“స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?”
అని ప్రశ్నించాడు ధర్మపురి నరసింహస్వామి గుడి మెట్లమీద కూర్చుని కవి శేషప్ప.
“తళుకు జెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ!దశరధుడు శ్రీరామ రారాయని బిలువ మును తపమేమి చేసెనో తెలియ!”
అని అంతటి అవతార పురుషుడైన రాముడి తళుకు చెక్కుల బుగ్గలమీద అల్లారుముద్దుగా ముద్దు పెట్టడానికి కౌసల్య; రారా రామా! అని కొడుకును పిలవడానికి దశరథుడు పూర్వజన్మల్లో ఎంత తపస్సు చేశారో! అని పరిశోధించాడు నాదబ్రహ్మ త్యాగయ్య.
“అమ్మను మి౦చి దైవమున్నదా!
ఆత్మను మి౦చి అర్థమున్నదా!
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అ౦దిరిని కనే శక్తి అమ్మ ఒక్కతే!
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!”
అని రాముడైనా, కృష్ణుడైనా అవతరించాలనుకుంటే ఒక అమ్మకు కొడుకుగా పుట్టాల్సిందే. ఆ అమ్మ కడుపులో నవమాసాలు ఉండాల్సిందే. ఆ తల్లి పాలు తాగి పెరగాల్సిందేనని తీర్మానించారు సి నా రె.
Ads
శంకరాభరణంలో వంకరోపాధ్యాయుడు చెప్పినట్లు ఇదంతా-
“పూర్వం ఎప్పుడో పడవల్లో
ప్రయాణం చేసేటప్పుడు అనుకున్న మాటలు.
ఇప్పుడు ?
బస్సులు, రైళ్ళు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు, అన్నీ వచ్చేశాయా?
స్పీడు !
లోకమంతా స్పీడే.
మన దైనందిన జీవితంలో
ఎలాగైతే స్పీడు వచ్చిందో…
అలాగే గర్భధారణలో కుడా రావాలి. వచ్చింది!”
తల్లి గర్భం మొదలు ఇప్పుడంతా కృత్రిమం. సాంకర్యం. టీకాలు. వ్యాక్సిన్లు. చుక్కలు. అతి శీతల గాజు గదుల్లో ప్రాణమున్న బొమ్మల పెంపకం అక్షరాలా ప్రయోగశాలలో వ్యవసాయమవుతోంది.
తల్లి గర్భంలో పుట్టినా చివరకు మట్టిలో మట్టిగానో, బూడిదగానో పోవాల్సింది మాత్రం ప్రకృతి గర్భంలోకే.
ఈ మాతృగర్భ జనన జ్ఞానం; పునరపి జనన-మరణ చక్రభ్రమణ వేదాంత జ్ఞానమంతా గతం. ఇప్పుడు ఆధునిక శాస్త్రజ్ఞానం తల్లి గర్భమే లేకుండా పిల్లలను కంటోంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఏ రంగు, ఏ రూపం, ఎలా కావాలనుకుంటే అలా ప్రోగ్రామింగ్ రాసి పెట్టి… ప్రయోగశాలల్లో పిల్లలను పుట్టించే అత్యాధునిక కృత్రిమ గర్భాలు (Artificial wombs)వచ్చాయి.
శాస్త్రజ్ఞానం కడుపు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పండుతుంది. జ్ఞానం ఎలా పుట్టాలనుకుంటే అలాగే పుడుతుంది. పుడుతూ…పుడుతూ ఆగుతుంది. ఆగుతూ…ఆగుతూ పుడుతుంది. పుట్టకముందే పిండం మాట్లాడుతుంది. పెరగకముందే పిండం పరుగులు పెడుతుంది.
వ్యవసాయంలో కొత్త విత్తనాలను ఎలా పుట్టించారో! అధిక దిగుబడి హైబ్రిడ్ రకాలకు ఎలా పురుడు పోశారో! అలాగే మేలిమి రకం పిల్లలను కూడా ప్రయోగశాలల్లో అధిక దిగుబడి పంటగా పండిస్తారట!
“తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు…”
అన్న కవి శేషప్ప పద్యాన్ని తిరగరాసుకోవాల్సిన రోజులొచ్చాయి.
ప్రయోగశాల గర్భము నుండి;
డీప్ ఫ్రీజర్ గర్భము నుండి;
తల్లిదండ్రిలేని గర్భము నుండి;
గాజు సీసా గర్భము నుండి-
అని పాత సీస పద్యాలను కొత్త కృత్రిమ గర్భ గాజు సీసాల్లోకి తర్జుమాగా ఒంపుకుని పాడుకోవాల్సిన రోజులొచ్చాయి!
“ఎవరికి పుట్టిన బిడ్డరా?
ఎక్కెక్కి ఏడుస్తోంది!”
అని తెలుగులో సామెత ఇందుకే పుట్టిందేమో!
ఏమో!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article