21 ఏళ్ల వయస్సులో లక్నో లోని ఓ జాతీయ థియేటర్ ఫెస్టివల్ లో అతనిచ్చిన మిమిక్రీ ప్రదర్శన… అతన్ని రా ఏజెంట్ ని చేసింది. అయితే దాన్ని ఎదుగుదల అనేకంటే… దేశ ప్రజలను కాపాడే సైనికులకు రక్షణగా అతను ఛాలెంజింగ్ గా చేపట్టిన ఓ గురుతర బాధ్యత అంటేనే సమంజసం! కానీ, దేశం కాని దేశంలో, అదీ భారత్ అనగానే కసికసిగా కదిలే ఆ శత్రు దేశంలో ఆ త్యాగమూర్తి రహస్యం బహిరంగమైపోయి.. జైలు ఊచలు లెక్కిస్తుంటే.. చివరాఖరకు అనారోగ్యంతో ప్రాణాలు విడిస్తే.. మన భారత ప్రభుత్వాలు ప్రదర్శించిన నిస్సహాయత అదే స్థాయిలో కడు దురదృష్టకరం. ఓ రా ఏజెంట్ గా.. అతడు దేశం కోసం చేసిన త్యాగానికి.. మన ప్రభుత్వాలు ఏమివ్వగలిగాయి..? ఏమీ లేదు… ఏమీ చేయలేదు… చేసే సిట్యుయేషన్లు ఉండవు… ఏ దేశమైనా సరే గూఢచారుల్ని వివిధ దేశాల్లో పనిచేయడానికి పంపిస్తాయి… ఆ గూఢ బాణాల ప్రాణాలు దైవాధీనాలు… కర్తవ్యనిర్వహణలో బాణం మధ్యలోనే విరిగిపడినా, పట్టుబడినా ‘‘అంతర్జాతీయ వేదిక’’ మీద ‘‘మావాడే’’ అని అంగీకరించలేని అనివార్యత తప్పదు… దాయాది దేశమైన పాకిస్థాన్ కు వెళ్లి… అక్కడి ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగి, మాతృదేశానికి రహస్యాలనందించే గూఢచారి రవీంద్ర కౌషిక్ కథే ఇది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆయన బయోపిక్ చేయబోతున్న తరుణంలో… ఓసారి ఆ వీరుడి త్యాగాన్ని, సాహసాన్ని, వృత్తి నైపుణ్యాన్ని స్మరించుకుందాం…
బ్లాక్ టైగర్… ఇదీ రవీంద్ర కౌషిక్ కు ఇందిరాగాంధీ పెట్టిన పేరు. రా ఉత్తమ ఏజెంట్లలో ఒకడిగా భారతదేశానికి ఆయన అందించిన సేవలకుగాను.. ఓ సాహస ప్రధాని నుంచి ఆయనకు దక్కిన గుర్తింపు. అయితే విషాదమేంటంటే… ఆయన్ను రా ఏజెంట్ గా పాక్ కు పంపి… ఆయన సేవలను పొందిన భారత ప్రభుత్వం ఆ తర్వాత ఆయన గురించి అంతగా పట్టించుకోలేదు. “క్యా భారత్ జైసే బడే దేశ్ కే లియే ఖుర్బానీ దేనే వాలోన్ కో యహీ మిల్తా హై?” అంటూ… జైలులో అనారోగ్యం పాలైన తన చివరాఖరి రోజుల్లో రవీంద్ర కౌషిక్ వాళ్ల కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్న ఈ విషయమే భారత ప్రభుత్వాలు ఓ త్యాగమూర్తి పట్ల కనబర్చిన నిర్లక్ష్యం, నిస్సహాయతకు పరాకాష్ఠ! తన జీవితంలో అత్యంత ఎక్కువ కాలం 16 ఏళ్లు గడిపిన పాకిస్థాన్ పంజాబ్ లోని సెంట్రల్ మియాన్ వలీ జైల్ నుంచి రవీంద్ర ఈ ఆవేదనా భరితమైన లేఖ రాశారు.
Ads
రవీంద్ర కేవలం తన 23 ఏళ్ల వయస్సులోనే… భారతదేశ విదేశీ గూఢచార సంస్థైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)తో అనుబంధాన్ని ప్రారంభించాడు. అలా మెల్లిగా పాకిస్థాన్ సైన్యంలో చేరి… మేజర్ స్థాయికి ఎదిగారు. సరిహద్దులకటువైపు నుంచి రవీంద్ర అందించిన సున్నితమైన సమాచారం.. నాడు దేశానికి చేకూర్చిన మేలెంతో! 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత అతను దేశానికి చేసిన విలువైన సేవలకు గుర్తింపుగానే రవీంద్రను ప్రధాని ఇందిరా గాంధీ ‘బ్లాక్ టైగర్’ అని సంబోధించారు. 2008లో అమీర్, 2011లో నో వన్ కిల్డ్ జెస్సికా వంటి సినిమాలను నిర్మించి విమర్శలకుల ప్రశంసలు పొందిన రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో… ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా రా ఏజెంట్ రవీంద్ర బయోపిక్ తెరకెక్కబోతున్న తరుణంలో… ఇప్పుడా రహస్య గూఢచారి కథ మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.
భారతదేశ గొప్ప రహస్య గూఢచారిగా గుర్తింపు పొందిన రవీంద్ర కౌషిక్ జీవితం మాత్రం అత్యంత విషాదంగా ముగియడం దురదృష్టకరం… 1952, ఏప్రిల్ 11న భారత్-పాక్ సరిహద్దులో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో పుట్టిన రవీంద్ర… 1965 నుంచి 1971 వరకూ జరిగిన ఇండో-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో పెరిగాడు. ఎస్.డీ. బిహానీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో.. నాటకాలు, మిమిక్రీ వంటి కళల్లో రవీంద్ర చురుకుగా పాల్గొనేవాడు. అలా 21 ఏళ్ల వయస్సులో లక్నోలో ఆయన ఇచ్చిన మిమిక్రీ ప్రదర్శనే అక్కడికొచ్చిన ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ దృష్టినాకర్షించింది. ఎందుకంటే చైనాకు సమాచారమివ్వడానికి నిరాకరించిన ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను ఇమిటేట్ చేస్తూ చేసిన మిమిక్రీ ప్రదర్శన అది! 1973లో బికామ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. రవీంద్ర కొత్త ఉద్యోగం కోసం ఢిల్లీ బాట పట్టాడు.
అప్పటికే ఇంటలిజెన్స్ అధికారుల ద్వారా RAWకు అతణి గురించి తెలవడంతో… వారతణ్ని రా ఏజెంట్ గా పనిచేయడానికి మాట్లాడి ఒప్పించారు. అలా రెండేళ్ల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న రవీంద్ర.. పంజాబీలో అనర్గళంగా మాట్లాడుతుండగా.. అతనికి ఉర్దూ కూడా బోధించారు. ఇస్లామిక్ గ్రంథాలు, వారి ఆచార, వ్యవహారాలనూ అతడికి నూరిపోశారు. రెసిడెంట్ ఏజెంట్ గా ఎలా నిగూఢంగా బతకాలో నేర్పారు. అంతేకాదు.. ఇస్లామిక్ మత సిద్ధాంతాల ప్రకారం రవీంద్ర సున్తీ కూడా చేయించుకున్నాడు. ఇంకేం 1975 నాటికి రవీంద్ర భారతీయ రికార్డులన్నీ మాయమయ్యాయి. ఎందుకంటే అప్పటికే రవీంద్ర పాకిస్థాన్ కు చేరుకోవడం.. ఇస్లామాబాద్ నివాసిగా నబీ అహ్మద్ షకీర్ అనే మారుపేరుతో.. నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం.. అంతా RAW అధికారులు అనుకున్నదనుకున్నట్టుగానే చకచకా జరిగిపోయాయి. అక్కడే కరాచీ యూనివర్సిటీ నుంచే రవీంద్ర.. ఉరఫ్ నబీ అహ్మద్ షకీర్ గా తన లా ప్రాక్టీస్ కూడా పూర్తి చేశాడు. అలా మెల్లిగా పాకిస్థాన్ ఆర్మీలో మొదట మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో.. కమీషన్డ్ ఆఫీసర్ పోస్టులో చేరాడు. ఆ తర్వాత మేజర్ స్థాయికి ఎదిగాడు.
ఒకవైపు పాకిస్థాన్‌లో మంచి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంటూనే… మరోవైపు మాతృదేశానికి 1979-1983 మధ్యకాలంలో భారత రక్షణ అధికారులకు రహస్య సమాచారాన్ని అందిస్తూ గూఢచారిగా ఎనలేని సేవ చేయడమంటే నిజంగా కత్తిమీద సామే! అప్పటికే దాయాది దేశాల మధ్య పెరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో… దేశానికి కీలకమైన సమాచారంతో పలు ప్రయోజాలను చేకూర్చాడు రవీంద్ర. అక్కడే ఆర్మీ యూనిట్‌లోని ఓ టైలర్ కుమార్తె అమానత్ అనే స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రవీంద్రకు ఒక కొడుకు ఉన్నట్టు కొందరు చెబితే.. కొన్ని నివేదికలు మాత్రం కూతురున్నట్టుగా వెల్లడించాయి. కానీ 1983లో రవీంద్ర ఎనిమిదేళ్ల పాటు రహస్య ఏజెంట్ గా ఉన్న విషయం తేటతెల్లమైపోయింది. రవీంద్రకు సహకారమందించేందుకు RAW అధికారులు పంపిన మరో రహస్య ఏజెంటైన ఇన్యత్ మసిహా పాక్ దళాలకు పట్టుబడటం… పాక్ దళాల విచారణలో ఇన్యత్ మసిహా రవీంద్ర రా ఏజెంటని వెల్లడించడంతో.. రవీంద్ర కౌషిక్ కూడా ఓ రహస్య గూఢచారి అనే విషయం బట్టబయలైపోయింది.
ఇంకేం, అసలే భారత్ అంటేనే రుసరుసలాడే పాక్ చేతికి ఓ రహస్య గూఢచారి చిక్కితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాలా…? అదే పరిస్థితిని రవీంద్ర ఎదుర్కొన్నాడు. పాక్ సైనిక అధికారులు పెట్టే చిత్రహింసలను రెండేళ్లపాటు భరించకతప్పని పరిస్థితి! అయితే రవీంద్రను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి.. మసీహతో కబురు పంపి… ఓ పార్క్ లో మసీహతో కలిసే క్రమంలో రవీంద్రను పట్టుకున్నారు పాక్ అధికారులు. 1985లో పాకిస్తాన్ సుప్రీం కోర్ట్.. రవీంద్రకు మరణశిక్ష విధించింది. అయితే ఆ తర్వాతది జీవిత ఖైదుగా మార్చేశారు. అతను సియాల్‌కోట్, కోట్ లఖ్‌పత్, మియాన్‌వాలితో సహా.. పలు జైళ్లలో మగ్గాడు. అయినప్పటికీ ఓ రహస్య ఏజెంట్ గా పనిచేసిన అనుభవంతో… రవీంద్ర తన కుటుంబానికి కనీసం అరడజను లేఖలను రహస్యంగా రాశాడు.
2001లో ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడేందుకు మూడు రోజుల ముందు… తాను ఓ అమెరికన్ అయ్యుంటే కేవలం మూడురోజుల్లో బయటపడేవాణ్నంటూ… తను చూపిన కృతజ్ఞతకు… ఇక్కడి యంత్రాంగం నిర్లక్ష్యవైఖరి, నిస్సహాయత, కృతఘ్నతను ఎత్తిపొడిచేలా రాసిన లేఖ ఆఖరి రోజుల్లో ఆయనెంత బాధపడ్డాడో చెబుతుంది. చివరకు ముల్తాన్ జైలులో ఖననం చేయబడ్డ రవీంద్ర మరణవార్త వినగానే… రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారైన ఆయని తండ్రి కూడా గుండె పగిలి చనిపోయిన ఘటన భారతదేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం. ఎందుకంటే రవీంద్ర తల్లి అమలాదేవితో పాటు… సోదరుడు రాజేశ్వరనాథ్ రవీంద్ర విడుదలకు సాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి అనేక లేఖలు రాసినా.. వారాశించిన స్పందన లేకపోవడం ఆ కుటుంబాన్ని నిరాశకు గురిచేసింది. నిశ్ఛేష్ఠులను చేసింది.
రవీంద్ర రా ఏజెంట్ అనే విషయం బహిర్గతం కాకుండా ఉంటే… తన కొడుకు కౌశిక్ పాకిస్తాన్ ప్రభుత్వంలో సీనియర్ ఆర్మీ అధికారిగా ఉండేవాడని… అప్పటి ప్రధాని వాజ్‌పేయికి రవీంద్ర తల్లి అమలాదేవి రాసిన లేఖలో పేర్కొంది. తన రహస్య గూఢచార సేవలతో దేశంలో సుమారు 20 వేల మంది సైనికులను కాపాడిన ఓ త్యాగమూర్తి జైలులో గడుపుతున్న మరణ గడియల్లో ప్రభుత్వం ఎలాంటి సాయమందించకపోవడం, కనీసం మందులు కూడా పంపకపోవడం వంటివాటిపై రవీంద్ర కుటుంబీకులు బాహాటంగానే బాధను వ్యక్తం చేశారు. కానీ, గూఢచారుల జీవితాలు అంటేనే అంత… అయితే గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్ సినిమాకు కూడా రవీంద్ర జీవితచరిత్రతో పోలికలున్నాయనే విషయంపై కూడా చర్చ జరిగిన క్రమంలో… ఇప్పుడేకంగా రవీంద్ర కౌషిక్ బయోపిక్ తోనే మరోసారి సల్మాన్ నేరుగా స్క్రీన్ ముందుకు రాబోవడంతో.. దాన్ని రాజ్ కుమార్ గుప్తా ఎలా తెరకెక్కిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైతేనేం… మరో అన్ సంగ్ హీరో జీవితం తెరకెక్కి… ఆయన బతుకుచిత్రం వెనుక ఎలాంటి విషాదముందో.. దాన్ని అదే స్థాయిలో ప్రతిబింబించాలని.. రవీంద్ర కౌషిక్ వంటి రియల్ హీరోస్ గురించి మరిందరికి తెలపాలని ఆశిద్దాం…… By… రమణ కొంటికర్ల
Share this Article