవరకూ రేఖను ఓ బాధితురాలిగా చిత్రించే ప్రయత్నం చేసింది… అదేదో పత్రిక రివ్యూలో చిత్రించినట్టు మొత్తం అమితాబ్‌తో బంధమే ఈ పుస్తకం కాదు… 220 పేజీల సుదీర్ఘ కథలో అసలు 120వ పేజీ దాకా అమితాబ్ లేడు, రాడు… కాకపోతే రచన సినిమా స్టోరీల శైలిలో లేకుండా ఉండాల్సింది… ఇలాంటి జీవితకథల్ని రచయిత తన వెర్షన్‌తోనే నడిపించాలి… ఎలాగూ చివరలో రకరకాల రెఫరెన్సులు రాస్తాం కాబట్టి సరిపోతుంది… చివరగా… నాలాంటి పాఠకుడికి దీని ధర కాస్త ఎక్కువే… కానీ ఆమెను ఈరోజుకూ ఆరాధించే వారి సంఖ్య బోలెడు మంది… వాళ్లకు ఈ రేటు పెద్ద లెక్కే కాదు… ప్రతులకు ఇదుగో… Jyothi Valaboju, 8096310140… jyothivalaboju@gmail.com
Share this Article