అలియా భట్… ఇండియన్ సినిమా హీరోయిన్లలో ప్రస్తుతం టాప్ టెన్‌లో ఒకరు… బాగా నటించగలదు కూడా… ఈమధ్య ఓ బిడ్డకు తల్లి అయ్యింది కదా… నో అద్దెకడుపులు, నో ఐవీఎఫ్, నో ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ ఎటాల్… ప్యూర్ మదర్, నాట్ సరోగేటెడ్ మదర్… కొద్దిరోజుల క్రితం ఓ సాయంత్రం తన లివింగ్ రూమ్‌లో కూర్చుని ఉండగా, ఎవరో తనను గమనిస్తున్నట్టు, చూస్తున్నట్టు అనిపించిందట… ఎన్నడూ లేనిది ఏమిటీ ఫీలింగ్ అని మొదట ఆశ్చర్యపోయింది…
హఠాత్తుగా తమ ఇంటి పక్కనున్న బిల్డింగ్ వైపు దృష్టి సారించింది… ఎగాదిగా చూసింది… ఇద్దరు మనుషులు టెర్రేస్‌లో నిలబడి ఆమె వైపు కెమెరాను గురిపెట్టి నిల్చున్నారు… ఆమె తమనే చూస్తున్నదని తెలిసి హడావుడిగా జారుకున్నారు… ఇదంతా ఎవరో కాదు, ఆమే తన ఇన్‌స్టాలో రాసుకుంది… అప్పటికే కొన్ని ఫోటోలు తీశారట వాళ్లు… అసలు పొరుగు బిల్డింగ్ వాళ్లు ఎలా అనుమతించారు అనేది ఒక ప్రశ్న…
మరీ ఒక ఇంట్లో రిలాక్స్‌డ్‌గా కూర్చుని ఉన్నప్పుడు, మరీ పక్కింటి డాబా ఎక్కి ఫోటోలు తీయడం ఒకరకంగా క్రైమే… ఒక వ్యక్తి ప్రైవసీలోకి జొరబడటం… విదేశాల్లో సెలబ్రిటీల ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు తీసి అమ్ముకుంటుంటారు… అదొక దందా… అది మన దేశంలో కూడా ఎప్పటి నుంచో ఉన్నదే… కానీ మరీ ఈ స్థాయికి విస్తరించడం కొత్త కొత్తగా అనిపిస్తోంది… మండిపోయింది ఆమెకు… ఇప్పటివరకూ తన బిడ్డ మొహమే మీడియాకు రిలీజ్ చేయలేదు ఆమె…
Ads
అంత గోప్యతను పాటిస్తోంది… బిడ్డ రూపురేఖల్ని కూడా అమ్ముకోవడం ఆ అమ్మకు ఇష్టం లేదు… కొన్ని నటనేతర, వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో ఆలియా భట్ పోకడ భలే నచ్చేస్తుంది… కపూర్ ఇంటి కోడలు కదా, ఆ విశిష్టతను మెయింటెయిన్ చేస్తుంది… ఈ పక్కింటిపై నుంచి ఫోటోల విషయానికి వస్తే… ‘‘నాతో ఆడుకుంటున్నారా..? మాకు ప్రైవసీ ఉండదు అనుకుంటున్నారా..? ఇంట్లో కూర్చున్నా సరే, మాపై ఈ కెమెరా కళ్ల నీడలేమిటి..? ఈ పోకడలను ఆమోదిద్దామా..? ఇవన్నీ లక్ష్మణరేఖల్ని దాటేయడమే…’’ అని మండిపడుతోంది…
నిజానికి ఆమె మీడియాతో, సోషల్ మీడియా మిత్రులతో సరదాగా బాగుంటుంది… కొన్ని విషయాల్లో తన తెలియనితనాన్ని ప్రదర్శించుకోవడం పట్ల కూడా ఆమె బాధపడదు… తను కడుపుతో ఉన్నప్పుడు కూడా బోలెడు ఫోటోలకు వోకే చెప్పింది… అదే చాలామంది ఫోటోగ్రాఫర్లకు అలుసైపోయినట్టుంది బహుశా…
ఈ ప్రైవసీ ఉల్లంఘన అనేది ఆమధ్య విరాట్ కోహ్లీ విషయంలోనూ జరిగింది… అది ఇంకా దారుణం… తన హోటల్ రూంలో వీడియోలు తీశారు… తీసింది ఒక ఫ్యాన్ అని తేలింది… ‘‘మరీ మా బతుకుల్లోకి ఇంతగా జొరపడకండి… మేం కట్టే బట్టలు, రాసుకునే సబ్బులు, వాడే ఉపకరణాలు చూడటానికి ఫ్యాన్స్ ఇష్టపడతారు సరే, కానీ ఒక హోటల్ రూంలోని ప్రైవసీ దొరక్కపోతే, ఇక మాకు పర్సనల్ స్పేస్ ఎక్కడున్నట్టు..? మమ్మల్ని దయచేసి వినోదసరుకుగా మార్చేయకండి..’’ అని ఘాటుగా రియాక్టయ్యాడు…
‘‘మన అభిమాన ఆటగాళ్లే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనే ఫ్యాన్స్ మెంటాలిటీ చాలాసార్లు ఇబ్బంది పెడుతుంది… ఇలా మా పర్సనల్ స్పేస్‌లోకి చొచ్చుకు వస్తే, ఎక్కడ ఆగుతుంది ఇది…? చివరకు మా బెడ్‌రూంల దాకా వచ్చేస్తుందేమో’’ అని కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది… అవును, ఒక ఆలియా భట్, ఒక విరాట్ కోహ్లీ ఆందోళనగా చెబుతున్నట్టు… వాళ్ల పర్సనల్ స్పేస్‌ను గౌరవించాలి కదా… వాళ్లూ మనుషులే కదా…!!
Share this Article