ఇక అంత్యక్రియలు అంతమవుతాయా? మళ్లీ బతికించడం కోసం బాడీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు!
చావంటే భయం నటిస్తాం కానీ…నిజానికి మనకు చావంటే చాలా ఇష్టం.
కొంచెం పని పెరగగానే మనకు చచ్చేంత పనిగా మారిపోతుంది.
నిజానికి చచ్చేప్పుడు ఎవరూ పని పెట్టుకోరు – చచ్చే పని తప్ప.
ఏ మాత్రం ఇబ్బందిగా ఉన్నా చచ్చే చావొస్తుంది.
పసిపిల్లలు అల్లరి చేస్తుంటే చంపేస్తున్నార్రా అనకపోతే బతుకు సాగదు .
చచ్చేట్టు తిడితేనే తిట్టినట్లు.
కొందరు పెళ్ళిలో, చావులో మాత్రమే కలుస్తూ ఉంటారు.
శుభమా అని సుబ్బి పెళ్లి పీటలు ఎక్కితే ఆమె చావుకే వస్తుంది.
కొడితే చచ్చేట్టు కొట్టాలి. చావు కబురు ఎప్పుడూ చల్లగానే చెప్పాలి.
పెళ్ళికి చావుకు ఒకే మంత్రం ఎక్కడ చెబుతారోనని ఆందోళన.
రాచపీనుగ ఒంటరిగా వెళ్లలేక తోడుకోరుకున్నా మనం అర్థం చేసుకోగలం.
కోపమొస్తే చచ్చినా ఇక పగవాడి మొహం చూడం. పైగా వారికే చచ్చినా నీ గడప తొక్కను అని బతికితికున్న గర్వంతో చెప్పగలం.
చాలామంది మనల్ను రోజూ చంపుకు తింటున్నా ఎలాగో మళ్లీ మళ్లీ బతుకుతూ ఉంటాం.
బాగా కోపమొస్తే బతికి ఉన్న వారిని ఒరేయ్ పీనుగా! అంటూ చంపేస్తాం.
ఒట్టి పీనుగకు విలువ లేదనుకుంటే చవట పీనుగ, ముదనష్టపు పీనుగ అని విశేషణాలు జతచేస్తాం.
జాగారంలో శవజాగారం ఒకటి.
పీనుగ ఎదురొస్తే అదృష్టమే అదృష్టమట.
Ads
ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ చావు పాండిత్యం ఎందుకు?
ప్రాణం ఉంటే శివం – ప్రాణం లేకుంటే శవం.
“మృతియె లేకున్న రుచి ఏది ఇలలోన?” అన్నాడు దాశరథి .
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్! అన్నారు సినీ కవులు.
“మరణాంతాని వైరాని…”- చచ్చాక పగలు ప్రతీకారాలు కూడా చచ్చి పోవాలి అని హితవు చెప్పాడు శ్రీరామచంద్రుడు.
సమయం ఆసన్నమయినప్పుడు పండిన దోసకాయ తీగనుండి టక్కుమని తనకు తానుగా విడివడినట్టు బంధాలను తెంచుకుని మృత్యువులోకి వెళ్లాలంటుంది మృత్యుంజయ మంత్రం. చాలామంది చావును జయించడానికే ఈ మంత్రం అనుకుని చచ్చేట్టుగా చదువుతుంటారు. నిజానికి ఇది చావు భయాన్ని మాత్రమే జయించే మంత్రం.
యముడు కలలో కూడా నిషిద్ధం. చావులేని జగతిని ఒక్క సారి ఊహించుకోండి. దుర్భరంగా ఉంటుంది. అసలు ఈ లోకం పేరే మర్త్య లోకం . వ్యాకరణం, అర్థం తెలియదు కాబట్టి ధైర్యంగా ఉంటాం. మృత్యువును వెంటబెట్టుకుని పుట్టే లోకాన్ని మర్త్య లోకం అంటారు.
“అంతములేని ఈ భువనమంతయు…”- అంటూ ఎంతటివారయినా ఈ భూమి మీద పోవాల్సిందే అన్నాడు దువ్వూరి రామిరెడ్డి . భూమి ఒక బాట. పొద్దున, సాయంత్రం ఈ బాటకు అటు ఇటు తలుపులు. ఆ తలుపులో వచ్చి , ఈ తలుపుగుండా వెళ్లిపోవాల్సిన వాళ్లమే.
మరణానికి భయపడకుండా మరణాన్ని ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడారు సి నా రె.
మరణం నా చివరి చరణం కాదన్నాడు అలిశెట్టి ప్రభాకర్.
“మృత్యువుకు నేనంటే భయం. నేనున్నప్పుడు అది నాముందుకు రాదు.
అది వచ్చినప్పుడు నేను ఉండనే ఉండను”- అని ఒక ధైర్యవంతుడు కొంటెగా అన్నా మృత్యువుకు లొంగిపోయేవాడినే అని చెప్పకనే చెప్పుకున్నాడు.
వాడుక మాటల్లో చావు గురించి ఎన్ని ఎగతాళి మాటలు ఎన్నయినా ఉండవచ్చు.
కానీ చావు ఎగతాళి కాదు.
చావు- చచ్చేంత సీరియస్.
చచ్చాక అంత్యక్రియలు అనాదిగా ఒక సంస్కారం. పెళ్లికి వెళ్లకపోయినా పరవాలేదు కానీ…అంత్యక్రియలకు మాత్రం వెళ్లి తీరాలి అనుకునేవారు ఇప్పటికీ ఉన్నారు. కడసారి చూపు; తుది వీడ్కోలు, అంతిమ సంస్కారం అంత విలువైనవి. శవానికి దహన సంస్కారం; శవాన్ని భూమిలో పాతిపెట్టడం రెండే పద్ధతులు. చూడబోతే భవిష్యత్తులో అంతిమ సంస్కారాలే అదృశ్యమైపోయేలా ఉన్నాయి. అంటే మనకు కనీసం ఆ సంస్కారం కూడా ఉండదని అనుకోకండి.
ప్రాణంలేని శవంలోకి ఏదో ఒకనాడు తిరిగి ప్రాణాన్ని పోసే సాంకేతిక వస్తుందని;
అంతదాకా శవం పాడుకాకుండా భద్రపరచగలిగితే చాలని;
దశాబ్దాలు, శతాబ్దాలు శవం పాడుకాకుండా తాజాగా నిగనిగలాడేలా ఉంచే అత్యాధునిక శవపేటికలు(లోపల అతిశీతల గాజు పొర, పైన స్టీల్ పొరతో చేసినవి) తయారు చేశామని…
కొన్ని కంపెనీలు చెబితే నమ్మి ఇప్పటికే అయిదువేలకు పైగా శవాలను ఈ పెట్టెల్లో నమ్మకంగా భద్రపరుచుకున్నారు. ఇందులో కొన్ని పెంపుడు జంతువుల శవాలు కూడా ఉన్నాయి.
చనిపోయిన వెంటనే క్షణం ఆలస్యం కాకుండా వీరికి చెబితే…వీరు ప్రత్యేక పరికరాలతో రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతారట. ప్రత్యేకపద్ధతిలో శవాన్ని శుభ్రం చేసి, తీసుకెళ్లి తమ బాడీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లో తలకిందులుగా గాజు క్యూబ్ లో వేలాడదీసి…రోజూ పొద్దునా సాయంత్రం శవం తాజాదనాన్ని స్టాండర్డ్ పారామీటర్లతో చెక్ చేస్తూ…ఎప్పటికప్పుడు శవసంబంధీకులకు అప్ డేట్లు ఇస్తుంటారట. ఒక్కో శవాన్ని భద్రపరచడానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగితే చాలట. అమెరికాలో ఈ మరణాంతర దేహభద్రతా పేటికల (బాడీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ల) వ్యాపారంలో అయిదు కంపెనీలు బిజీగా ఉన్నాయి.
ఏదో కల్పిత గాథల్లో, సినిమాల్లో, పురాణ కథల్లో ఇది సాధ్యం కానీ…యుగయుగాల ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఇలా చనిపోయినవారిని మళ్లీ బతికించడం ఎలా సాధ్యం? చెప్పేవారికి బుద్ధి లేకపోతే…వినేవారికైనా ఉండద్దా? అని వైద్యశాస్త్ర నిపుణులు కొట్టిపారేస్తున్నారు.
ఏయ్!
ఎవర్రా అక్కడ?
“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి”
పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం దిగులుపడవద్దు”
అని లౌడ్ స్పీకర్లో పెట్టింది!
చావు నుదుట పాత గీతను మార్చి…కొత్త గీత రాస్తున్నాం!
ఆపండి ఆ గీతను!
ఇదే కనుక ఫలిస్తే-
1. పుట్టుక
2. చావు
3. మళ్లీ పుట్టుక- అని మూడు దశలుగా చెప్పుకోవాలట. బర్త్, డెత్ సర్టిఫికెట్లలో కూడా రీ బర్త్, రీ డెత్ (చావడం ఇష్టం లేనివారికి ఈ కాలం అనవసరం!) అన్న మరో కాలం యాడ్ చేసుకోవాలట!
ఓహో! అదా సంగతి!
“పునరపి జననం పునరపి మరణం…
కోల్డ్ స్టోరేజ్ శయనే బహు శవానందం…”
అంటే అర్థం ఇదా!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article